కడప: శ్రీకాకుళం జిల్లా పలాసలో గౌతు లచ్చన్న విగ్రహంపై తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయం చేస్తోందని, విగ్రహాన్ని తొలగిస్తారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన గౌతు లచ్చన్నను ఒక కులానికి, ఒక పార్టీకి పరిమితం చేసి ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఆక్రమించిన భూములను కాపాడుకోవడం కోసం గౌతు లచ్చన్న విగ్రహం తొలగిస్తున్నారంటూ టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కడపలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ.. గౌతు లచ్చన్న ప్రతిష్టకు భంగతం కలిగిస్తున్న టీడీపీ వైఖరికి నిరసనగా పలాసలో వైయస్‌ఆర్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ కార్యక్రమానికి ప్లాన్ చేశామని, లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేయాలని పార్టీ యువజన విభాగం నిర్ణయించిందన్నారు. టీడీపీ నేతలు కూడా ఏదో ఒక అపోహ సృష్టించి నిరసన కార్యక్రమానికి ప్లాన్ చేశారని, పోలీసులు అనుమతి ఇస్తే బలప్రదర్శనలో ఎవరి బలం ఎంతో తెలిసిపోయేదన్నారు.
టీడీపీ హయాంలో ఆక్రమించిన భూములను ఎలా కాపాడుకోవాలని అచ్చెన్నాయుడు, కూన రవి, అశోక్, స్థానిక నాయకురాలు శిరీష తాపత్రయ పడుతున్నారని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. గౌతు లచ్చన్న విగ్రహం పెట్టిన స్థలం, పక్కనే నిర్మించిన మారుతి షోరూం కూడా ఆక్రమిత స్థలమేనని తేలిందన్నారు. గౌతు శివాజీ కూతురు శిరీష మీడియా ముందుకు వచ్చి ఆక్రమణలు తొలగించాలని గౌతు లచ్చన్న విగ్రహం పెట్టిన సర్వే నెంబర్‌పై ఫిర్యాదు ఇచ్చిందన్నారు. స్థలదాత అని నిమ్మాన బైరాగి అని పేరు పెట్టుకున్నప్పుడు అది ఆక్రమణకు గురైన భూమి అని తెలియదా..? అని గౌతు శివాజీని మంత్రి ప్రశ్నించారు. ఆక్రమించిన భూములు కాపాడుకునేందుకు కులాలను, పార్టీలను వాడుతారా..? అని ధ్వజమెత్తారు. గౌతు శివాజీ తన రాజకీయ చరిత్రలో ఎన్నో తప్పులు చేశారన్నారు. శివాజీ అల్లుడు చేసిన భూదందాలకు హద్దు, అదుపు లేదన్నారు. టీడీపీ నేతలు చేసిన భూ ఆక్రమణలను తాను ఆధారాలతో సహా నిరూపించానని చెప్పారు.
`విగ్రహాన్ని తొలగించాలని నిజంగా అనుకోవడం లేదు.. ఆక్రమణలు తొలగించాల్సి వస్తే.. గౌతు లచ్చన్న విగ్రహం పెట్టిన స్థలం నుంచే మొదలుపెట్టాలి. అంటే దాని అర్థం.. అక్కడున్న ఆక్రమణల్లో కట్టిన మారుతి షోరూం, ఇతర నిర్మాణాలు తొలగిస్తాం. లచ్చన్నకు బ్రహ్మాండమైన గౌరవం ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఆ స్థలాన్ని కలెక్టర్‌కు చెప్పి దేవాదాయ శాఖ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేయమని కోరి, గౌతు లచ్చన్న విగ్రహం విషయంలో రాబోయే రోజుల్లో ఏ విధమైన వివాదం తలెత్తకుండా చూస్తా` అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.