విశాఖపట్నం: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగుర్రాల పల్లెలో దళిత మైనర్ బాలికపై టీడీపీ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్యక్షురాలు, ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కల్యాణి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు ఆరునెలలలుగా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన 14 మంది యువకులు బాధిత బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియో తీసి బెదిరించిన ఘటన సభ్యసమాజం సిగ్గుపడేలా ఉందన్నారు. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత గ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం అత్యంత దుర్మార్గమని... కేవలం అధికార పార్టీ అండ చూసుకునే నిందితులు ఈ దురాగతానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఓ దళిత మహిళ హోంమంత్రిగా ఉన్నా కూడా.. రాష్ట్రంలో ఓ దళిత మైనర్ బాలికకు అన్యాయం జరిగితే నిందితులను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం, గంజాయి, డ్రగ్స్ విచ్చల విడిగా దొరుకుతున్నాయని...జరుగుతున్న అఘాయిత్యాలకే ఇవే కారణమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే గంజా, డ్రగ్స్ ను అణిచివేస్తామని ఘనంగా ప్రకటించిన చంద్రబాబు... ఆ దిశగా తీసుకున్న చర్యలేవీ లేవన్నారు. కేవలం విపక్ష పార్టీల నేతలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యల్లో మునిగితేలుతున్న కూటమి ప్రభుత్వం... శాంతిభద్రతల పరిరక్షణలోనూ, మహిళల రక్షణలోనూ పూర్తిగా విఫలమైందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ యాప్ ,దిశ పోలీస్ స్టేషన్లను పూర్తిగా నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వం... మహిళల రక్షణను గాలికొదిలేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలన అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అకృత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం మొద్దునిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఏదో ఒక చోట ఆడబిడ్డలపై అకృత్యాలు జరుగుతున్నా... ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తప్పు చేస్తే..తెనాలిలో బహిరంగంగా శిక్షించినట్టు చేయడం తప్పేంటన్న హోంమంత్రి.... సత్యసాయి జిల్లాలో మైనర్ దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ టీడీపీకి చెందిన నిందితులను ఎందుకు ఆ తరహాలో శిక్షించడం లేదని నిలదీశారు. కేవలం ప్రభుత్వ ఉదాసీనత వల్లే వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. దిశ తరహాలో బాధితులకు అండగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, నిందితులకు సకాలంలో శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.