తాడేపల్లి: సోము వీర్రాజు మాట్లాడిన "సారా మాటల" డైవర్షన్ కోసమే బీజేపీ చీప్ పాలిట్రిక్స్ చేస్తోందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మండిపడ్డారు. స్వాతంత్ర్యానికి పూర్వమే గుంటూరులో నిర్మించిన జిన్నా టవర్ ను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయం చేయాలని చూడటం ఆ పార్టీ సంస్కృతిని తేటతెల్లం చేస్తుందన్నారు. జీవీఎల్ నుంచి విష్ణు వరకూ ఆ పార్టీ నేతలందరికీ సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాతే జిన్నా టవర్ గుర్తొచ్చిందా..? అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అప్పిరెడ్డి ప్రశ్నించారు. జిన్నా టవర్ పేరు మార్చాలనీ, లేదంటే తామే కూలుస్తామనీ బీజేపీ నాయకులు మూకుమ్మడిగా విద్వేష విషం చిమ్మడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిగ్గులేని సారా మాటలు మాట్లాడిందేగాక, పైగా డైవర్షన్ రాజకీయాలా...? అని దుయ్యబట్టారు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడూ ఈ దేశ భక్తుడే అని, బీజేపీ వారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. చారిత్రక కట్టడమైన జిన్నా టవర్ ను... అప్పట్లో మత సామరస్యం కోసం కట్టారన్నారు. చరిత్ర కూడా తెలియని చరిత్ర హీనులు బీజేపీ నేతలని అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. "బీజేపీ నేతల మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. గుంటూరులోని జిన్నాటవర్ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మించినది కాదు. ఎప్పుడో స్వాతంత్య్రానికి పూర్వం 1945లో కట్టిన కట్టడమది. అది బీజేపీ నేతలకు అకస్మాత్తుగా ఎందుకు గుర్తొచ్చిందో అర్ధం కావడం లేదు. అది కూడా గుంటూరులోని బీజేపీ నేతలు కాకుండా, ఎక్కడో కడపలో ఉండే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ దీనిపై తొలుత ట్వీట్ చేయడం, దానిని సమర్ధిస్తూ జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, రాజాసింగ్ వంటి వారు గొంతు కలపడం చూస్తుంటే... ఇది కచ్చితంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బీజేపీ ఒక పథకం ప్రకారం చేస్తున్న విద్వేషపూరిత రాజకీయం. ముఖ్యమంత్రి జగన్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ప్రశాంతంగా ఉన్న ప్రజల్లో మత విద్వేషాల చిచ్చు రగిల్చి తద్వారా ఏపీలో తమ ఉనికిని చాటుకోవాలన్న బీజేపీ పన్నాగంగా కనిపిస్తోంది. అసలు గత కొన్ని రోజుల నుంచి గమనిస్తే బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల పట్ల సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. ఆ పార్టీ నేతల వ్యాఖ్యలను చూసి రాష్ట్ర ప్రజలంతా ఏవగించుకుంటున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వయంగా మాట్లాడుతున్న పరిస్థితిని అంతా గమనిస్తున్నారు. బహుశా దేశ చరిత్రలోనే సారాయి పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ." అని లేళ్ళ అప్పిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. దేశభక్తి గురించి బీజేపీ నేతలు మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని లేళ్ళ అప్పిరెడ్డి ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేను పూజించే బీజేపీ నేతలకు దేశభక్తి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. ఇక జిన్నా గురించి, గుంటూరులో ఆయన పేరుతో ఉన్న జిన్నా టవర్ ఉండకూడదనీ వ్యాఖ్యానిస్తున్న బీజేపీ నేతలు, గతంలో వారి పార్టీకి చెందిన జాతీయస్థాయి కీలక నాయకులు జిన్నా గురించి చేసిన వ్యాఖ్యలు ఒకసారి తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ సీనియర్ నాయకుడులైన అద్వాణి 2005లో పాకిస్తాన్‌ను సందర్శించిన సమయంలో జిన్నా సమాధి ఎదురు నిలబడి, "భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన లౌకికవాది జిన్నా. ఆయన హిందూ–ముస్లింలకు అంబాసిడర్ వంటి వారు." అని మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా అప్పిరెడ్డి గుర్తు చేశారు. అంతేకాక జిన్నాను ఉద్ధేశించి చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటారా...? అని 2008లో అద్వాణిని కొందరు విలేకరులు ప్రశ్నించిన సందర్భంలో సైతం ఆయన వెనక్కు తీసుకోనని విస్పష్టంగా ప్రకటించిన ఉదంతాన్ని కూడా ఉదహరించారు. వాటికి సంబంధించిన పేపర్ క్లిప్పింగులను కూడా అప్పిరెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. రాజకీయ లబ్ది కోసం, ఒక పథకం ప్రకారం మత విద్వేషాలు, సమాజంలో వైషమ్యాలు సృష్టించాలని చూస్తున్న బీజేపీ నేతలంతా ముందు ఈ విషయంపై అద్వాణితో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవాలని లేళ్ళ అప్పిరెడ్డి సూచించారు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా ప్రజల మద్దతు కూడగట్టుకోవాలే కానీ... ఇలా మతకల్లోలాలు సృష్టించడం ద్వారా, వక్రమార్గాన పయనించి, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడటం మంచి పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. ఏపీలో ముఖ్యమంత్రి జగన్ గారి పరిపాలనలో బీజేపీ ఆటలు సాగే పరిస్థితి లేదని, ఇలాంటి చీప్ ట్రిక్స్ ఇక్కడ పారవని ఆయన స్పష్టం చేశారు. కాదూ, కూడదని కుట్ర రాజకీయాలతోనే ముందుకు సాగుదామని చూస్తే చైతన్యవంతులైన తెలుగు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంటారని లేళ్ళ అప్పిరెడ్డి హెచ్చరించారు.