సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అమ‌లు

సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థతో అర్హుల గుర్తింపు 

అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి న‌గ‌దు బ‌దిలీ

అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ

అసెంబ్లీ: అర్హులందరికీ సంతృప్తస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలనేది వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ధ్యేయమని, అందుకోసం అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతతో సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు అందించాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు స్థాయిలో సేవక వ్యవస్థను తీసుకువచ్చారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. అర్హత ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు గ్రామ సచివాలయ, వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. సంక్షేమంపై అసెంబ్లీలో మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. 2 వేల జనాభా కలిగిన గ్రామాల్లో, వార్డుల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి వాటికి అనుసంధానంగా వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి సంక్షేమ పథకాలను అర్హుల గుమ్మం ముందే అందిస్తున్నారన్నారు. సంక్షేమ పథకాల నగదు సాయాన్ని అర్హులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకే చేర్చే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ) గొప్ప కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. కోవిడ్‌ వంటి సంక్షోభ సమయంలో ప్రజల బాధలను తీర్చేందుకు సంక్షేమాన్ని అందించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని గుర్తుచేశారు. 

ఒకటవ తేదీనే పెన్షన్లు, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, వైయస్‌ఆర్‌ కాపు నేస్తం, వైయస్‌ఆర్‌ చేదోడు, వైయస్‌ఆర్‌ వాహన మిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, రైతు భరోసా వంటి ఎన్నో పథకాలను కోవిడ్‌ సమయంలో సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేశారన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి సామాన్యుడు తనకు కావాల్సిన లబ్ధి కోసం అర్జించేలా చేశారని గుర్తుచేశారు. తనకు కావాల్సిన వారికి పథకాలు అందించి గత పాలకులు వివక్ష చూపించారన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. 
 

Back to Top