విజయవాడ: పిల్లలు బాగా చదివితినే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైయస్ జగన్ భావించారని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని హోం మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆమె తెలిపారు. స్వాతంత్రం వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా హక్కుల ఉల్లంఘన జరుగుతునే ఉందని అన్నారు. గురువారం విజయవాడలో జరిగిన జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. మంత్రి సుచరిత మాట్లాడుతూ.. మన హక్కులను మనం సాధించుకోవడానికి ఇంకా పోరాడాల్సిన ఆవశ్యకత కనపడుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ సభ్యులకు ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు.
హక్కుల పరిరక్షణకు ముందుకు రావడం సంతోషకరం..
వివిధ రంగాల్లో నిపుణులైన వారు హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావడం చాలా సంతోషకరం. నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసి న్యాయ సలహాలు ఇవ్వడం, భరోసా కల్పించడం మంచి పరిణామం. మన దేశంలో నిర్భయ లాంటి అనేక చట్టాలు ఉన్నప్పటికీ నేరస్తులకు భయం లేకుండా పోయింది. ప్రతి రోజు అనేక అఘాయిత్యాలు, దారుణాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడలో దివ్య తేజశ్విని, నెల్లూరులో చిన్నారి ఘటన, విశాఖపట్నం ఘటనలు జరగడం చాలా బాధాకరం. న్యాయస్థానాల్లో శిక్ష పడటం ఆలస్యం కావడం వల్ల నేరస్తులు నిర్భయంగా బయట తిరుతున్నారు .
శిక్షలను కఠినంగా అమలు చేసేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ చట్టాన్నితీసుకొచ్చారు.ఈ చట్టం ప్రకారం 21 రోజుల్లో శిక్ష పడేలా చర్యలు చేపడతారు. మన రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లు, 3 ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. త్వరగా శిక్ష విధించేందుకు ప్రతి జిల్లాకు ప్రత్యేక న్యాయ స్థానాలను ఏర్పాటు చేయనున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంక్షేమ పథకాలను సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టారని చెప్పారు. కార్యక్రమంలో వైయస్సార్‌సీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్, జడ్పీటీసీ అభ్యర్థి కీర్తి సౌజన్య, ఎన్‌హెచ్‌ఆర్‌ఏసీసీ నేషనల్ చైర్ పర్సన్ శాంసన్ తదితరులు పాల్గొన్నారు.
దాదాపు రూ.33 వేల కోట్లు విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కావాలని అంబేద్కర్ కలలు కన్నారు. వైయస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న గోరుముద్దలో భాగంగా పిల్లలకు బలవర్ధమైన ఆహారం, నాణ్యమైన ఆహారం అందిస్తున్నాం. పిల్లల చదువుకు ఇబ్బంది పడుతున్న వారికి అమ్మఒడి పథకం ద్వారా సాయం అందిస్తున్నాం.