లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాలు మంజూరు చేయాలి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే  ఆర్థర్‌
 

అమ‌రావ‌తి:  క‌ర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గానికి లిప్ట్ ఇరిగేష‌న్ ప‌థ‌కాలు మంజూరు చేయాల‌ని ఎమ్మెల్యే ఆర్థ‌ర్ కోరారు. బుధ‌వారం ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో సాగునీటి స‌మ‌స్య‌ల‌పై ఎమ్మెల్యే ఆర్థ‌ర్ మాట్లాడారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, పోతిరెడ్డిపాడు, మల్లెల‌, బానకచెర్ల రెగ్యులేట‌ర్ల ద్వారా నీటిని వివిధ ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నారు. అంగట్లో అన్ని ఉన్నా..అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మా నియోజకవర్గ పరిస్థితి దాపురించింది. మా ప్రాంతం నుంచి నీటిని రాయలసీమ, నెల్లూరు, తమిళనాడు ప్రాంతాలకు తాగు, సాగునీటి అవ‌స‌రాల‌కు అందిస్తున్నాం. అయితే స్థానికంగా మా ప్రాంతానికి ఉపయోగించుకునేందుకు లిప్ట్‌  ఇరిగేషన్లు లేవు. కృష్ణాన‌ది బ్యాక్ వాట‌ర్‌ను ఉపయోగించుకోవాలంటే కొన్ని ఎత్తిపోతల పథకాలు కావాలి. రాష్ట్రాన్ని ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలించారు. కానీ దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మా నియోజ‌క‌వ‌ర్గంలో లిప్ట్‌ ఇరిగేషన్లు ఏర్పాటు చేయించారు. వీటి ద్వారా పాములపాడు, జూపాడుబంగ్లా, కొత్తపల్లి మండలాల్లో 25 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా.. కొన్ని సమస్యల కారణంగా కేవలం 13 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. లిప్ట్ ఇరిగేష‌న్ ప్రాజెక్ట్‌కు మూడు మోటర్లు ఉండ‌గా ఒక మోటర్‌మాత్రమే పని చేస్తోంది. సాంకేతిక సమస్యలతో లిప్ట్‌ ఇరిగేషన్లు సరిగా పని చేయడం లేదు. మరమ్మతులు చేపట్టి రైతులకు అండగా ఉండాలని కోరుతున్నాను.

మిడుతూరు, కొత్తపల్లి, పాములపాడు మండలాల్లో కొన్ని ఎత్తిపోతల పథకాలు కావాలని సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లాను. వాటిపై సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కరోనా ఇబ్బందుల కారణంగా ఫైల్స్‌ అధికారుల వద్దే ఆగిపోయాయి. ఎత్తిపోతల పథకాల ప్రతిపాదనలకు అనుమతులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆర్థర్‌ కోరారు.

చెరువులు నింపాలి..
లిప్ట్‌ ఇరిగేషన్ల ద్వారా సాగునీరు అందకపోవడంతో మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా అలగనూరు ప్రాజెక్టు నుంచి మిడుతూరు మండలంలోని కలమందల పాడు, జూపాడుబంగ్లా మండలంలోని మండ్లెం, పారుమంచాల గ్రామ చెరువులను నింపితే కొన్ని వందల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

నీటి ముంపు నిర్వాసితుల‌కు ఉద్యోగాలు ఇవ్వాలి
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కార‌ణంగా మా నియోజకవర్గంలో విలువైన, రెండు కార్లు పండే పంటలు కోల్పోవాల్సి వచ్చింది. నష్టపోయిన రైతులకు ఉద్యోగాలు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 1200 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా 640 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. నీటి ముంపు నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు.

జింక‌ల బెడ‌ద‌..
మిడుతూరు మండలంలో సుమారు 10 గ్రామాలకు జింకల బెడద ఉంది. పొలాలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. నష్టపరిహారాన్ని పెంచాలని, అటవీ అధికారుల ద్వారా జింకల బెడద నుంచి కాపాడాలని ఎమ్మెల్యే కోరారు.
రాష్ట్రంలోని కొలనుభారతి క్షేత్రం ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి అక్షరాభ్యాసం చేయించుకునేందుకు భక్తులు వస్తుంటారు. ఇది అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని ఎమ్మెల్యే ఆర్థర్‌ కోరారు. 

 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top