అనంతపురం: మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చిన జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. జగనన్న పాలనలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని జడ్పీ చైర్ పర్సన్ బోయ గిరిజమ్మతో కలిసి నిర్వహించారు. ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును వివరిస్తూ, స్థానికుల సమస్యలు వింటూ వాటికి పరిష్కారాలను సంబంధిత అధికారులకు తెలుపుతూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ.. జగనన్న పాలనలో పేదల ఇంట సంక్షేమ పథకాల పంట పండుతోందన్నారు. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో అవినీతి రహిత పాలనను అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మాత్రమేనని అన్నారు. రోజురోజుకూ ప్రభుత్వంపై ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఆదరణ కోల్పోతున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగలేక జనసేనపై ఆధారపడుతోందని విమర్శించారు. ఎంత మంది కలసి వచ్చినా వైయస్ఆర్‌సీపీ విజయాన్ని అపలేరన్నారు. ప్రజల భవిష్యత్తుకు తిరుగులేని గ్యారెంటీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే అందించగలదని పద్మావతి స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విద్య సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, డీసీఎంఎస్ డైరెక్టర్ శ్రీరామి రెడ్డి, సర్పంచు పక్కీరమ్మ, ఎంపీటీసీ నల్లప్ప, మండల నాయకులు, మండల అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.