బాబు రైతుల కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పాలి

ఎన్టీఆర్‌ను మించిన నటుడు చంద్రబాబు

రాజధాని ప్రాంతానికి వచ్చి మొసలి కన్నీరు ఎందుకు

అమరావతి రోడ్ల నిర్మాణంలో కూడా బాబు అవినీతి

ఐదేళ్లలో ఒక్క శాశ్వత భవనం అయినా నిర్మించారా..?

రైతులు కడుపుమంటతోనే బాబు పర్యటనను వ్యతిరేకించారు

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రజారాజధాని నిర్మిస్తాం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి

 

తాడేపల్లి: చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని రైతుల కాళ్లకు మొక్కి క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్‌ చేశారు.  అమరావతి ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం పెట్టి తన నటనను మొదలుపెట్టాడని, ఐదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేశాడన్నారు. రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని తన అనుచరులకు, కార్పొరేట్, విదేశీ కంపెనీలకు, యోగా నేర్పించే బాబాకు వేల ఎకరాల అప్పనంగా కట్టబెట్టాడని మండిపడ్డారు. ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో తాత్కాలిక భవనాలు తప్ప శాశ్వతంగా నిర్మించిన ఒక్క బిల్డింగ్‌ అయినా ఉందా అని ప్రశ్నించారు. బాహుబలి గ్రాఫిక్స్‌ తప్పితే చంద్రబాబు చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మోసం చేసిన చంద్రబాబు అమరావతి పర్యటనకు వస్తుంటే రైతులు కడుపుమండి నిరసన తెలిపారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా రాజధాని నిర్మిస్తామని చెప్పారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే పార్థసారధి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి రాజధానిని పవిత్ర ప్రాంతంగా, రాజధాని నిర్మాణం పవిత్ర కార్యక్రమంగా భావించినట్లు మోడీ శంకుస్థాపన చేసిన స్థలం దగ్గరకు వెళ్లి సాగిలపడి నమస్కారం పెట్టి నటిస్తున్నాడు. ఒకపక్క సాష్టాంగ నమస్కారం పెడతారు. ఆయన కార్యకర్తలు బూట్లు వేసుకొని అదే మట్టిని తొక్కుతారు. ఆయన సాష్టాంగం చేసి మొక్కాల్సింది రైతుల పాదాలకు అని గుర్తుచేస్తున్నాం. రైతులను మోసం చేసి, రైతులకు మాయ మాటలు చెప్పి అమరావతి రాజధాని పేరు మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి 33 వేల ఎకరాలను లాక్కొని దోచేయడం కోసం ప్లాన్‌ వేసిన వ్యక్తి చంద్రబాబు. 33 వేల ఎకరాల ఇచ్చిన పేద రైతుల గురించి ఐదేళ్లలో ఏ ఒక్క రోజు ఆలోచించలేదు. ప్లాట్ల రూపంలో ఇస్తానన్న స్థలాలను కనీసం అభివృద్ధి చేయకుండా బార్డర్‌ స్టోన్స్, రోడ్లు వేయకుండా చేసింది చంద్రబాబే.
అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా రైతుల నుంచి తీసుకున్న భూమికి ప్రతిఫలంగా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వకుండా.. ఆ భూములను మాత్రం సింగపూర్‌ కంపెనీలకు, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు, లక్షల రూపాయలు ఫీజులు దండుకునే ప్రైవేట్‌ యూనివర్సిటీలకు, అనుచరులకు, డ్యాన్స్‌లు, యోగాలు నేర్పించే బాబాలకు వేల ఎకరాలు ఇచ్చాడు. ఇప్పుడు రాజధాని ప్రాంతానికి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. ఏదో గొప్ప కట్టడాలు కట్టినట్లుగా వైయస్‌ఆర్‌ సీపీ కూల్చేసినట్లుగా మాట్లాడుతున్నాడు.

