శ్రీకాకుళం: ఇవాళ మీరు చేసిన త్యాగం ఎప్పటికీ మరచిపోలేమని, ఇదే రేపటి అభివృద్ధికి నాందీ పలుకుతుందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. సీ పోర్టు నిర్మాణానికి మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకు రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పరిహారం పంపిణీ చేశారు. ఒక్కో ఎకరానికి పాతిక లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించారు. ముందుగా ప్రకటించిన రీతిగానే భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ,సంబంధిత లబ్ధిదారులకు పరిహారం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.."చాలా ప్రాంతాల్లో అభివృద్ధికి సంబంధించి భూమి సేకరించడం అన్నది పెద్ద సమస్యగా ఉంది. దాని వల్ల జరిగే మంచి కన్నా చెడ్డ ఎక్కువ అని ప్రచారం చేసేది, ప్రభుత్వ కార్యకలాపాలపై వ్యతిరేకత తెచ్చేది ఓ వర్గం మాత్రమే. రాజకీయ ప్రయోజనాల కోసం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ట్రెండ్ ఉన్న నేపథ్యంలో మన జిల్లాలో ఈ మారుమూల ప్రాంతంలో శ్రీకాకుళం భవిష్యత్-ను మలుపు తిప్పగలిగే ఓ అభివృద్ధి కార్యక్రమానికి, ఓ బృహత్తర ప్రాజెక్టుకు భూమి మీరంతా ఇవ్వడం అన్నది ఎంతైనా అభినందనీయం. మన తరువాత తరం శ్రీకాకుళం ముఖ చిత్రం మారి దాంతో వారి జీవన ప్రమాణాలు పెరిగి సంతోషంగా ఉండేందుకు భావనపాడు సీ పోర్టు నిర్మాణం అన్నది కీలకం కానుంది అని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మాలని కోరుతున్నాను. మన జిల్లా దురదృష్టవశాత్తూ నిర్లక్ష్యంకు గురయిన జిల్లా. ఈ స్వరూపం ఎలాంటిది అంటే ఈ జిల్లాలో ఒకటి..రెండు నదులు ఒడిశాలో క్యాచ్మెంట్ ఏరియా ఉండి, సమాంతరంగా అవి జిల్లా అంతటా ప్రవహిస్తాయి. మనం గమనిస్తే జిల్లా అంతటా విస్తరిస్తుంది ఆ నీరు. రెండు.. ఒక నేషనల్ హైవే.. పైడి భీమవరం దగ్గర మొదలయి ఇచ్ఛాపురం వరకూ జాతీయ రహదారి జిల్లా వెంబడి ఉంది. మూడు సముద్రం విశాల తీరం ఉన్న ప్రాంతం..పైడి భీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకూ.. ఉంది. ఇవన్నీ అభివృద్ధికి కావాల్సినటువంటివే. అటువంటి సహజ గుణం ఉన్న ప్రాంతం ఈ జిల్లాకే సొంతం. ఇన్ని ఉన్నా కూడా ఎప్పుడు చూసినా జీవన ప్రమాణాల్లో మాత్రం మనం వెనుకబడి ఉన్నాం. ప్రతి పదేళ్లకు సేకరించే గణాంకాల ప్రకారం చూసుకున్నా ఎప్పుడూ వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం జిల్లానే, జీవన ప్రమాణాలు తక్కువ ఉన్న జిల్లా ఏదంటే శ్రీకాకుళం జిల్లానే , ఇది కేవలం పాలకుల నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఈ ఆవేదన నాకెప్పుడూ ఉంది. వీటిపై నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా నా గొంతుక వినిపిస్తూనే ఉంటాను. నేను పూర్తిగా నమ్మినటువంటి వాటిపై మాట్లాడుతూనే ఉన్నాను. ఉంటాను కూడా, ఇవాళ మా అందరికీ సంతృప్తి కలిగించే విషయం ఏంటంటే మూడు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టుకు సంబంధించి భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పంపిణీ చేయడం అన్నది ఓ శుభ పరిణామం. ఈ సీ పోర్టు కారణంగా మరికొన్ని పరిశ్రమలు వచ్చేందుకు దోహదం కానుంది. మరో రెండు దశాబ్దాల్లో ఈ ప్రాంతం అంతా మారిపోతుంది. