అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేశాం

సీఎం వైయస్‌ జగన్‌ పథకాలను కేంద్రం సైతం అభినందిస్తోంది

రైతుల భూములు లాక్కొని సింగపూర్‌ కంపెనీకి అప్పగించిన నీచ చరిత్ర చంద్రబాబుది

పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

గుంటూరు: రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా.. 'వైయస్‌ఆర్‌ రైతు భరోసా -పీఎం కిసాన్‌' పథకం ద్వారా అన్నదాతలకు సీఎం వైయస్‌ జగన్‌ సాయం అందించారని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు.  గుంటూరులో మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా పథకం ద్వారా 49 లక్షల మంది రైతులకు సీఎం వైయస్‌ జగన్‌ సాయం అందించారన్నారు. విత్తనాలు వేసిన నాటి నుంచి ఆ పంట చేతికొచ్చి.. దాన్ని అమ్మేవ‌ర‌కు ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతోందన్నారు. ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధికి రూ.3 వేల కోట్లు కేటాయించిన ఘ‌న‌త సీఎం వైయస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సేవ‌ల‌ను కేంద్ర బృందం సైతం అభినందించిందన్నారు.

నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను అమ్మడం సహజమేనని, గత ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ భూములను అమ్మిన పరిస్థితులు ఉన్నాయని మంత్రి మోపిదేవి అన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సమంజసం కాదన్నారు. సదావర్తి భూముల విషయంలో టీడీపీ ఏ విధంగా వ్యవహరించిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. రాజధాని పేరుతో రైతుల భూములు బలవంతంగా లాక్కొని సింగపూర్‌ సంస్థలకు అప్పగించిన నీచ చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. అభివృద్ది పేరుతో భూములను అమ్మడం అనే అంశం పై టీడీపీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, భూముల విషయంలో గత ప్రభుత్వ అవినీతి తవ్విన కొద్ది బయటపడుతుందన్నారు. 

Back to Top