చంద్రబాబుకు రాయలసీమలో తిరిగే అర్హత లేదు

కర్నూలు ఎమ్మెల్యేఎంఏ హఫీజ్‌ఖాన్‌ 

కర్నూలులో న్యాయ రాజధానిని అడ్డుకున్నది బాబు కాదా..? 

 మేము మూడు రాజధానులు కడతాం.. మరి స్వాగతించే ధైర్యం చంద్రబాబుకు ఉందా?

బాబుకు దమ్ముంటే తన పాలనలో రాయలసీమకు ఏం చేశాడో చెప్పాలి

మా మూడేళ్ల పాలన గురించి మేము ధైర్యంగా చెబుతాం

చంద్రబాబు అధికారం లేకుండా బతకలేడు.. అబద్ధం చెప్పకుండా ఉండలేడు
 

తాడేపల్లి:  గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ విమర్శించారు. తన 14 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పుకునే దమ్ము చంద్రబాబుకు లేదన్నారు. అధికారంలో ఉండి ప్రజలకు ఒక మంచి పని చేయని చంద్రబాబు నేడు మంచి చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంత వరకు సబబని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం హఫీజ్‌ ఖాన్‌ మీడియాతో మాట్లాడారు.

అధికారం కోసం బాబు అర్రులు:
    దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి, జగన్‌గారిని సీఎంగా చేశారు. అలాగే చంద్రబాబుకు రాజకీయంగా సమాధి కట్టారు. జగన్‌గారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారు. 
దానికి భిన్నంగా చంద్రబాబు వ్యవహారం. ఆయన గతంలో ఏం చెప్పాడో ఇవాళ గుర్తుండదు. ఇవాళ చెప్పింది రేపు మర్చిపోతాడు. రేపు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఇది స్వయంగా ఆ పార్టీ వారే చెబుతున్న మాట. 
    చంద్రబాబు రాయలసీమలో పర్యటిస్తున్నారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన, అధికారం కోసం ఎంతగా అర్రులు చాస్తున్నాడనేది అర్ధమవుతుంది. చంద్రబాబు అధికారం లేకుండా బతకలేడు. అబద్ధం చెప్పకుండా ఉండలేడు.

సీమలో తిరిగే అర్హత లేదు:
    చంద్రబాబుకు అసలు రాయలసీమలో తిరిగే అర్హత ఉందా? కర్నూలులో న్యాయరాజధాని రాకుండా అడ్డుకున్నది ఎవరు? మేము మూడు రాజధానులు కడతాం. మరి స్వాగతించే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించిన చంద్రబాబు, ఏవీ నెరవేర్చలేదు.
    కానీ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌గారు, ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారు.

మేము గర్వంగా చెప్పగలం:
    కానీ మేము గర్వంగా చెప్పగలం. ఇప్పుడు గడప గడపకు వెళ్తూ మేం ఈ మూడేళ్లు ఏం చేశామన్నది చెబుతూ, ఇంకా ఏ సమస్యలు ఉన్నాయా అని అడుగుతున్నాం. అదే చంద్రబాబు తన హయాంలో కర్నూలు మున్సిపల్‌ ఎన్నికలు కూడా నిర్వహించలేదు. ఓడిపోతామన్న భయంతో.
మా పార్టీకి మున్సిపల్‌ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ ఇచ్చారు.
    మా మంత్రులు జిల్లాల పర్యటనకు బయలుదేరుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలు, విద్యార్థులకు ఏమేం చేశామన్నది మేము ధైర్యంగా చెప్పగలుగుతాం. అదే చంద్రబాబు తనన 14 ఏళ్ల పాలనలో ఇది చేశాను అని ఒక్కటి కూడా చెప్పలేకపోతున్నాడు. ఆయన రాజకీయాలు కాకుండా సినిమా డైలాగ్‌లు మాట్లాడుతున్నాడు.

గోబెల్స్‌ ప్రచారంలో పీహెచ్‌డీ:
    చంద్రబాబు తన కొడుకు, దత్తపుత్రుడిని నమ్ముకున్నారు. కానీ ఆ ఇద్దరూ ఎక్కడా గెలవలేరు. అబద్దాలు చెప్పడంలో, గోబెల్స్‌ ప్రచారంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశాడు. అందుకే అన్నీ అబద్ధాలు చెబుతూ, ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావడానికి ఆరాటపడుతున్నారు.
    కానీ మా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాలకు పూర్తి అండగా ఉంది. వారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేలా చేస్తుంది కాబట్టే, తట్టుకోలేక చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నాడు.

