తాడేపల్లి: బీసీ నేత అయినంత మాత్రానా పోలీసు అధికారిపై దౌర్జన్యం చేయవచ్చా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే జోగి రమేష్ టీడీపీ నేతలను ప్రశ్నించారు. పోలీసు అధికారిపై దౌర్జనం చేశాడు కాబట్టే టీడీపీ నేత కొల్లు రవీంద్రను అరెస్టు చేశారని ఆయన స్పష్టం చేశారు. గురువారం వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న మచిలీపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోలీసు అధికారుల మీద ఏ విధమైన భాష వాడాడు? ఏ విధంగా వారిపై దౌర్జన్యం చేశాడు? ఒక అధికారిని ఛాతీ మీద గుద్ది తోసివేశాడు. వాటన్నింటినీ మీడియా చూపింది. సోషల్ మీడియాలో అవన్నీ బాగా వైరల్ కూడా అయ్యాయి. పోలీసులపై కొల్లు రవీంద్ర దురుసు ప్రవర్తనను విజ్ఞులైన ప్రతి ఒక్కరు, మీడియా, పోలీసు అధికారులు కూడా ఖండించడాన్ని కూడా అందరం చూశాం. కొల్లు రవీంద్ర ప్రవర్తన చూస్తుంటే, చంద్రబాబుకు ఏ విధంగా పిచ్చి పట్టిందో.. లోకేష్‌కు బాగా దగ్గరగా ఉండే కొల్ల రవీంద్రకు కూడా లోకేష్‌కు ఎలా పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడో, అలాగే పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్నాడు. చంద్రబాబునాయుడు గారు కావొచ్చు, లోకేష్ కావొచ్చు అచ్చం వారిని పుణికి పుచ్చుకున్నట్లుగా పోలీసు అధికారులను బండ బూతులు తిడుతూ, ఒక అధికారి గుండె మీద గుద్దుతూ ఆయన ప్రవర్తించిన దాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించడమే కాదు, ఆయన మీద కేసు పెట్టడం, అరెస్టు చేయడం కూడా జరిగింది. అయితే దానికేదో పెద్ద రాద్దాంతం జరిగిపోయినట్లు, అన్యాయం, అక్రమం జరిగిపోయినట్లు, చేయకూడని విధంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు కేసు పెట్టినట్లు చంద్రబాబు, లోకేష్ మొదలు అచ్చెన్నాయుడు, దేవినేని, కళా వెంకట్రావు, కేశినేని వరకు మొత్తం మాట్లాడారు. ఒకరేమో ట్విట్టర్ అంటారు. ఒకరేమో పాత్రికేయుల సమావేశం పెడతారు. మరొకరేమో పత్రికా ప్రకటన ఇస్తారు. అసలు ఏం జరిగింది? దేశం కానీ రాష్ట్రం కానీ అల్లకల్లోలం అయిపోయిందా? కొల్లు రవీంద్ర బీసీ. మాజీ మంత్రి. అయినంత మాత్రాన పోలీసు అధికారులను తిడతారా? వారికి కొడతారా? వారితో దుర్భాషలాడతారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యంలో ఎస్సీలకు ఒక న్యాయం, ఎస్టీలకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయం, చంద్రబాబుకు ఒక న్యాయం, ఆయన కొడుక్కి ఒక న్యాయం ఉంటాయా? అవన్నీ మీ ప్రభుత్వ హయాంలో ఉండొచ్చు. చంద్రబాబుకు ఒక న్యాయం, ఆయన కొడుక్కు ఒక న్యాయం, తహసీల్దార్‌ను జుట్టు పట్టి ఈడ్చిన చింతమనేనికి ఒక న్యాయం, రవాణా శాఖ అధికారులను తన్నిన బొండా ఉమకు ఒక న్యాయం ఉండొచ్చు. మీ ప్రభుత్వ హయాంలో ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఉండొచ్చు. అలాగే మీకొక చట్టం ఉండొచ్చు. కానీ ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో కొల్లు రవీంద్ర అయినా ఒకటే. జోగి రమేష్ అయినా ఒకటే. పేర్ని నాని అయినా ఒకటే. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఒక బా«ధ్యత కలిగిన వ్యక్తులు తప్పుగా వ్యవహరిస్తే, జగన్ గారి పాలనలో తమ, పర భేదం ఉండదు. కానీ ఇక్కడ బీసీలని ప్రస్తావిస్తున్నారు. నిజానికి బీసీలకు ఏం అన్యాయం జరుగుతుంది చంద్రబాబునాయుడు గారు. నిజానికి బీసీలను బ్యాక్‌బోన్ క్లాసులుగా మార్చిన సీఎం జగన్ గారు. బీసీలను శక్తివంతులుగా మార్చింది జగన్ గారు. ఆయన వల్లనే మేము ఇవాళ తలెత్తుకుని తిరుగుతున్నాము. మాకు ఆయన బలాన్నిచ్చాడు. ధైర్యం ఇచ్చాడు. మాకు పెద్ద పీట వేశాడు. స్పీకర్‌గా బీసీని కూర్చోబెట్టాడు. మంత్రివర్గంలో కూడా తగిన ప్రాతినిథ్యం కల్పించాడు. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఛైర్మన్లు, 672 మందికి డైరెక్టర్లుగా పదవులు ఇచ్చాడు. మార్కెటు యార్డులలో కూడీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చాడు. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ జగన్‌గారికి సెల్యూట్ చేస్తున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైయస్సార్‌సీపీ పూర్తిగా కైవసం చేసుకోబోతున్న తరుణంలో బీసీ అయిన కొల్లు రవీంద్రపై కేసు పెట్టారంటూ చంద్రబాబునాయుడు రాద్దాంతం చేస్తున్నాడు. బీసీ అయినంత మాత్రాన పోలీసులను కొట్టొచ్చు అయినా ఎక్కడైనా ఉందా? అసలు బుద్ధి ఉందా మీకు? పొద్దుటి నుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. తప్పును తప్పుగా ఒప్పుకొండి. నిజానికి చంద్రబాబునాయుడు గారు ఏనాడూ బీసీలను గుర్తించింది లేదు. వారికి ప్రాధాన్యత ఇచ్చింది లేదు. ఇక్కడ ఈ జిల్లాలో చంద్రబాబు మంత్రివర్గంలో దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర మంత్రులుగా పని చేస్తే, వారిలో దేవినేని ఉమకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు. అంటే చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వ్యక్తినే ఎక్కువగా గుర్తించాడు. దీంతో ఈ కొల్లు రవీంద్ర సొల్లు రవీంద్ర మాదిరిగా మారిపోయాడు ఆరోజున. అసలు చంద్రబాబునాయుడు నీవు ఏనాడైనా బీసీలకు ప్రాతినిథ్యం కల్పించావా? వారిని ఎదగనిచ్చావా? వారిని బానిసలుగా మార్చావే. కానీ అదే మా నాయకుడు మమ్మల్ని బలవంతులను చేశాడు. బీసీలకు పెద్ద పీట వేశాడు. మాకు దమ్ము ధైర్యం ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు. మాకు ఛైర్మన్ పదవులు ఇచ్చాడు. ఇవాళ ఏకంగా రూ.70 వేల కోట్లు బలహీనవర్గాల కోసం ఖర్చు చేశాడు. చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్. అంటే సీఎం టు సీఎం. భారతదేశంలో ఎక్కడైనా ఇలా ఇచ్చారా? ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం చేసిన సీఎం శ్రీ వైయస్ జగన్. బలహీనవర్గాలకు ఒక అండ. బలహీన వర్గాలకు ఒక ఎజెండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, బుద్ధా వెంకన్న.. ఇటువంటి వారంతా ఎందుకు? మీ అందరి బతుకు బానిస బతుకే కదా? త్వరలోనే టీడీపీ కనుమరుగు అవుతుంది. ఇప్పటికే మీరు బలి పశువులయ్యారు పార్టీలో. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు నట్టేట ముంచి పోతాడు. కొల్లు రవీంద్ర చేసిన తప్పును ఖండించాలి. ఆయనకు శిక్ష పడాల్సిందే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఓటు వేయడానికి వెళ్లి రావొచ్చు కదా? అంతే కానీ మాజీ మంత్రికి కానీ, ఎమ్మెల్యేకు కానీ పోలింగ్ బూత్ వద్ద ఏం పని? కొల్లు రవీంద్ర అలా ఎందుకు వెళ్లాడు? పోలీసులపై ఎందుకు దౌర్జన్యం చేశాడని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రశ్నించారు.