పదవులు, డబ్బు ఆశ తప్ప.. పురందేశ్వరికి నైతిక విలువ‌ల్లేవు

నీతి, నిజాయితీ ఉంటే బాబు చేసిన స్కామ్‌లపై సీబీఐకి లెటర్‌ రాయాలి

పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా డిమాండ్‌

విజయవాడ: పురందేశ్వరికి పదవులు, డబ్బుపై ఆశ తప్ప.. నైతిక విలువలు లేవని, ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఉంటూ టీడీపీకి కొమ్ముకాస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు చదువుతోందన్నారు. బీజేపీ సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రబాబు పల్లకీ మోస్తుందంటే.. బీజేపీ కోసం ఆమె ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో అర్థం చేసుకోవాలని, పార్టీని భ్రష్టుపట్టిస్తున్న పురందేశ్వరిని బీజేపీ పెద్దలు పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. 

మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరికి నీతి, నిజాయితీ ఉంటే చంద్రబాబు చేసిన స్కామ్‌లపై సమగ్ర విచారణ కోరుతూ సీబీఐకి లెటర్‌ రాయాలని డిమాండ్‌ చేశారు. ఒక పార్టీకి అధ్యక్షురాలిగా ఉంటూ మరో పార్టీ కోసం పనిచేయడం విచిత్రంగా ఉందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ మోసం చేశాడని, అధికారంలో ఉండగా ప్రతీ పథకాన్ని అవినీతికి అడ్డాగా మలుచుకున్నాడన్నారు. బాబు చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చెప్పారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే దమ్ము, ధైర్యం లేక తోకపార్టీని వెంటేసుకొని తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబు రైతులను మోసం చేసి ఎంత దండుకున్నారో త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని మంత్రి ఆర్కే రోజా స్పష్టం చేశారు. 
 

Back to Top