ఒక్క శాశ్వత భవనం అయినా ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నిర్మించాడా..? తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు అన్నీ తాత్కాలికమే.. టెంప్రరీ పేరుతో ఒకసారి, పర్మినెంట్‌ పేరుతో మరోసారి దోచుకోవడానికి చంద్రబాబు ఆలోచన చేశాడేమో. రాజధాని ప్రాంతంలో ఎనిమిది లైన్ల రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.42 కోట్లు కేటాయించి దోచుకున్నారు. పెద్ద పెద్ద నగరాలకు నాలుగు లైన్ల రోడ్లు, ఆరు లైన్ల రోడ్లు రాజధాని నగరం ఏర్పడిన తరువాత వేస్తే చంద్రబాబు కేవలం దోచుకునే ఉద్దేశంతో రూ.42 కోట్లు కిలోమీటర్‌కు, బిల్డింగ్‌లకు అయితే రూ.7 నుంచి 11 వేల వరకు చదరపు అడుగు నిర్మాణానికి ఇచ్చాడు. ఇవన్నీ చంద్రబాబు చేసిన పాపాలే.

లక్ష కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తానని చెప్పిన చంద్రబాబు ఐదేళ్లో ఖర్చు చేసింది కేవలం రూ. 5 కోట్లు మాత్రమే. సెట్టింగులు వేయడం, బాహుబలి గ్రాఫిక్స్‌ చూపించడం తప్పితే నువ్వు చేసిందేమిటి చంద్రబాబు.
 
చంద్రబాబు అమరావతికి వస్తుంటే రాళ్లు, చెప్పులు వేశారని టీవీల్లో చూశాం. నిజంగా అభివృద్ధి చేశాడు. రైతులకు న్యాయం చేశాడని ఆ ప్రాంత రైతులు భావించి ఉంటే.. రాళ్లు, చెప్పులు వేస్తుంటే ఆ ప్రాంత ప్రజలు ఊరుకుంటారా..? కడుపుమంట ఉంది కాబట్టే ఆ ప్రాంత రైతులు నిరసన తెలిపారు. ప్రజల రాజధాని నిర్మాణం అని చెప్పి మోడీ శంకుస్థాపనకు వస్తే ఆ వేదిక మీద స్థానిక దళిత ఎమ్మెల్యేకి కుర్చి వేసి పక్కన కూర్చోబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు. ఆనాటి ప్రభుత్వాలు దళితులకు ఉపాధి కల్పించడం కోసం వ్యవసాయ భూమిని అసైన్డ్‌ చేసి ఇస్తే ఆ భూములను కూడా చంద్రబాబు, ఆయన మంత్రులు దోచేసుకున్నారు. ఆ తరువాత వాటిని రైగ్యులరైజ్‌ చేస్తానని చంద్రబాబు మాట్లాడాడు. ఇదేనా న్యాయం. అందుకనే దళితులు కడుపుమంటతో ఎదురుతిరిగారు.

మా నాన్నను చూసి భూములు ఇచ్చారని లోకేష్‌ అంటున్నాడు.. మీ నాన్న అందాన్ని చూసి ఇవ్వలేదు. రాష్ట్ర రాజధానికి మనవంతు సహకారాన్ని అందించాలని రైతులు  ఇచ్చారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి చంద్రబాబు దివాళా తీయించాడు. అలాంటి రాష్ట్రాన్ని నెత్తిపైకి ఎత్తుకొని సీఎం వైయస్‌ జగన్‌ పాలిస్తున్నాడు. ఎన్నికల హామీలు చంద్రబాబుకు నీటి బుడగల్లాంటివి. కానీ సీఎం వైయస్‌ జగన్‌ అలాంటి వ్యక్తి కాదు. మేనిఫెస్టోను పవిత్రంగా భావించిన వ్యక్తి కాబట్టి హామీలన్నీ ఆరు నెలల పాలన పూర్తిచేసుకోకముందే అమలుచేస్తున్నాడు.

చంద్రబాబు డ్రామా వేయడంలో దిట్ట ఎన్టీఆర్‌కు నటనలో ఉన్న బిరుదులను కట్నంగా చంద్రబాబుకు ఇస్తే ఇంకా బ్రహ్మాండమైన నటుడిగా బిరుదు పొందేవాడేమో.. చంద్రబాబు రైతుల పాదాలకు నమస్కారం పెట్టి క్షమాపణ కోరాలి. చంద్రబాబును అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు. రాష్ట్రంలో ఏమూలకైనా తిరగొచ్చు చంద్రబాబు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజారాజధానిని నిర్మిస్తాం. రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతా’మని ఎమ్మెల్యే పార్థసారధి చెప్పారు.

 

Read Also: చంద్రబాబు అమరావతి ఎందుకు వెళ్లారు?

Back to Top