విజయవాడ: హెరిటేజ్ ఆస్తులపై మాట్లాడుతున్న నారా భువనేశ్వరి.. చంద్రబాబు ఏం చేశాడో తెలియాలంటే.. నేరుగా ఢిల్లీకి వెళ్లి తమకు ఆదాయానికి మించిన ఆస్తులు లేవు, కావాలంటే విచారణ చేసుకోండి, తాము నిప్పులమని సీబీఐ, ఈడీకి రాతపూర్వక పత్రం ఇవ్వాలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేశారు. సీబీఐ, ఈడీ విచారణలో చంద్రబాబు ఆస్తుల వివరాలన్నీ బయటకు వస్తాయని చెప్పారు. మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పురందేశ్వరి బీజేపీనా, టీడీపీనా.. ఏ పార్టీకి చెందిన నేత అనేది అర్థం కావడం లేదన్నారు.
పురందేశ్వరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలా.. లేక బావ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలా అర్థం కావడం లేదని మంత్రి ఆర్కే రోజా సందేహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఉన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రతీ జయంతికి చంద్రబాబు గురించి ఆయన చెప్పిన మాటలు సిడీలు వేసి అందరికీ పంచిపెట్టేవారని, తన తండ్రికి చంద్రబాబు ద్రోహం చేశాడని మాట్లాడేవారని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చిన నాటి నుంచి సడన్‌గా ప్లేట్ ఫిరాయించారన్నారు. బాబు నోటీసులపై మీడియాకు నో కామెంట్ అని చెప్పిన పురందేశ్వరి.. బాబు అరెస్టును ఖండిస్తున్నానని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్న పురందేశ్వరి.. ఆ పార్టీ అండర్‌లో ఉన్న ఐటీ శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇస్తే మాట్లాడను అని చెప్పి.. స్కిల్ స్కామ్‌లో బాబు అరెస్టును బీజేపీ ఖండిస్తుందంటే మాట్లాడుతుందంటే.. ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుందని ప్రశ్నించారు.