నెల్లూరు: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాల కారణంగా రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు, మరణాలు పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. 2024తో పోలిస్తే గతేడాది రాష్ట్రంలో రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. అంతకు ముందు వైయస్ జగన్ మోన్‌రెడ్డి సర్కార్ రైతులకు వ్యవసాయాన్ని పండగలా మారిస్తే.. దానికి భిన్నంగా కూటమి సర్కార్ వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఇందుకు నిదర్శనమే పెరుగుతున్న అన్నదాతల బలవన్మరణాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రెస్ మీట్‌లో కాకాణి ఇంకేమన్నారంటే..: రికార్డు స్దాయికి రైతు ఆత్మహత్యలు: టీడీపీ కూటమి ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల్లో రికార్డులు సృష్టిస్తోంది. 2025లో ఏపీలో జరిగిన రైతులు, రైతు కూలీల ఆత్మహత్యలపై పోలీసులు ఓ నివేదిక ఇచ్చారు. 2025లో మొత్తం 2,865 మంది రైతులు, రైతుకూలీలు ఆత్యహత్య చేసుకున్నారు. 2024తో పోలిస్తే దాదాపు 5 శాతం ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. ఇది రైతాంగాన్ని, సమాజాన్ని కలవరపాటుకు గురిచేసే అంశం. ఎందుకంటే అన్నదాతల ఆత్మహత్యల్ని ఎవరూ అంగీకరించరు. ఈ సమాజం, ప్రజలు కడుపుకు పట్టెడన్నం పెట్టే రైతు చనిపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. పెట్టుబడి సాయం చేయకపోవడం, రైతులకు కనీసం యూరియా అందించలేకపోవడం, నకిలీ ఎరువులు, విత్తనాల బెడద, ఉచిత పంటల బీమా తీసేసి, ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వకుండా వేదనకు గురిచేసే పరిస్ధితుల్లో పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు చనిపోతున్నారు. ప్రకటనలే తప్ప చిత్తశుద్ది కరవు: ధాన్యం కొనుగోలు కేంద్రాలు, పంటల కొనుగోలు కేంద్రాల పేరుతో హడావిడి ప్రకటనలు తప్ప, రైతుల్ని ఆదుకోవాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి లోపించింది. ఏ రోజూ రైతు విధానాల మీద, రైతులు ఎందుకిలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మీ పోలీసులు ఇచ్చిన నివేదిక మీద సమీక్షించారా?. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా మాకేం ఫర్వాలేదన్నట్లుగా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. తద్వారా రైతులపై మీ ఏహ్యభావం, నిర్లక్ష్యం మరోసారి బయటపెట్టుకుంటున్నారు. రైతులతో పాటు రైతు కూలీలు కూడా వ్యవసాయంపై మక్కువ తగ్గిపోయి, వారి కుటుంబాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆనాడు రైతు పక్షపాతిగా వైయస్ జగన్: వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అన్ని విధాలా రైతుల్ని చేయి పట్టుకుని నడిపించామని గర్వంగా చెప్పుకుంటున్నాం. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించి జగన్మోహన్‌రెడ్డి ఎన్ని సందర్భాల్లో సమీక్షలు పెట్టారో, రైతుల విషయాలపై వేగంగా నిర్ణయాలు తీసుకున్నారో చూశాం. అప్పట్లో ఏనాడూ ప్రకటనలకు పరిమితం కాలేదు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే విషయాన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆచరణలో చూపారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, ఉచిత పంటల బీమా, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే వెంటనే ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారు. రైతులు ఎక్కువగా సాగుచేసే పంటలకు కనీస మద్దతు ధరలు ప్రకటించారు. రూ.8,845 కోట్లు విద్యుత్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్లిపోతే వాటిని చెల్లించి, మళ్లీ వారికి ఉచిత విద్యుత్ పునరుద్ధరించాం. ఇంకా ఆ 5 ఏళ్లలో వ్యవసాయానికి విద్యుత్ సబ్సిడీ కింద ఏకంగా రూ.43,744 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మరోవైపు రైతుల కోసం వ్యవసాయ విద్యుత్ ఫీడర్ల సామర్ధ్యం పెంచడం, విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం, మత్సకార భరోసా, డీజిల్ సబ్సిడీ, సూక్ష్మసేద్యం, పండ్ల తోటల అభివృద్ధికి ఇతోథితంగా సాయం చేయడం, అనేక పరికరాలు ఇవ్వడం, చంద్రబాబు వదిలేసిన రూ.384 కోట్ల విత్తన బకాయిలు కూడా చెల్లించాం. అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతులకుటుంబాలకు చంద్రబాబు ఎగ్గొట్టిన సాయాన్ని ఇవ్వడంతో పాటు, ఆ పరిహారాన్ని రూ.7 లక్షలకు పెంచడం జరిగింది. చంద్రబాబుకు వ్యవసాయం అంటేనే గిట్టదు: చంద్రబాబుకు వ్యవసాయం అంటే నిర్లక్ష్యం. వ్యవసాయం పట్ల అవగాహన లేదు. వ్యవసాయం మీద సమీక్షలు లేవు. ఈ రాష్ట్రానికి వ్యవసాయ మంత్రి ఉన్నాడో లేడో కూడా ప్రజలకు తెలియదు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకర పరిణామం. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాల్ని ఆదుకోవడంతో పాటు, వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అయినా నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు.