బాధ్యత తెలియని వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండటం దురదృష్టకరం

చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ వ్యవహార శైలి

ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఆనవాయితీగా వస్తోంది

ఎన్నికల్లో ప్రలోభాలకు పాల్పడితే జరిమానా, జైలుశిక్ష, అనర్హత వేటు

చట్టం కచ్చితంగా అమలు చేసి తీరుతాం

గ్రామాల అభివృద్ధికి ఏకగ్రీవాలను ప్రోత్సహించండి

పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని, బాధ్యత తెలియని వ్యక్తి ఎస్‌ఈసీగా ఉండటం దురదృష్టకరమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిమ్మగడ్డను ఉపయోగించుకొని పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదిని ఇబ్బందిపెడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అనుచరుడిగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. ఒక ఐఏఎస్‌ అధికారి గుర్తించి తొమ్మిది పేజీల లేఖ రాశాడని, అధికారి వ్యక్తిగత సమాచారాన్ని లేఖలో రాయకూడదని నిమ్మగడ్డకు తెలియదా అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ తన విచక్షణాధికారాన్ని విచక్షణారహితంగా వాడుకుంటున్నాడని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. 

తిరుపతిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్నప్పటికీ.. కోర్టు ఆదేశాలను గౌరవించి ప్రభుత్వం కూడా ఎన్నికలకు సిద్ధమైందన్నారు. 

చంద్రబాబు అధికారంలో ఉండగా.. పంచాయతీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను మంత్రి పెద్దిరెడ్డి ప్రశ్నించారు. గతేడాది మార్చిలో జరగాల్సిన ఎన్నికలను చంద్రబాబు మాటలు విని వాయిదా వేశాడన్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో, వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నాడని దుయ్యబట్టారు. ఎన్నికల విధుల్లో పనిచేసే ఉద్యోగులకు ఏదైనా జరిగితే నిమ్మగడ్డ బాధ్యత వహిస్తారా..? అని ప్రశ్నించారు. 
 
ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం చాలా సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుందని గుర్తుచేశారు. ఆ దశలోనే.. 2 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీ నుంచి 10 వేల పైన జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 నుంచి రూ.20 లక్షల ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. ఏకగ్రీవాలు అయితే ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం భావించిందన్నారు. దీనికి కూడా ఐ అండ్‌ పీఆర్‌ సెక్రటరీని వివరణ కోరడం విడ్డూరంగా ఉందని, నిమ్మగడ్డ లాంటి వ్యక్తి ఎస్‌ఈసీ హోదాలో ఉండటం దురదృష్టకరమన్నారు. 

పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఏకగ్రీవాలు జరగని పంచాయతీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్నారు. ఎన్నికల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కానీ ఓటర్లను ప్రలోభ పెడితే వారికి రూ.10 వేల జరిమానాతో పాటు, 3 సంవత్సరాల జైలు శిక్ష, అనర్హత వేటు పడుతుందన్నారు. ఈ చట్టం కచ్చితంగా అమలు జరుగుతుందని, ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని సూచించారు. 
 

Back to Top