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రాక కారణంగా జరిగే మేలు ఇది. పోర్టు కారణంగా వచ్చే అనుబంధ పరిశ్రమల రాక కారణంగా చాలా మంది యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా దొరుకుతాయి. అందుకు అనుగుణంగా ఇక్కడి తల్లిదండ్రులు అందుకు అవసరం అయిన చదువులు ఎక్కడా రాజీ పడకుండా చదివించండి. ప్రయివేటు యాజమాన్యాల పరిధిలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరికేందుకు మేం సహకరిస్తాం. అందుకు తగ్గ కృషి చేస్తాం. మూడున్నరేళ్ల కాలంలో అభివృద్ధి లేదంటారు విపక్ష నేత చంద్రబాబు. ఆయనేం చేయరు ఈ జిల్లాకు. ఇక్కడే ఇచ్ఛాపురంలో తాగునీరు అందించేందుకు ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. తద్వారా కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతానికి హిరమండలం నుంచి ఇచ్ఛాపురం వరకూ సర్ఫేస్ వాటర్ ను అందించేందుకు కృషి చేస్తున్నాం. ఈ 75 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మేం వంశధార జలాలను ఉద్దానం ప్రాంతానికి అందిస్తున్నాం. ఉద్దానం ప్రాంత వాసులు మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ముందున్న కాలంలో మరిచిపోవద్దు. గతంలో మీరెంత మందికి ఓటేశారు. ఎంతమందిని గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పలాసలో రెండు బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం దిద్దారు. ఒకటి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం (కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం), రెండు ఉద్దానం ప్రాంతానికి వంశధార జలాలు అందించేందుకుఏడు వందల కోట్ల రూపాయలతో సంబంధిత పనులకు శ్రీకారం. ఇది కదా అభివృద్ధి అంటే ! అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న కుటుంబాలకు నెలకు పది వేలు చొప్పున పింఛను అందించే కార్యక్రమం కూడా నిరాటంకంగా చేపడుతున్నాం. ఒకనాడు పత్రికల్లో ఉద్దానం కన్నీటి వెతలు కథనాలు రూపంలో పుంఖాను పుంఖాలుగా వచ్చేవి. ఎందరో నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వచ్చి వెళ్లేవారు. కానీ ఇప్పుడు మరికొద్ది నెలల్లోనే మల్టీ స్పెషాల్టీ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. ఇంకా చాలా మార్పులు సామాజికంగా జరగనున్నాయి. వీటన్నింటికీ కారణం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నాను. విపక్ష నేత చంద్రబాబు చెప్పే మాటలు అర్థరహితం. ఇక్కడి నుంచి వెళ్లిన కేంద్రమంత్రి కానీ లేదా ఇక్కడి నుంచి గెలిచిన ఎంపీ కానీ ఏం చేశారో చెప్పమనండి. చంద్రబాబుకు ఈ జిల్లాపై ప్రేమ లేదు. కేవలం మాయ మాటలు చెప్పడం తప్ప ఆయన ఈ జిల్లా అభివృద్ధికి చేసిందేం లేదు. కేంద్ర ప్రభుత్వం 23 సంస్థలు ఇస్తే అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ జిల్లాలో ఏర్పాటు చేయలేదు. రాష్ట్రం విడిపోయినందుకు