గుంటూరు: టీడీపీ శ్రేణులు భయపెడితే.. భయపడే రకం తాను కాదని మంత్రి రజిని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న గుంటూరు పశ్చిమలో కావాలనే అలజడి సృష్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. తమ సొంత భవనంలో వైయస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే.. టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? అని ప్రశ్నించారు. వైయస్ఆర్ సీపీ కుటుంబం అప్రమత్తంగా ఉండాలని, రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆదివారం రాత్రి దాడులు చేశారు. కొత్తగా నిర్మించిన వైయస్ఆర్ సీపీ ఆఫీసుపై రాళ్ల దాడికి తెగబడ్డారు. ఫ్లెక్సీలను చించేసి, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి విడదల రజిని సోమవారం ఉదయం పార్టీ ఆఫీసు వద్దకు చేరుకుని పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘అభివృద్ధి, సంక్షేమం ప్రధాన అజెండా తో జగనన్న పాలన సాగిస్తున్నారు. వైయస్ జగన్ ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం సమన్వయ కర్తగా పని చేస్తున్నాను. గుంటూరు అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తా. పశ్చిమలో ప్రతి ఒక్కరూ సొంత ఆడపడుచులా ఆదరిస్తున్నారు. గుంటూరు పశ్చిమలో వైయస్ఆర్ సీపీ జెండా ఎగరవేయాలి. మన కార్యాలయంపై టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారు. రాళ్లతో మన కార్యాలయాన్ని పగలగొట్టారు. ప్రశాంతంగా ఉన్న పశ్చిమలో అలజడి సృష్టిస్తున్నారు రెచ్చగొట్టే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అన్నారు. ‘మాకు రౌడీ యిజం చేసే అలవాటు లేదు. అధికారం కోసం బీసీ మహిళపై దాడి చేస్తారా?. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మంత్రిగా ఉన్న బీసీ మహిళపై దాడులు చేస్తున్నారంటే.. అధికారం వస్తే టీడీపీ ఏం చేస్తుందో ప్రజలు ఆలోచించాలి. దాడి చేయటం పెద్ద పని కాదు కానీ మాది ఆ సంస్కారం కాదు. ప్రజల మనసులో వైసీపీకి స్థానం ఉంది. ప్రజా బలంతో వైసీపీ పశ్చిమలో విజయం సాధిస్తాం. మీరు భయపెడితే భయపడే రకం కాదు నేను’ అని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. ‘సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. గుంటూరు పశ్చిమలో అభివృద్ధి చేసేందుకు ఏం చేయాలో అదే చేసాం. మా సొంత భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే టీడీపీ శ్రేణులు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు. టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఒక బీసీ మహిళ ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ప్రారంభించకూడదా?.. ఆ హక్కు మాకు లేదా?. మీ ప్రతాపం ఏదైనా ఉంటే ప్రజలకు మేలు చేయడంలో చూపించండి. అంతేకాని దాడులు చేసి బెదిరించాలని చూస్తే తగిన గుణపాఠం చెప్తాం’ అని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.