ఏ సీజన్‌లో పరిహారం ఆ సీజన్‌లోనే..

డిసెంబర్‌ 29న రైతుభ‌రోసా సాయంతో పాటు నివర్‌ తుపాన్ ప‌రిహారం   

రూ.83.59 కోట్లతో పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ 

ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం

మొత్తం 27 మెడిక‌ల్‌‌ కాలేజీలకు రూ.16 వేల కోట్ల నిధులు

ఏపీ సర్వే అండ్‌ బౌండరీ చట్ట సవరణకు ఆమోదం

టూరిజం నూతన పాలసీని ఆమోదించిన కేబినెట్‌

పర్యాటక ప్రాజెక్ట్‌లకు రూ.198.50 కోట్లతో రీస్టార్ట్‌ ప్యాకేజీ 

సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం 

కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సచివాలయం: దేశంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్‌లో పంట నష్టపోతే అదే సీజన్‌లో నష్టపరిహారం రైతులకు అందించే నూతన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈనెల 29వ తేదీన రైతు భరోసా పథకం కింద రెండో ఏడాది చివరి విడత సాయంతో పాటు నివర్‌ తుపాన్‌ పంట నష్టపరిహారం కూడా సీఎం వైయస్‌ జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేస్తారని చెప్పారు. కేబినెట్‌ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు. 

మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారంటే..

రైతుభరోసాతో పాటు నివర్‌ నష్టపరిహారం
వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద రెండో ఏడాది 50.47 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. డిసెంబర్‌ 29వ తేదీన ఈ ఏడాది మూడో విడత సాయం రూ.1,009 కోట్లు సీఎం చేతులు మీదుగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. 

దేశంలో ఎన్నడూ లేని విధంగా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి పంట నష్టపోతే.. ఆ పంట నష్టానికి చంద్రబాబు బకాయిలు పెట్టిన రూ.1200 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లించడం జరిగింది. అక్టోబర్‌లో వచ్చిన పంట నష్టాన్ని నవంబర్‌లో చెల్లించాం. ఇక నుంచి పాలసీ కింద పంట నష్టం జరిగిన ఒక మాసంలోనే వారి ఖాతాల్లోకి పరిహారం అందించాలనే కొత్త తరహా ఆలోచనను అమలు చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. 

నెల రోజుల్లోనే పంట నష్టం
2020 నవంబర్‌ 24–28 తేదీల్లో నివర్‌ తుపాన్‌ వల్ల పంట నష్టపోయిన రైతులకు డిసెంబర్‌ 29వ తేదీన వారి ఖాతాల్లోకి పరిహారం జమ చేయనున్నారు. నివర్‌ తుపాన్‌లో 8,06,504 మంది రైతులు నష్టపోయినట్లుగా ప్రభుత్వం అంచనాలు తయారు చేసింది. 13.01 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని గుర్తించాం. 29వ తేదీన రూ.718 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని సీఎం వైయస్‌ జగన్‌ రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. దీంట్లో 12.38 లక్షల ఎకరాల వరి పంట, 70 వేల ఎకరాల హార్టికల్చర్‌ పంటకు నష్టం జరిగింది. నెల రోజుల్లోనే పంట నష్ట పరిహారం అందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

పశుసంవర్థక శాఖలో పోస్టుల భర్తీ
పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలో 147 ల్యాబ్‌ టెక్నిషియన్‌ పోస్టులు, 147 ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో భర్తీ చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ పోస్టుల నియామకం ద్వారా నియోజకవర్గాల స్థాయిలో పాడి పరిశ్రమపై ఆధారపడి జీవించే రైతులకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. 

గ్రామీణ యువత, మహిళల్లో నైపుణ్యం పెంచేందుకు..
పులివెందులలో ఏపీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలియజేసింది. రూ. 83.59 కోట్లతో ఏర్పాటవుతున్న సంస్థ వల్ల గ్రామీణ మహిళలు, యువతలో నైపుణ్యం పెంచేలా కార్యక్రమాలు, శిక్షణ, సర్టిఫికేట్‌ కోర్సులకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఏడాది మే, జూన్‌ నెల నుంచి ఈ కార్యక్రమాలు గ్రామీణ యువతకు అందుబాటులోకి వస్తుంది. 

ఏపీఎంఈఆర్‌సీ సంస్థ ఏర్పాటుకు నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఈఆర్‌సీ) సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. ఆ ఏర్పాటుకు ఆర్డినెన్స్‌ జారీ చేయడం కోసం ఏపీ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న 11 వైద్య బోధనాస్పత్రులు, నర్సింగ్‌ కాలేజీలు, నూతనంగా 16 మెడికల్‌ కాలేజీలు నిర్మించబోతున్నాం. మొత్తం 27 మెడికల్‌ కాలేజీలకు కావాల్సిన రూ.16 వేల కోట్ల నిధులను ఈ సంస్థ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. 

ఏపీ సర్వే అండ్‌ బౌండరీల చట్టంలో 5 సవరణలు..
డిసెంబర్‌ 21 నుంచి ఈ రాష్ట్రంలోని ప్రతి అంగుళాన్ని కొలిచే సమగ్ర భూసర్వే కార్యక్రమానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రైతుల భూ సమస్యలను పాదయాత్రలో వైయస్‌ జగన్‌ చూశారు. వాటిని పరిష్కరించేందుకు సమగ్ర భూసర్వే చేయాలని, 1923 నాటి ఆంధ్రప్రదేశ్‌ సర్వే.. బౌండరీల చట్టంలోని 5 సవరణలు చేయడం ద్వారా భూసర్వేకు సంబంధించిన చిక్కులను తొలగిస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రతి భూమికి సబ్‌ డివిజన్‌ ప్రకారం మ్యాప్‌ తయారు చేయడం జరుగుతుంది.. ప్రతి సరిహద్దుకు అక్షాంశాలను మార్కు చేయడం జరుగుతుంది. జీపీఎస్‌ అనుసంధానం చేయడం వల్ల సరిహద్దు ఇష్టానుసారం మారే పరిస్థితులు ఉండవు. సర్వే రాళ్లను ధ్వంసం చేసినా చట్టరిత్యా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులకు వెసులుబాటు కల్పించాం. సమగ్ర సర్వేతో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. 

చిత్తూరులో సర్వే ట్రైనింగ్‌ కాలేజీ..
రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలోని  భూమినంతా సర్వే చేసి రికార్డు తయారు చేయడం జరుగుతుంది. సర్వే ఆఫ్‌ ఇండియా అసోసియేషన్‌తో చిత్తూరు జిల్లా తిరుపతి అర్బన్‌ మండలంలోని చెన్నయగుంట గ్రామంలో 41.19 ఎకరాల్లో సర్వే ట్రైనింగ్‌ కాలేజీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ప్రకాశం జిల్లాలో..
పప్పు దినుసులు, తృణధాన్యాల పరిశోధన కోసం ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం చిన్నపామని గ్రామంలో 410 ఎకరాల భూమిని ఆచార్య ఎన్టీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

- ఏపీఐఐసీ ద్వారా ఏర్పాటు చేయనునన ఇండస్ట్రీయల్‌ పార్కుకు సంబంధించి ఏర్పేడు మండలం వికృటమాలలో భూమి సేకరణలో మిగిలిన వారికి పరిహారం అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

- కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేసుల వద్ద 11.83 ఎకరాల భూమిని అటవీ శాఖకు అడ్వాన్స్‌ పొజిషన్‌ ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

రూ.198 కోట్లతో హోటల్‌ పరిశ్రమకు అండగా..
మార్చి నుంచి కోవిడ్‌ సంక్షోభం తలెత్తిన దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న అనేక హోటళ్లు, ఫంక్షన్‌ హాల్స్, రెస్టారెంట్లు, సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అంతా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. రీఓపెన్‌ చేసి వాటిని మరమ్మతులు చేసుకోవడానికి రూ.50 వేల నుంచి రూ.15 లక్షల వరకు రుణ సదుపాయాన్ని ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ అంచనాల మేరకు రూ.198.50 కోట్లు రీస్టార్ట్‌ ప్యాకేజీ ద్వారా హోటల్‌ పరిశ్రమకు అండగా నిలబడాలని సీఎం నిర్ణయించాం. ఈ రుణంలో 6 మాసాలు మారిటోరియం, మొదటి సంవత్సరం వడ్డీలో 4.5 శాతం రాయితీ అందిస్తుంది. టూరిజం డిపార్టుమెంట్‌ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నూతన పాలసీని కూడా రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు ఆహ్వానించేలా.. అందుకు తగిన విధంగా వారిని ప్రోత్సహించే విధంగా కొత్త పాలసీని ఆమోదించడం జరిగింది. 

