టీడీపీ దిగజారుడు దూషణలు చేస్తోంది

ఆనం రామనారాయణ రెడ్డి-
 

టీడీపీ నేతలంతా బిల్లులపై చర్చలో పాల్గొనడం మానేసి వ్యక్తిగత దూషణలు, వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడం, దిగజార్చడం చేస్తున్నారు. కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం సభ్యులు చేసే తప్పొప్పుల గురించి మాట్లాడాలిగానీ కుటుంబాల జోలికి వెళ్లకూడదు. కుటుంబాలు, పిల్లలతో మొదలై కులాలు మతాల పేరుతో దూషణలు చేస్తున్నారు. సభా నాయకుడిని అమర్యాదగా సంబోధిస్తున్నారు.
గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి ధర్నా చేసారు. అప్పుడు ముఖ్యమంత్రిని నిలబెట్టినప్పుడు వైయస్సార్ ఆయన్ను వెళ్లనివ్వండి సెక్రటేరియట్ గేటు వద్ద మా పార్టీ ధర్నా కొనసాగిస్తుందని చెప్పారు. అయితే ఎన్టీ రామారావు గారు మాత్రం అక్కడే రోడ్డు మీద బైఠాయించి మీరు నిరసన తెలపండి, నేనూ నిరసన వ్యక్తం చేస్తా అని అక్కడే ఆగిపోయారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్సార్ ఛాంబర్ అద్దాలు పగలగొట్టారంటూ చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధం. ఆ సమయంలో నేను కూడా ఆయనతో ఉన్నాను. సీఎల్పీ నేతగా వైయస్సార్, ఇతర శాసన సభ్యులమైన మేమంతా చంద్రబాబు ఛాంబర్ దగ్గరకు నిరసన తెలిపేందుకు వెళితే సెక్యూరిటీ మార్షల్స్ మమ్మల్ని అడ్డగించి తోసేసారు. ఆ తోపాలటలో అక్కడున్న పూల కుండీల మీంచి వెళ్లి ఛాంబర్ అద్దాల మీద పడటంతో మాకందరికీ గాయాలయ్యాయి. అది జరిగిన తర్వాత టీడీపీ ఆధ్వర్యంలో ఎథిక్స్ కమిటీకూడా వేసారు. పరిశీలించిన కమిటీ మా తప్పేం లేదని తేల్చింది. ఈ విషయాన్ని వక్రీకరించి చంద్రబాబు మాట్లాడటం దుర్మార్గం.
స్పీకర్ ను అవమానకరంగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రిపై దుర్భాషలాడుతున్నారు. స్పీకర్ పరిధిలో రూల్స్ కమిటీ ఉంది. ఎథిక్స్ కమిటీ ఉంది. ప్రివిలేజ్ కమిటీ ఉంది. వాటిని ఉపయోగించండి. వీటిల్లో అన్ని పార్టీల వాళ్లూ సభ్యులుగా ఉన్నారు కనుక తప్పెవరిదో తెలుస్తుంది.  ప్రజా సమస్యల మీద, బిల్లుమీద మాట్లాడటానికి లేకుండా గంటల గంటల సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాగే జరిగితే శాసన సభలో ఉండి మేం ప్రజలకు న్యాయం చేయలేం.
శాసన సభలో ఎంతో గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తి పుచ్చల పల్లి సుందరయ్యగారు. సభలో ఒకసారి తీవ్ర అసహనానికి గురై సీటుపై ఎక్కి నిలబడి తన నిరసన వ్యక్తం చేసారు. కానీ తర్వాత సమయం తీసుకుని సభకు, సభ్యులకు, సభాపతికి క్షమాపణలు చెప్పారు. ఒక్కోసందర్భంలో ఆవేశంలో మాట దొర్లుతుంది. ఆ మాటను సరిద్దిద్దుకోవడం వెనక్కు తీసుకోవాలి. ఈ సభ ఓ కుటుంబం లాంటింది. ఇందులోని సభ్యులు సభకు క్షమాపణ చెప్పడానికి భేషజానికి పోనక్కర్లేదు. ఈ రాష్ట్రముఖ్యమంత్రి సభా నాయకుడి మీద అమర్యాద కరమైన మాటను వాడారు చంద్రబాబు. దాన్ని వెనక్కి తీసుకోవాలి. అప్పుడు మర్యాదకరంగా, పెద్దరికంగా ఉంటుంది. లేదంటే స్పీకర్ ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలి. ఇవాళ్టి విషయమే కాదు నిన్నటి విషయంపై రికార్డులు కూడా పరిశీలించాలి. లేదంటే తరుచూ ఇలాంటి సభా సమయం వృధా అవతుండటం వల్ల సభ్యులం మేము మా హక్కులు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.  

 

Back to Top