నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ విప్లవం.. సామాజికన్యాయ విప్లవం నడుస్తోంది. అందుకు చిలకలూరిపేట నియోజకవర్గమే ఒక ఉదాహరణ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. సీఎం వైయస్ జగన్ నిజమైన సామాజిక న్యాయం చేస్తున్నారని, మూడేళ్లలో 8 రాజ్యసభ పదవులు వస్తే, వాటిలో 4 బీసీలకు ఇచ్చారని, అంటే 50 శాతం పదవులు ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు రాజ్యసభ పదవుల్లో ఒక్కటి కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇవ్వలేదన్నారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలో భాగంగా నరసరావుపేట బహిరంగ సభలో మంత్రి విడదల రజని మాట్లాడారు. ``మంత్రివర్గంలో 70 శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చారు. అలాగే స్థానిక సంస్థల పదవులు, ఆలయాల కమిటీల్లో కూడా 50 శాతం బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ విప్లవం, సామాజికన్యాయ విప్లవం నడుస్తోంది. అందుకు నా నియోజకవర్గం చిలకలూరిపేట ఒక ఉదాహరణ. గతంలో అక్కడ ఎప్పుడూ బీసీలకు అవకాశం ఇవ్వలేదు. అదే మన జగనన్న ఒక బీసీ అయిన నాకు ఎమ్మెల్యే అవకాశం ఇవ్వడమే కాకుండా, మంత్రిపదవి కూడా ఇచ్చారు. ఇదే కదా సామాజికన్యాయం. ఒక సామాజిక విప్లవం. నాడు సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ‘మీ రక్తం ఇవ్వండి. స్వాతంత్య్రం తెస్తాను’ అన్నారు. ఇవాళ జగన్ అన్నారు. ‘మీ ఓట్లు నాకివ్వండి. మీ తలరాతలు మారుస్తాను’ అన్నారు. ఆ తర్వాత ఆ మాట పూర్తిగా నిలబెట్టుకుంటున్నారు. చంద్రబాబు విపరీత ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రజల్లో నమ్మకం కోల్పోయారు. అందుకే ఆయన ఎక్కడికి పోయినా ప్రజలు రావడం లేదు. దాంతో ఏదేదో మాట్లాడుతున్నాడు. గతంలో ఏ వర్గానికి న్యాయం జరగాలన్నా ఆ వర్గం వారే పోరాడారు. అలాగే ఒక ప్రాంతం అభివృద్ధి కావాలంటే, అక్కడి వారే పోరాడాల్సి వచ్చేది. కానీ ఇవాళ ఏ వర్గమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి చేయాలంటే, పోరాడాల్సిన అవసరం లేదు. జగనన్న అన్నీ చేసి చూపిస్తున్నారు. అందుకే ఆయన ఆధునిక సంఘ సంస్కర్త. సంక్షేమ సామ్రాజ్య సృష్టికర్త. కాబట్టి ‘మళ్లీ మళ్లీ రావాలి జగన్. కావాలి జగన్’ మన నినాదం కావాలన్నారు.