జవాద్ తుపాన్ పట్ల ప్రజలందరూ అప్రమత్తగా ఉండాలి 

 ఎమ్మెల్యే కంబాల జోగులు 

శ్రీ‌కాకుళం: జ‌వాద్ తుపాను హెచ్చరికల దృష్ట్యా ప్రజలు ఎవరూ బయట తిరగకండి, గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపిటిసిలు పర్యవేక్షణ అవసరం. అధికారులతో సమన్వయం చేసుకుని విపత్తును ఎదుర్కోవాల‌ని ఎమ్మెల్యే కంబాల జోగులు సూచించారు.  అత్యవసరమైతే పోన్ ద్వారా సంప్రదించండి ప్రతిక్షణం నా ప్రజల కోసం నేను అందుబాటులో ఉంటాన‌ని పేర్కొన్నారు. శుక్ర‌వారం స్థానిక కార్యాల‌యంలో తుపాన్ పై అధికార యంత్రాంగంతో ఎమ్మెల్యే స‌మీక్ష నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ..వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయంగా 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని తెలిపారు.  ఈ వాయుగుండం వాయవ్య దిశగా పయనించి, రాగల 24 గంటల్లో తుపానుగా మారుతుందని ఎమ్మెల్యే ప్రజలకు తెలిపారు. జవాద్ తుపాను డిసెంబరు 4వ తేదీ వేకువజామున ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉత్తర కోస్తా, ఒడిశా తీర ప్రాంతాలకు ఐఎండీ ఇప్పటికే వర్ష సూచన జారీ చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు, దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర లో ఈ రోజు నుంచి తుపాను ప్రభావం కనిపిస్తుందని పేర్కొనడంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకు రావడం‌మానేయాలని కోరారు.వర్షాలు భారీ స్థాయిలో కురుస్తాయి కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు ముందస్తు చర్యలు తీసుకోవాలి. అలాగే గ్రామాల్లో ప్రజలు  బయటకు రాకుండా జాగ్రత్తలు వహించాలి. సర్పంచ్లు, ఎంపిటిసిలు, ఇతర నాయకులు ప్రజల అవసరాలపై దృష్టి సారించి సమస్యలను వెంటనే పరిష్కరించే విదంగా సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిరంతరం పర్యవేక్షణ చేస్తూ విపత్తును ఎదుర్కోవాలని కోరారు. మండలాల్లో ఎంపిపిలు వైసిపి నాయకులు కూడా లోతట్టు ప్రాంతాలని తుఫాను ప్రభావిత ప్రాంతాలను గుర్తించి సహాయక చర్యల్లో నిమగ్న మవ్వాలని కోరారు. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులతో నాయకులు ప్రజా ప్రతి నిధులు మమేకం కావాలని కోరారు. ఎవరికి ఎటువంటి అవసరం ఉన్న మీ శాసన సభ్యులు కార్యాలయానికి కానీ ఎమ్మెల్యేకు కానీ పోన్ ద్వారా సమస్యను వివరించాలని కోరారు. జిల్లా తుఫాను సహాయక చర్యలు పట్ల కంట్రోల్ రూం నెంబరు కూడా అందుబాటులో ఉందని వాటిని ప్రజలకు చేరేలా అధికారులు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెల్లవద్దని. ప్రజలు ఎవరూ తొందరపాటు చర్యలు చేయకుండా అప్రమత్తంగా ఉండి విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యే కోరారు.
 

Back to Top