ఏలూరు: ఎల్లోమీడియా రాతలకు అడ్డూ అదుపు లేదా అని హోం మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తల్లులను అవమానించానంటూ... టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారంపై తానేటి వనిత మండిపడ్డారు. విశాఖపట్నంలో దిశ పోలీస్ స్టేషన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో తాను అనని మాటలను అన్నట్టు, ఆడపిల్లల తల్లులను అవమానించానంటూ... తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తల్లులను కించపరిచేలా హెడ్డింగ్ లు పెట్టి, అసలు తన నోటిలో నుండి రాని మాటను మాట్లాడినట్టుగా రాష్ట్రంలోని ఆడబిడ్డల తల్లులందరినీ అవమానపరిచి, కించపరిచింది ఆంధ్రజ్యోతే అని హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తాను ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలు, భావాలను వక్రీకరించి ప్రజల్లోకి తప్పుడు సందేశాన్ని పంపడానికి ఎల్లో మీడియా, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరాటపడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆడపిల్లపై సొంత తండ్రి అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ప్రస్తావించి మాట్లాడుతున్నప్పుడు... ఇంట్లో ఆడపిల్లలపై అలాంటి సంఘటనలు జరగకుండా తల్లి కనిపెట్టుకుని ఉండాలని, ఆ బాధ్యత తల్లిపైనే ఉంటుందని ఓ తల్లిగా తాను మాట్లాడానని అన్నారు. ఎందుకంటే.. కొన్ని ఘటనలు చూసినప్పుడు, ఇంట్లో ఆడపిల్లపై సొంత తండ్రే అఘాయిత్యానికి పాల్పడే ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ ఆడపిల్లని తల్లి కాకుండా ఇంకెవరు కాపాడగలరు..? అందుకే కన్నబిడ్డలను తల్లి మాత్రమే కాపాడగలదన్నది నా ఉద్దేశ్యం అన్నారు. కానీ ఎల్లో మీడియా దానిని వక్రీకరించి, నా మాటల్లో ముందున్న కొన్ని మాటలను ఎడిట్ చేసి, ఓ దళిత మహిళా హోంమంత్రిని అయిన తనను అవమానపరిచేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎల్లో మీడియా అయినా, టీడీపీ మహిళా నాయకురాళ్ళైనా... తాను మాట్లాడిన ఆ మొత్తం వీడియోను ప్రసారం చేసి మాట్లాడాలని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ దృష్టిలో దళితులు, ఒక మహిళ హోంమంత్రి గా బాధ్యతలు చేపట్టడానికి అనర్హులా...? మీ హయాంలో ఎలాగూ మహిళను హోంమంత్రిని చేయలేదు....ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిగారు దళిత మహిళకు ఆ అవకాశం ఇస్తే జీర్ణించుకోలేరా...? అని ఆమె ప్రశ్నించారు. కొవ్వూరు నియోజకవర్గంలో తన పై ఓడిపోయిన టీడీపీ మహిళా అధ్యక్షురాలు తాను అసలు ఎమ్మెల్యేగా పనికిరానని వ్యాఖ్యానించడం హాస్యాస్పదం అన్నారు. ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అబద్దపు వార్తలు ప్రచారం చేయడం , దానికి టీడీపీ నేతలు మరిన్ని అబద్ధాలను జోడించి ప్రచారం చేయడం పరిపాటిగా మారిందని, ఇప్పటికైనా అలాంటి తప్పుడు విధానాలకు స్వస్థి పలకాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆడబిడ్డల రక్షణ కోసం దేశంలో ఎక్కడా లేని భద్రతా చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు దిశ చట్టం స్ఫూర్తితో రమ్యను హత్యచేసిన నిందితుడికి 8 నెలల్లోనే ఉరిశిక్ష పడేలా చేశాం. ఈ చర్యల వలన మహిళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందన్న అక్కసు తో ఇలాంటి తప్పుడు ప్రచారాలకు టీడీపీ తెరలేపిందని, ఇలాంటి పిచ్చి ప్రయత్నాలతో ప్రజల్లో టిడిపి మరింత పలుచన అవ్వడం తప్ప ఇంకేమీ సాధించలేరన్న విషయం వారు గుర్తుపెట్టుకోవాలని హోం మంత్రి తానేటి వనిత హితవు పలికారు.