రాష్ట్ర విభజన కావాలని మేం కోరుకోలేదు

వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆనం రామ్‌నారాయణరెడ్డి 

 అమరావతి: రాష్ట్ర విభజన కావాలని తాము ఎవరూ కోరుకోలేదని, సమైక్య రాష్ట్రమే కావాలని ఏపీ ప్రాంతం నేతలు కోరుకున్నారని వైయ‌స్ఆర్  కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నేత ఆనం రామ్‌నారాయణరెడ్డి తెలిపారు. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ మధ్య ఆస్తుల విషయమై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆనం రామ్‌నారాయణరెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ విషయమై తన అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ తరఫున అశోక్‌ గజపతిరాజు, నాగం జనార్దన్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న రోశయ్య ఈ సమావేశంలో రాష్ట్ర విభజన అంత మంచిది కాదని, సమైక్య రాష్ట్రమే కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిద్దామని, మీరు కూడా సహకరించండి.. మీ చంద్రబాబుకు చెప్పి ఒప్పించండని కోరారు.

కానీ, టీడీపీ నేతలు మాత్రం పెద్ద మనిషి అన్న గౌరవం కూడా  ఆయనకు ఇవ్వకుండా.. నువ్వు ప్రత్యేక తెలంగాణ కోసం తీర్మానం పెడతావా? లేదా? లేకుంటే నీ మెడలు వంచి నీతో తీర్మానం పెట్టిస్తామని అన్నార’ని ఆనం​ గుర్తు చేశారు. ఆ రోజు రాష్ట్ర విభజన కావాలని తాము ఎవరూ కోరుకోలేదని, సమైక్య రాష్ట్రమే కావాలని ఏపీ ప్రాంతం నేతలు కోరుకున్నారని, కానీ, ఆ రోజు ఈవిధంగా వ్యవహరించిన టీడీపీ ఈ రోజు ఏపీ ఆస్తులు తెలంగాణకు ఇచ్చేస్తున్నారని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. వాస్తవాలను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్ష టీడీపీ ప్రయత్నిస్తోందని ఆనం మండిపడ్డారు. 
 

Back to Top