శ్రీవారి ల‌డ్డూపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఫైర్‌

అన్న‌మ‌య్య జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమై ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని రాజంపేట వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ రెడ్డి ఆరోపించారు. రాజంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ నివేదికలో కూడా లడ్డూ నెయ్యి కల్తీ జరగలేదని వెల్లడైనప్పటికీ, అదే అంశాన్ని రాజకీయ లాభం కోసం మళ్లీ మళ్లీ ప్రస్తావించడం దురుద్దేశపూరిత చర్య అని మండిపడ్డారు. వాస్తవానికి గత టీడీపీ పాలన సమయంలోనే లడ్డూ నెయ్యి కల్తీ జరిగిందని, ఇది అక్షర సత్యమని అన్నారు.

తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీపై ఆరోపణలు చేయడం అత్యంత దుర్మార్గమని ఆకేపాటి అమర్నాథ రెడ్డి విమర్శించారు. లడ్డూ కల్తీ జరిగినట్లయితే అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడును మందలించిన సందర్భాలు ఉన్నప్పటికీ కూటమి నేతలు వెనక్కు తగ్గడం లేదని అన్నారు.

ప్రజల విశ్వాసాలకు కేంద్రబిందువైన తిరుమల శ్రీవారి పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం దారుణమని, దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు మరియు వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. అసత్య ప్రచారం చేస్తున్న నాయకులను శ్రీ వెంకటేశ్వర స్వామి క్షమించరని, నిజం ఎప్పటికైనా వెలుగులోకి వస్తుందని ఆకేపాటి అమర్నాథ రెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top