వైయస్ఆర్ జిల్లా: సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 90 శాతానికి పైగా హామీలు అమలు చేసిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది అని అన్నారు. బద్వేల్ ఉపఎన్నిక నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ కు మద్దతుగా బద్వేల్ పట్టణంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బద్వేలు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 2019 ఎన్నిక తరహాలోనే ఉపఎన్నికల్లో కూడా డాక్టర్ సుబ్బయ్య సతీమణి డాక్టర్ సుధకు మద్దతుగా నిలవాలన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన అజెండా అంతా ఒక్కటే. ప్రజాదరణ పొందుతున్న సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురదజల్లడమే. మాకు ఎన్నికలు కొత్త కాదు. పంచాయతీ, స్థానిక సంస్థల్లో విజయం సాధించామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయి. ప్రజల నుంచి ప్రభుత్వానికి మంచి ఆదరణ లభిస్తోంది. కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. దళితులకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నాం' అని మంత్రి అన్నారు.

బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి
పెద్దఎత్తున బద్వేలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు బద్వేలు ప్రజలను పట్టించుకోలేదు. మన ప్రభుత్వం దాదాపు రూ.300 కోట్లతో సాగు, తాగు నీరు అందించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కుందూ నది నుంచి ఎత్తిపోతల ద్వారా బ్రహ్మం సాగర్‌కు నీటిని తరలించి కరవు పరిస్థితిలో కూడా బద్వేలు ప్రాంత రైతాంగానికి నీరు అందించబోతున్నాము. వ్యవసాయనికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టబోతున్నాం.
బద్వేలు చెరువుకు నీరు అందించేందుకు ఎల్‌ఎస్పీ కాలువ విస్తరణ చేపడుతున్నాం. బద్వేలు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.130 కోట్లతో పనులు చేస్తున్నాం. సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న బద్వేలు రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. బద్వేలు ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని ఇండస్ట్రియల్ కారిడార్‌లో రూ.1,000 కోట్లతో సెంచురీ ప్లైవుడ్ పరిశ్రమ రాబోతోంది. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అందరూ కృషి చేసి డాక్టర్ సుధాను భారీ మెజారిటీతో గెలిపించాలి' అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. ప్రచారంలో మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప రత్నాకర్, తదితరులు పాల్గొన్నారు.