రాష్ట్రంలో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ కుట్ర

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు  

చంద్రబాబు అరెస్టుతో సానుభూతి రాజకీయం

బాబు,లోకేశ్‌ మాటలనే పవన్‌ వారాహిలో వల్లె వేస్తున్నాడు

టీడీపీ–జనసేన కూటమిని ప్రజలు నమ్మడం లేదు

వచ్చే ఎన్నికల్లో మళ్లీ మాదే విజయం.ఇది తథ్యం

నాడు తెలుగుదేశం అవినీతి పార్టీ అన్న పవన్‌

ఈరోజూ పూర్తిగా యూటర్న్‌. ఆ పార్టీతోనే సయోధ్య

 

తాడేపల్లి: రాష్ట్రంలో అల్లర్లకు తెలుగుదేశం పార్టీ కుట్ర ప‌న్నింద‌ని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుమానం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ.. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు పాలయ్యారని అన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు.  కేసుల నుంచి బయటపడటానికి చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని మంత్రి కారుమూరి చెప్పారు. బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదని స్పష్టం చేశారు. బాబు పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు.  తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

అలజడులకు కుట్ర:
    స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు మెక్కేసిన చంద్రబాబునాయుడు అరెస్టు, జైలుకు వెళ్లిన నాటి నుంచి టీడీపీ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని కుట్రలు చేస్తోంది. అయితే ఏం చేసినా ప్రజలు మాత్రం ఒక్క క్షణం కూడా చంద్రబాబు గురించి ఆలోచించడం లేదు. ఎందుకంటే ఈరోజు సీఎంగారు ఆ విధంగా పాలిస్తున్నారు. అందరికీ మేలు చేస్తున్నారు.
    చంద్రబాబుగారు ప్రజల దగ్గరకు యాక్టర్లను పంపిస్తుంటే, జగన్‌గారు డాక్టర్లను పంపిస్తున్నారు. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఇంటికి వైద్యులు వెళ్తున్నారు. వ్యాధులు గుర్తించి మంచి వైద్యం అందిస్తున్నారు.
మరోవైపు అన్ని సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.
14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, తాను ఇది చేశాను.. అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఎంతసేపూ ఎల్లో మీడియాలో డబ్బా కొట్టుకోవడమే తప్ప. నిజంగా ఆయన ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.

చంద్రబాబు తప్పు చేశారు:
    చంద్రబాబు అరెస్టు తర్వాత ఆ సామాజికవర్గానికి చెందిన వారంతా మీటింగ్‌లు పెట్టుకున్నారు. చంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేయలేదు. ఆయన ఎన్నో తప్పులు చేశాడు. ఇప్పుడు పాపం పండి, జైలుకు వెళ్లాడు అని. అదే ఆరోజు జగన్‌గారిపై తప్పుడు కేసులు పెట్టి, కాంగ్రెస్, టీడీపీ కుట్ర చేసి జైలుకు పంపారు.
    స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబుకు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఆయన నిధులు విడుదల చేయాలని 13 చోట్ల స్వయంగా సంతకాలు పెట్టారు.
ఇవాళ కోర్టుల్లో లాయర్లకు కోట్లు వెదజల్లుతున్నారంటే, ఏ స్థాయిలో చంద్రబాబు దోపిడి చేశారనేది అర్ధమవుతుంది.
    చంద్రబాబు తప్పు చేశాడని కోర్టు నమ్మింది కాబట్టి, ఆయనను కస్టడీకి పంపారు. అందులో సీఎంగారి ప్రమేయం ఏముంది? ఆయనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు? చంద్రబాబు తన పాలనలో తన వర్గానికి, రామోజీరావుకు మేలు చేశారు. నిజానికి ఆయన ప్రజలకు చేసిందేమీ లేదు.

జగన్‌గారి సుపరిపాలన:
    అదే జగన్‌గారు ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారు. అందరికీ ఎంతో మేలు చేస్తున్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో.. జగన్‌గారు ప్రతి క్షణం.. కులం, మతం, వర్గం, రాజకీయాలకు అతీతంగా పాలిస్తున్నారు. అర్హతే ప్రధాన అర్హతగా పథకాలు అమలు చేస్తున్నారు. ఎక్కడా వివక్ష లేదు. 
    అదే చంద్రబాబు హయాంలో పెత్తనమంతా జన్మభూమి కమిటీలదే. వారు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా అవినీతి చేశారు. అడ్డగోలుగా దోచుకు తిన్నారు. ఇప్పుడు ప్రతి పథకం పూర్తి పారదర్శకంగా అమలవుతోంది. లబ్ధి నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది.
వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పని చేస్తుంటే.. చంద్రబాబుకు, పవన్‌కు మింగుడు పడడం లేదు. నిజానికి గతంలో బాబు పాలనలో ఏనాడూ, ఇలా పథకాలు అందలేదు. తెలుగుదేశం పార్టీకి చివరకు కార్యకర్తలు కూడా లేకుండా పోయారు. దీంతో రాష్ట్రంలో ఎలాగైనా అలజడులు సృష్టించాలన్న దురుద్దేశంతో టీడీపీ పూటకో పిలుపునిస్తోంది. ఇవాళ, జగన్‌గారు ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయారు. రాష్ట్రంలో  ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఎంతో మేలు చేస్తున్నారు.

