ఆక్వారైతులు అధైర్యపడొద్దు

ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది

ప్రాసెసింగ్‌ యూనిట్లు మూసిస్తున్నారనేది అబద్ధం

ఆక్వారైతులను నష్టపరిస్తే కఠిన చర్యలు తప్పవు

కార్మికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

నిత్యావసర వస్తువులకు కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం

కరోనా కంట్రోల్‌లో వలంటీర్లది ప్రధాన పాత్ర

పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ

సచివాలయం: గిట్టుబాటు ధర లభించదనే అభద్రతాభావాన్ని ఆక్వా రైతులు వీడాలని, కరోనా వైరస్‌ ఆక్వారంగంపై ప్రభావం చూపకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పశు సంవర్థక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. ఆక్వా రిలేటెడ్‌ సీడ్‌, ఫీడ్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఫిషరిస్‌, జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సచివాలయంలో మంత్రి మోపిదేవి వెంకట రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  

'ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఆయా దేశాలు ప్రజలను రక్షించుకోవడానికి అనేక రకాల చర్యలు చేపడుతున్నాయి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రధాని పిలుపు మేరకు అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించాయి. సీఎం వైయస్‌ జగన్‌ సూచన మేరకు ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొని విజయవంతం చేశారు.

ప్రభుత్వ సూచనల మేరకు కరోనా మహమ్మారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు జాగ్రత్త పాటిస్తున్నారు. ఏపీలోనే అతితక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కల ప్రకారం మూడు మాసాల్లో 13 వేల మంది పైచిలుకు ఏపీకి విదేశాల నుంచి వస్తే ఇప్పటి వరకు 6 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రభుత్వం ఎంత ముందుచూపుతో నిర్దిష్టమైన చర్యలు చేపట్టిందనేందుకు ఇదొక ఉదాహరణ.

సీఎం వైయస్‌ జగన్‌ వలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చి నూతన పరిపాలన విధానానికి శ్రీకారం చుట్టారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు వలంటీర్లను కించపరిచేలా మాట్లాడాడు. అలాంటి వలంటీర్ల వ్యవస్థ ఈ రోజు ప్రధాన పాత్ర పోషిస్తోంది. వేల మంది ఇతర దేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చినా కరోనా ప్రభావం ఎక్కువగా లేకుండా జాగ్రత్త పడడంలో ఏపీ ముందంజలో ఉంది.  దానికి ప్రధానంగా సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపుతో ఏర్పాటు చేసిన గ్రామ వలంటీర్లు,  సచివాలయ వ్యవస్థ కారణం. ఆశా వర్కర్లు, ఆరోగ్యశ్రీ కార్యకర్తలకు ధన్యవాదాలు.

నిత్యావసర వస్తువులకు సంబంధించి ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చాం. ఫిషరిస్‌ సెక్టార్‌, పౌల్ట్రీ కరోనా ఎఫెక్ట్‌తో ఇబ్బందులు పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆక్వా రైతులు ఒక అభద్రతా భావంలో ఉన్నారు. ఆక్వా ప్రొడక్ట్స్‌ ఎక్కువగా ఇతర దేశాల మార్కెట్‌పై డిపెండై ఉన్నాయి. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గిట్టుబాటు ధర లభించదనే అభద్రతాభావం నుంచి బయటకు రావాలి. ఉత్పత్తులను తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దు. రైతు బలహీనతను దృష్టిలో పెట్టుకొని ప్రాసెసింగ్‌ యజమానులు రైతులకు నష్టం చేస్తున్నారు. అలాంటివి మా నోటీస్‌లోకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రాసెసింగ్‌ యూనిట్లలో పనిచేసే కార్మికుల కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని యజమాన్యాన్ని కోరుతున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. కరోనా వైరస్‌ వల్ల ప్రాసెసింగ్‌ యూనిట్లను షెట్‌డౌన్‌ చేయించడం లేదు. రైతులు అభద్రతాభావానికి గురికావొద్దు. తక్కువ రేట్లకు సరుకు కొనుగోలు చేయాలని దళారీలు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు' అని హెచ్చరించారు. 

 

Back to Top