బ్యాక్‌బోన్‌ క్లాస్‌:
    ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందో, చేస్తుందో అందరూ చూస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి పిల్లల్లో ఇంగ్లిష్‌ పరిజ్ఞానం పెంచుతున్నారు. చంద్రబాబు బీసీలను బ్యాక్‌వర్డు క్లాస్‌గానే చూడగా, జగన్‌గారు వారిని బ్యాక్‌బోన్‌ క్లాస్‌గా చూస్తున్నారు.

ఆ టికెట్లు వారికి ఎంతకు అమ్ముకున్నారు?
    ఇవాళ బీసీలకు రాజ్యసభ టికెట్లు ఇస్తే, దాన్ని కూడా తప్పు పడుతున్నారు. మరి చంద్రబాబు గతంలో సురేష్‌ప్రభు, టీజీ వెంకటేశ్, సీఎం రమేష్, సుజనా చౌదరికి ఎలా రాజ్యసభ టికెట్లు ఇచ్చారు. మీరు ఎంతకు వాటిని అమ్ముకున్నారు. టీజీ వెంకటేష్‌కు టికెట్‌ ఇచ్చారా? అమ్ముకున్నారా? సుజనా చౌదరి దోపిడి, సీఎం రమేష్‌ లూటీ చూసి సీట్‌ ఇచ్చారా?
    మేము మంచి బీసీ లీడర్లకు రాజ్యసభ టికెట్లు ఇస్తే తప్పు పడుతున్నారు. మా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం కల్పిస్తోంది.
    ఇవన్నీ మీకు తెలుసు. అందుకే మాపై ఏవేవో మాట్లాడుతున్నారు. మీ ఎల్లో మీడియాలో హైలైట్‌ చేసుకుంటున్నారు. మిమ్మల్ని ఎవరైనా తప్పు పడితే, మీ అనుకూల మీడియాలో విమర్శలు గుప్పిస్తారు. 

అన్నీ తాకట్టు పెట్టారు:
    అప్పుడు రాజ్యసభ టికెట్లు అమ్ముకున్న చంద్రబాబు, ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, పారిపోయి విజయవాడకు వచ్చేశాడు. హైదరాబాద్‌ నగరంపై ఉన్న హక్కులను కూడా తాకట్టు పెట్టాడు. ఇన్ని చేసిన చంద్రబాబు అన్నీ అబద్ధాలు చెబుతూ, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

కుప్పంకూ చంద్రబాబు అన్యాయం:
    కుప్పం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మీరు, ఆ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పండి. కానీ, జగన్‌గారు కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారు. ఆ విధంగా ఆయనను జగన్‌గారు గౌరవిస్తే, అదే చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, చివరకు ఆయన మరణానికి కూడా కారణం అయ్యాడు.

ఆ ధైర్యం ఉందా?:
    మరోవైపు చంద్రబాబు మంత్రుల మీద కూడా అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. అన్నీ అబద్ధాలు చెబుతున్నారు. ఆయనకు కేవలం అధికారం మాత్రమే కావాలి. మంత్రులపై చంద్రబాబు విమర్శలను ఖండిస్తున్నాం.
ఆయనకు మేము చెబుతోంది ఒక్కటే. మీకు దమ్ము, ధైర్యం ఉంటే, రాజకీయాల్లో ఉనికి చాటుకోవాలంటే, మీరు మీ 14 ఏళ్ల పాలనలో ఏం చేశారో చెప్పండి. మేము ఈ మూడేళ్లలో ఏమేం చేశామన్నది ధైర్యంగా చెబుతాం. మీ 14 ఏళ్ల పాలన, మా మూడేళ్ల పాలన రెండింటినీ పోల్చి చూద్దాం. ఆ ధైర్యం మీకుందా? ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.
    చంద్రబాబు అబద్దాలు చెప్పి టైమ్‌పాస్‌ రాజకీయాలు చేస్తున్నారు. దత్తపుత్రుడికి నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. వారు తిప్పి కొడతారు. వచ్చేది మళ్లీ మా ప్రభుత్వమే. ఈ విషయం గుర్తు చేసుకోండి..అని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top