గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై ఇటీవల జరిగిన దాడి నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు ఈ ఘటన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్య అని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైసీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రజాదరణ కలిగిన నాయకుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు మరియు ఆయన కుటుంబానికి పూర్తి సంఘీభావంగా నిలుస్తుందని చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, రాజకీయ ప్రతీకార చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, అవసరమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.