తాడేపల్లి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలతో రైతులు, ఆటో కార్మికులు, ఆక్వా రంగం తీవ్రంగా ఇబ్బంది పడుతోందని, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా పెంచిన ఛార్జీలు తక్షణం తగ్గించాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. పెరిగిన ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఏటా దాదాపు రూ.3,400 కోట్ల భారం పడుతోందని, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటి సామాన్యుడు పడుతున్న అవస్థలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ఓటేసి గెలిపించిన ప్రజలకు మేలు చేయాలన్న దృక్పథం చంద్రబాబులో కనిపించడం లేదని, గెలిచి అధికారంలోకి వచ్చాక మోసం చేయాలన్న ఆలోచనతోనే అలవికాని హామీలు ఎన్నికల్లో గుప్పించారని ఆరోపించారు. దగా, దోపిడీ, వెన్నుపోటు చంద్రబాబు మూల సూత్రాలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. ప్రెస్‌మీట్‌లో లేళ్ల అప్పిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..: జగన్‌గారి వ్యక్తిత్వ హననం వారి లక్ష్యం: అధికారంలోకి వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడవచ్చనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మోసపు హామీలతో నమ్మించాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీకి కూడా అతీగతీ లేదు. సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు రాష్ట్రాన్ని నిండా అప్పుల్లో ముంచేశాడు. ప్రభుత్వం అంటే ప్రజలకు అండగా నిలిచేదిగా ఉండాల్సింది పోయి, చంద్రబాబు వ్యాపార సంస్థగా చూస్తున్నాడు. ప్రతిపక్షం ప్రశ్నిస్తుంటే సమాధానాలు చెప్పుకోలేక అక్రమ కేసులతో వేధించడం, వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారు. రెండేళ్లలో ఒక్క ప్రశ్నకైనా సూటిగా సమాధానం చెప్పారా?: గడిచిన రెండేళ్ల కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి మీద వైయస్ జగన్ గారు 25 ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వానికి ఎన్నో ప్రశ్నలు సంధించారు. కానీ ఏ ఒక్క ప్రశ్నకూ ప్రభుత్వం నుంచి సూటిగా సమాధానం రాలేదు. ప్రతిపక్షం ఆరోపణలుకు సమాధానం చెప్పే దమ్ము కూటమి నాయకులకు లేదు. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి, తప్పుడు ఆరోపణలతో ఎదురుదాడి చేయడం హేయం. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మాపై ఆరోపణలు చేయడమే తప్ప, అధికారంలో ఉండి కూడా నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందుంచే ధైర్యం లేదు. దోపిడీ, దగా, వెన్నుపోటు మూల సూత్రాలుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు. వెన్నుపోటు టీడీపీ పన్నుపోటుతో రాష్ట్ర ప్రజలను వేధిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరల పాపం చంద్రబాబుదే: గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పెట్రోల్ పై 31 శాతం, డీజిల్‌పై 22.5 శాతం వ్యాట్ వేశారు. అది కాకుండా అమరావతి సెస్ పేరుతో ప్రతి లీటరుపై మరో రూ.4 భారం మోపింది. దీంతో చంద్రబాబు కారణంగా రాష్ట్ర ప్రజలపై ఇంధన చార్జీల భారం పడింది. వైయస్ఆర్‌సీపీప్రభుత్వ హయాంలో కరోనా కారణంగా కేవలం ఒకే ఒక్క రూపాయి రోడ్‌సెస్‌గా విధించడం జరిగిందే తప్ప, ఇంధన చార్జీల భారం మోపింది మొత్తం చంద్రబాబే. అధికారంలోకి వచ్చాక పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ సగానికి తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు, లోకేష్.. ఆ పని చేయకపోగా పెట్రోల్, డీజిల్ ధరల భారంతో సామాన్యుల బతుకులు ఛిద్రం అవుతున్నా పట్టించుకోవడం లేదు. కొత్తగా మూడుసార్లు పెరిగిన పెట్రోల్ డీజిల్ చార్జీల కారణంగా రాష్ట్ర ప్రజలపై ఏటా దాదాపు రూ.3,400 కోట్ల భారం పడుతోంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈనెల 18న వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తే ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పందన లేదు. వైయస్ జగన్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక ఆయనపై వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు పాలనలో ఆకాశాన్నంటిన ధరలతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల్లో దేశంలోనే ఏపీ మొదటిస్థానం ఉంది. విజనరీనని చెప్పుకునే చంద్రబాబు దీనికి ఏం సమాధానం చెబుతారు? సంక్షోభంలోనూ స్కామ్‌కు యత్నం: రాష్ట్రంలో ఒకవైపు పెట్రో సంక్షోభం కొనసాగుతుండగా, ప్రజా ప్రయోజనాల కన్నా, అమరావతిలో నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అధిక ప్రాధాన్యంగా భావించే సీఎం చంద్రబాబు, అక్కడి కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం రిటైల్ బంకుల్లో సామాన్యులకు ఇచ్చే ధరలకే డీజిల్ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసి, సంక్షోభంలోనూ స్కామ్‌కు తెర తీశారు. అయితే దానిపై కేంద్రం ససేమీరా అంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రజలపై పడుతున్న ఇంధన భారం తగ్గించడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? చంద్రబాబుకి తన వ్యాపార ప్రయోజనాలు తప్ప, ప్రజా ప్రయోజనాలపై ఏ మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. ముఖ్యమంత్రి స్థాయికి తగినట్టు వ్యవహరించాలి: చంద్రబాబు కూటమి పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. అన్ని వ్యవస్థలు విధ్వంసం అయ్యాయి. రాజధానిలో బిల్డింగుల అద్దాలకు రూ.2540 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, సామాన్యుడిపై పడుతున్న ధరల భారాన్ని తగ్గించడానికి మాత్రం ఆలోచించడం లేదు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలి. ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్: ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే గొడ్డలి పార్టీ, వివేకానందరెడ్డి మర్డర్ అంటూ పదే పదే మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. ఇచ్చిన హామీలు అమలు చేయడం కన్నా, వైయస్ జగన్ గారిని తిట్టడమే కూటమి సింగిల్ ఎజెండాగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి స్ధానంలో ఉన్న చంద్రబాబు స్థాయికి తగినట్టు వ్యవహరించాలి. లేని పక్షంలో దిగజారి మాట్లాడుతున్న చంద్రబాబు మాటలకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని లేళ్ల అప్పిరెడ్డి హెచ్చరించారు.