అనంతపురం : అనంతపురం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో దిగ్విజయంగా 100 యాంజియోప్లాస్టీ, 300 యాంజియోగ్రాం శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి. ఈ మైలురాయిని చేరుకోవడంతో మంగళవారం అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, కియా సీఈఓ డాంగ్‌లిని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యులు సన్మానించారు. ముందుగా కేక్ కట్ చేశారు. ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలకు సంబంధించి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. వెనుకబడిన అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఏడు విభాగాల్లో స్పెషలిస్ట్ వైద్యులతో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రధానంగా కార్డియాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు అందుబాటులోకి రావడం వల్ల నిరుపేదలకు ఉపయుక్తంగా మారిందని తెలిపారు. ఆయా విభాగాల హెచ్‌ఓడీలు డాక్టర్ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ భాస్కర్‌లను ప్రత్యేకంగా అభినందించారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో మెడికల్ కళాశాలకు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి మంజూరైందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ వంటి విపత్కరæ పరిస్థితుల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించి ఎంతో మందికి వైద్య సేవలు అందించామని చెప్పారు. కార్డియాలజీ, న్యూరో విభాగాల్లో ఓ మైలురాయిని సాధించడం సంతోషంగా ఉందని.. వైద్య సిబ్బందిపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. ప్రభుత్వ పరంగానే కాకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కార్యక్రమాల్లో భాగంగా కియా, ఆర్డీటీ వంటి సంస్థలు ముందుకు వచ్చి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వైద్య పరికరాలు అందించాయని అభినందించారు. వైద్యులు దేవుడితో సమానమని, అందుకే వైద్యనారాయణో హరి అంటారని కొనియాడారు. వైద్య వృత్తిలో ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుందని, కోవిడ్ సమయంలో తాను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్య సేవలు అందించారని కితాబిచ్చారు. భవిష్యత్తులో రాయలసీమలోనే అనంతపురం సూపర్ స్పెషాలిటీ మంచి పేరు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినా ఏ రాష్ట్రంలోనూ విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. మొట్టమొదటి సారిగా ఏపీలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు విద్య, వైద్యాన్ని చేరువ చేశారని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని తాజాగా రూ.25 లక్షలకు పెంచామన్నారు. అనంతపురం సర్వజన్పాత్రిని నాడు–నేడు కింద రూ.300 కోట్లతో విస్తరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెంచాలని, ప్రజలు కూడా ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మాణిక్యరావు, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్యం, ఆర్‌ఎంఓ డాక్టర్ పద్మజ, డిప్యూటీ ఆర్‌ఎంఓ డాక్టర్ హేమలత, అసిస్టెంట్ ఆర్‌ఎంఓ డాక్టర్ శివకుమార్, డాక్టర్ భీమసేనాచార్, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.