ప్లేట్ ఫిరాయించిన పవన్‌కళ్యాణ్‌:
    పవన్‌కళ్యాణ్‌ వారాహి యాత్ర బహిరంగ సభల్లో ఏం మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇంతకాలం చంద్రబాబు, లోకేశ్‌.. ఏం మాట్లాడారో.. ఎలా తిట్టారో.. అవన్నీ ఇప్పుడు పవన్‌తో మాట్లాడిస్తున్నారు. 
    ఇదే తెలుగుదేశం పార్టీపై గతంలో చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆనాడు అంతులేని అవినీతి చేశారని దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు పూర్తిగా ప్లేట్‌ ఫిరాయించాడు. చంద్రబాబు తనపై ఉన్న 20 కేసుల్లో స్టే తెచ్చుకుని, విచారణ జరగకుండా అడ్డుకుని, తాను నిప్పును అంటున్నాడు. గతం అంతా మర్చిపోయిన పవన్‌ ఇప్పుడు ప్రభుత్వంపై రోజూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడా పొంతన లేకుండా మాట్లాడుతున్నాడు. సీఎంగారిని అదేపనిగా విమర్శిస్తున్నాడు. అంతే తప్ప, తమ ఎజెండా ఏమిటి? అధికారంలోకి వస్తే ఏం చేస్తాం? అన్న ఒక్క మాట కూడా చెప్పడం లేదు. షూటింగ్‌ విరామంలో వస్తున్నాడు. యాత్ర చేస్తున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. 

అన్నింటా ఎదుగుతున్న రాష్ట్రం:
    వాస్తవానికి ఇప్పుడు రాష్ట్రంలో సుపరిపాలన అందుతోంది. విద్యా రంగంలో ఎంతో ముందున్నాం.పేదరికాన్ని జయించడంలో మనం గతంలో దేశంలో 12వ స్థానంలో అట్టడుగున ఉంటే, ఇప్పుడు 6వ స్థానంలోకి వచ్చాం. అంటే రాష్ట్రంలో పేదరికాన్ని జగన్‌గారు తగ్గించారు. 
పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ఇది నీతి ఆయోగ్‌ నివేదిక చెబుతోంది. జీడీపీలో మన రాష్ట్రం నెంబర్‌ వన్‌గా ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. మన రాష్ట్రం చాలా తక్కువే అప్పులు చేసింది. అందుకే ఇకనైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి. 

పవన్ ను అంతా ఏవగించుకుంటున్నారు:
    రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి జరుగుతోంది. అందుకే పవన్‌ మాటలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు  మాటలను ఆయన సామాజికవర్గం వారు కూడా ఏవగించుకుంటున్నారు. చంద్రబాబు కోసమే పవన్‌ పని చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు.
అందుకే ఎవరు, ఎన్ని కుట్రలు చేసినా, ప్రజలు ఆదరించరు. 
    వలంటీర్ల ద్వారా ప్రజలకు మేలు జరుగుతుంటే, ఓర్వలేక వారిపై విమర్శలు చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. అందుకే జగన్‌గారు మళ్లీ సీఎం కావాలని ప్రజలంతా అనుకుంటున్నారు.

దశ, దిశలేని పవన్‌:
     పవన్‌కు ఒక దశ, దిశ లేదు. దేనిపైనా అవగాహన లేదు. ఆయన ఎప్పుడు, ఏం మాట్లాడతాడో అర్ధం కాదు. అలాంటి వ్యక్తి రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా? ఆలోచించండి. జగన్‌గారు ఎవరికీ భయపడరు. ఆరోజు సోనియాను ఎదిరించారు. ప్రజల్లో నిల్చి, వారి హృదయాలు గెల్చుకుని అధికారం చేపట్టారు.
    లోకేశ్‌ను ఢిల్లీలో ఎవరూ ఆదరించలేదు. చంద్రబాబు అరెస్టును ఎవరూ తప్పు పట్టలేదు. ఎందుకంటే చంద్రబాబు ఎంత అవినీతిపరుడో ఢిల్లీలో కూడా అందరికీ తెలుసు.  స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. నిజానికి ఆయన చాలా వాటిలో అవినీతి చేశాడు. ఫైబర్ గ్రిడ్‌ కుంభకోణం కూడా బయటకు వచ్చింది. అందులో, రూ.125 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ స్కామ్‌ కూడా బయటకు వస్తోంది.

Back to Top