పరిహారం కింద వచ్చిన సంస్థలలో జిల్లాకు రెండు చొప్పున ఏర్పాటు చేసినా మనకు కూడా అందులో ప్రాధాన్యం దక్కేది. కానీ ఆయన ఇవేవీ చేయలేదు. కానీ చంద్రబాబు నిన్నటి వేళ రాజాం వచ్చి బీసీలను తామే ఆదుకున్నామని చెప్పడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబుకు ఈ జిల్లా అంటే ప్రేమ లేదు నిర్లక్ష్యం ఉంది. అతనిపై నాకు కోపం ఉంది అని అనను కానీ ఆయనకు మాత్రం ఈ జిల్లా అంటే నిర్లక్ష్యం ఉంది. ఎంతసేపూ వ్యాపారాలూ,వ్యవహారాలపై దృష్టి సారించారే తప్ప ఆయన ఈ జిల్లాపై మక్కువ చూపించింది ఏమీ లేదు. అమరావతి కారణంగా చంద్రబాబుకు చెందిన వారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం పచ్చి అబద్ధాలు చెప్పి వెళ్లారు చంద్రబాబు. ఇదెంత మాత్రం సబబు కాదు. పాలన పరంగా ఎన్నో సంస్కరణలు వచ్చాయి. అదేవిధంగా పేద కుటుంబం ఇవాళ దర్జాగా బతుకుతున్నదంటే అందుకు కారణం నిష్పక్షపాత ధోరణిలో అందిస్తున్న సంక్షేమ పథకాలే అని చెప్పగలను. ఒకనాడు జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నాకు తెలిసి మూలపేట గ్రామస్థులు మాకెప్పుడూ ఓటేయ్యలేదు. అయినా మాకేం కోపం లేదు. ఎందుకంటే ఇక్కడి వారు అమాయకంగా వారిని నమ్మారు. ఎప్పుడూ ఆ పార్టీ నాయకులు (టీడీపీ నాయకులు) దొంగ మాటలు చెప్పడమే తప్ప చేసిందేం లేదు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు ఫలానా పని చేశానని చెప్పమనండి.. చెప్పగలరా పోనీ చూపించగలరా ? నిన్న మొన్న మహేంద్రతనయపై నిర్మిస్తున్న ఆఫ్ షోర్ పనుల పూర్తికి 850 కోట్ల రూపాయలు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేశారు. మధ్యలో మీరు వచ్చి పాలించిన ఐదేళ్లు ఏమయినా చేశారా ? వంశధార ప్రాజెక్టు ఆగిపోతే నేరడి బ్యారేజీ నిర్మాణానికి వివాదాలు నెలకొన్న సందర్భాన 19టీఎంసీల వినియోగానికి సంబంధించి గొట్టా వద్ద ఎత్తిపోతల పథకం నిర్మాణానికి నిధులు కేటాయించిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే, ఇందుకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించారు. వస్తున్న ఆగస్టులో సంబంధిత పనులు పూర్తి చేస్తాం. అంతకుమునుపు అంతర్ రాష్ట్ర వివాదం నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలిసి సంబంధిత సమస్యను వివరించి, అటుపై చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డే అన్న సంగతి మరిచిపోవద్దు. మరి ,మీ హయాంలో ఎందుకని ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించలేకపోయారని ? అప్పటికీ సమస్య కొలిక్కి రాకపోవడంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి బదులు గొట్టా వద్ద ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించి, సంబంధిత పనులకు శ్రీకారం దిద్దింది కూడా ఈ ప్రభుత్వమే, వచ్చే వేసవి కి మూలపేటకు మండు వేసవిలో వంశధార నీరు మీకు తెచ్చిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. బాధ్యత లేకుండా మాట్లాడడం..ఓట్లు వేయించుకోవడం..