లీజుల పిరియడ్‌ 33 నుంచి 99 సంవత్సరాలకు..
రాష్ట్రానికి కొత్తగా వచ్చే టూరిజం యూనిట్‌లకు నెటెస్ట్‌ ఎస్‌జీఎస్‌పీలో వందశాతం రాయితీ, ఐదేళ్ల పాటు యూనిట్‌ విద్యుత్‌ రూ.2కు ఇచ్చేలా, స్టాంప్‌ డ్యూటీలో వందశాతం రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేలా, ల్యాండ్‌ యూస్‌ కన్వర్షన్‌ చార్జీల్లో వందశాతం మాఫీ చేసేలా నిర్ణయించాం. రూ.400 కోట్ల పెట్టుబడి పెడితే మెగా టూరిజం ప్రాజెక్టుగా పరిగణించడం జరుగుతుంది. కొత్త పాలసీ ప్రకారం మెగా టూరిజం యూనిట్లలో 5స్టార్‌ పైబడి హోదా ఉన్నవారు పాట్నర్లుగా ఉండాలి. రూ.400 కోట్లతో హోటల్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వస్తే వారికిచ్చే భూముల లీజుల పిరియడ్‌ 33 నుంచి 99 సంవత్సరాలకు పెంచే వెసులుబాటు సవరిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసింది. 

నాబార్డు సంస్థ నుంచి రూ.1930 కోట్ల రుణానికి..
పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలోని కొద్ది ప్రాంతానికి ఉపయోగపడే చింతలపూడి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు నాబార్డు సంస్థ నుంచి రూ.1930 కోట్ల రుణాన్ని తీసుకోవడానికి ఇరిగేషన్‌ శాఖకు అనుమతి ఇస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

6 జిల్లా వాటర్‌ షెడ్ల అభివృద్ధి
పులివెందుల బ్రాంచ్‌ కెనాల్, సీబీఆర్‌ రైట్‌ కెనాల్‌ ఫేజ్‌–2 కింద మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 6 జిల్లాల్లో వాటర్‌ షెడ్ల అభివృద్ధికి వెసులుబాటు వస్తుంది. 

జాస్తి నాగభూషన్‌ నియామకానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌గా జాస్తి నాగభూషణ్‌ నియామకం చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయం కేబినెట్‌ ఆమోదించింది. 

సినీ పరిశ్రమను ఆదుకునేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీ
సినీ పరిశ్రమకు కూడా రీస్టార్ట్‌ ప్యాకేజీ ఇచ్చేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన నాటి నుంచి అక్టోబర్‌లో థియేటర్లు తెరుచుకోవచ్చని కేంద్రం వెసులుబాటు కల్పించినా.. ఈరోజుకూ మూతపడే ఉన్నాయి. సుదీర్ఘ కాలం థియేటర్లు మూతపడి ఉంటే.. ఫర్నిచర్‌ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి థియేటర్లు ఊపిరిపోసుకోవడానికి ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ కింద పరిగణలోకి తీసుకొని మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్‌) పాటు థియేటర్‌ యాజమాన్యం చెల్లించాల్సిన ఫిక్డ్స్‌ విద్యుత్‌ బిల్లులను రద్దు చేయడం జరిగింది. మిగిలిన కాలానికి ఫిక్డ్స్‌ పవర్‌ చార్జీల చెల్లింపునకు వాయిదాలు వేసేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11 వందల థియేటర్ల యాజమాన్యాలకు లబ్ధి చేకూరుతుంది. 

థియేటర్లకు రూ.5 నుంచి 10 లక్షల రుణసదుపాయం
రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు కూడా ఇప్పించాలని నిర్ణయం. థియేటర్ల పరిభాషలో ఏ సెంటర్, బీ సెంటర్‌లో ఉన్న థియేటర్లకు రూ.10 లక్షల చొప్పున, సీ సెంటర్‌లోని థియేటర్లకు రూ.5 లక్షల చొప్పున రుణాలు ఇప్పించాలని, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారిటోరియం, తరువాత ఏడాది పాటు 4.5 శాతం వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వంపై రూ.4 కోట్లు భారం పడినా సినీ పరిశ్రమకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top