నెల్లూరు: ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీకి సంబంధించిన ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా శివశంకర్‌రెడ్డి అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నెల్లూరు నగర నియోజకవర్గ బీఎల్ఏలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులోని శ్రీ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి వైయస్ఆర్‌సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ సభ్యుడు గురుమూర్తి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పుత్తా శివశంకర్ రెడ్డి, పార్టీ ప్రతినిధులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్‌ఐఆర్ సర్వేపై బీఎల్ఏలు, బీఎల్వోలను సమన్వయం చేసుకుంటూ పార్టీ ఓటర్ల పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పుత్తా శివశంకర్ రెడ్డి వివరించి అవగాహన కల్పించారు. “ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు. ప్రతి బీఎల్ఏ అప్రమత్తంగా పనిచేస్తూ బీఎల్‌వోలతో సమన్వయం చేసుకోవాలి. పార్టీకి చెందిన ప్రతి ఓటు భద్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి” అని పుత్తా శివశంకర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ ప్రతినిధులు ఇచ్చిన సూచనలు, సమాచారం ఆధారంగా BLAలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ ఓటర్లు ఎక్కడా ఓటు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, శాసన మండలిలో ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టే విధంగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని ఎంపీ గురుమూర్తి, పుత్తా శివశంకర్ రెడ్డి కొనియాడారు. జిల్లాకు కేంద్ర పార్టీ ప్రతినిధులు విచ్చేసి బీఎల్ఏలకు ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించడం సంతోషకరమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.