పదవులు పొందడం తప్ప విపక్ష పార్టీ ఇంతవరకూ ఈ ప్రాంతానికి కానీ ఈ జిల్లాకు కానీ చేసిందేమీ లేదు. ఏనాడూ శ్రీకాకుళం జిల్లాకు తెలుగుదేశం పార్టీ చేసిందేమీ లేదు. ఇవాళ పరిహారం రూపంలో ఇచ్చిన డబ్బులు వృథా చేయవద్దు. మీకు అండగా స్థానిక ప్రజా ప్రతినిధులు అయిన మంత్రి సీదిరి అప్పల రాజు కానీ పేరాడ తిలక్ కానీ తోడుగా ఉంటారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు మాత్రం దుర్వినియోగం చేయకండి. చంద్రబాబుకు తెలియదు మా హయాంలో ఏం మార్పు వచ్చిందో అన్నది. ఇవాళ మీకు పరిహారం అందించినా లేదా పెన్షన్లు అందించినా ఎవ్వరూ ఒక్కరు ఒక్క నయా పైసా లంచం రూపంలో అడగరు. ఆ రోజు చంద్రబాబు హయాంలో ఉన్న ప్రభుత్వం అంతా బ్రోకర్ల మయం కానీ ఇప్పుడు అందుకు ఆస్కారం ఉండదు. అవినీతి లేని పాలన అందించడమే మా ధ్యేయం. లక్షా 73 వేల కోట్ల రూపాయలను ఈ రాష్ట్రంలో ఉన్న లబ్ధిదారులకు మేం అందించాం. ఇందుకు పారదర్శకతే ప్రామాణికం. పథకాల వర్తింపులో లంచ గొండి తనానికి తావే లేదు. కానీ ఇవన్నీ అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ విపక్ష నేత సైకో అని అంటున్నారు. నిన్ననే ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లలకు ట్యాబ్ లు అందించాం. అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన స్టడీ మెటీరియల్ ను కూడా అందులో పొందుపరుస్తూ ఈ ట్యాబ్ లను పేద పిల్లలకు అందించాం. అంటే పేద పిల్లలు ధన వంతులయిన పిల్లలతో ఏ మాత్రం తీసిపోకుండా చదువుల్లో రాణించాలన్న ముఖ్యోద్దేశంతో ఈ బృహత్తర ప్రణాళికను అమలు చేశాం. అంటే ఇవన్నీ చేస్తే ఎన్నికల కోసం చేస్తున్నవేనా , చంద్రబాబుకు బుద్ధి లేదు ఇవన్నీ ఓట్లు కోసం చేస్తున్నారు అని చెప్పడం అర్థరహితం. అంతెందుకు ఇచ్ఛాపురం లో నా కళ్లెదుటే కుటుంబ పెద్ద మంచంపట్టి నానా అవస్థలూ పడుతున్న వేళ వారికి అండగా నిలిచి, ఆర్థికంగా ఆదుకుని, వారికి పెన్షన్ అందించి, తాగేందుకు రక్షిత నీరు అందించి నిలబెడుతున్న వైనం మీరు గుర్తించలేకపోతున్నారా ? చంద్రబాబు దొంగ ..అన్ని విధాలా ఈ జిల్లాకు ద్రోహం చేశారు. 14 ఏళ్ల అధికారంలో ఉండి ఏ ఒక్క పనీ చేయకుండా ఏ ఒక్క నయా పైసా ఖర్చు పెట్టకుండా తానే అన్నీ చేశానని అబద్ధాలు చెబుతున్నారు చంద్రబాబు. మీరు ఆయన మాటలు నమ్మవద్దు. అవన్నీ దొంగ మాటలే , దొంగ మాటలలో భాగంగా కరోనా కూడా నేనే తెచ్చానని అనగలరు. అందుకని మీరంతా ఇటువంటి నాయకులపై తిరుగుబాటు చేయండి. పోనీ ఎర్రన్నాయుడు కానీ అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు కానీ ఏం చేశారు ? చెప్పమనండి. వెనుకబడిన జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు వైయస్ జగన్ కృషి చేస్తున్నారు. ఆయనొక నిచ్చెనలా ఉపయోగపడుతున్నారు. కనుక ఈ ప్రాంతం అభివృద్ధికి ముఖ్యంగా ఇక్కడ భూములు ఇచ్చిన రైతాంగానికి అన్ని వేళలా అండగా ఉంటామని,ఈ జిల్లా అభివృద్ధికి మీరే మార్గ దర్శకులు అయ్యారని అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.. మంత్రి సిదిరి అప్పలరాజు, కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్, డిప్యూటీ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.