సచివాలయం: రోలెక్స్ వాచీలు, బెంజ్ కార్లు, బౌన్సర్లతో పాదయాత్ర చేస్తున్న వారిని రైతులు అంటారా..? అని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. వారిని చూసి నిజమైన కర్షకులు ఆశ్చర్యపోతున్నారన్నారు. అమరావతిలో చౌకగా కొట్టేసిన భూముల విలువలు పెంచుకోవడానికి రైతుల ముసుగులో చంద్రబాబు అండ్ కో చేస్తున్న యాత్ర అని అభివర్ణించారు. అమరావతిని రూ.4 లక్షల కోట్లతో చంద్రబాబు అభివృద్ధి చేస్తారని అంటున్నారు.. ఆ డబ్బు ఎవరు ఇస్తారు.. ఎక్కడ నుంచి తెస్తారు.. ఏ దేశం నుంచి అప్పు తీసుకొస్తారు..? అని ప్రశ్నించారు. సచివాలయంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి ఏమన్నారంటే.. హైదరాబాద్ మన అందరిదీ అనే ఉద్దేశంతో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. కానీ రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌ను కోల్పోయాం. అప్పుడున్న ముఖ్యమంత్రులకు దూరాలోచన ఉండి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇవ్వాళ మళ్లీ అదే పరిణామం చోటు చేసుకుంటుంది. అమరావతి చుట్టే అన్నీ అని కొంతమంది కావాలని హంగామా చేస్తున్నారు. వందల ఎకరాల అసైన్డ్ భూములు బినామీల పేరు మీద కొనుగోలు చేసి.. ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తున్నారు కానీ, ఆంధ్రరాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు అండ్ కో ఆలోచన చేయడం లేదు. సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో వికేంద్రీకరణ జరగాలి.. మూడు రాష్ట్రాలు ముఖ్యం అని ఆయన తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా ఏకీభవిస్తున్నారు. విశాఖ పరిపాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా ఉండటానికి ప్రజలంతా అంగీకరించారు. ఆస్తుల కోసం రోలెక్స్ వాచీలు, బెంజ్ కార్లు, బౌనర్లతో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలంతా వారిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా మూడు ప్రాంతాల అభివృద్ధిని ప్రజలంతా కోరుకుంటున్నారు. రాబోయే తరాలకు అన్యాయం జరగకుండా.. భేదాభిప్రాయాలు లేకుండా సమానంగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అమరావతిని నాలుగు లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తారని మాట్లాడుతున్నారు. నాలుగు లక్షలకోట్లు ఎక్కడి నుంచి తెస్తారు.. ఏ దేశం నుంచి అప్పు తెస్తారు.. శ్రీలంక చైనా నుంచి ఇష్టానుసారంగా అప్పుతెచ్చి.. ఆర్భాటాలకు పోయి కుప్పకూలిపోయింది. నాలుగు లక్షల కోట్ల రూపాయలు అమరావతిలోనే ఖర్చు చేస్తే మిగిలిన ప్రాంతాలు ఏమైపోతాయో అర్థం చేసుకోండి. ఈ రాష్ట్ర ప్రజల మనుగడ ప్రధానం. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించేవారి æ యాత్రలను ఎవరూ పట్టించుకోరు. ఇది చంద్రబాబు అండ్ కో యాత్ర ఇది. మూడు ప్రాంతాల అభివృద్ధి ముఖ్యమంత్రి వైయస్ జగన్, రాష్ట్ర ప్రజల అభిమతం’’ అని మంత్రి నాగేశ్వరరావు అన్నారు.