అనంతపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల రక్షణ పూర్తిగా కరువైందని, యువత ఉపాధి అవకాశాలు లేక మద్యం, గంజాయి మత్తులో భవిష్యత్తును కోల్పోతున్నారని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మండిపడ్డారు. అనంతపురం నగరంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళా సాధికారతను పూర్తిగా గాలికి వదిలేసిన ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రతి మహిళ ముగ్గురు లేదా నలుగురు పిల్లలను కనాలని సూచిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ముందుగా ఆ కార్యక్రమాన్ని తన కుటుంబం నుంచే ప్రారంభించాలని ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం వంటి పథకాలను అటకెక్కించారని విమర్శించారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలను నిరాశపరుస్తోందని ఆమె మండిపడ్డారు. సమావేశంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కేఎల్ దేవి, జిల్లా కార్యదర్శి భారతి, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల అధ్యక్షురాళ్లు పి. రేవతి, బిందె వరలక్ష్మి, యాదవ్, మైనార్టీ విభాగం మహిళా నాయకురాలు కమర్ తాజ్, మహిళా నేతలు అంజలి, మహేశ్వరి, చంద్రకళ, సుగుణమ్మ, శోభారాణి తదితరులు పాల్గొన్నారు.