తాడేపల్లి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా బీఆర్ నాయుడు కొనసాగడం తగదని, వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని వైయస్ఆర్‌సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఆయనకు దేవుడిపై భయం లేదని, మహిళల పట్ల గౌరవం లేదని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు ప్రోత్సహిస్తూ ఆయన వెంట తిప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే టీటీడీ ప్రతిష్ఠను కాపాడాలంటే బీఆర్ నాయుడును తక్షణమే చైర్మన్ పదవి నుంచి తప్పించాల్సిందేనని ఆయా ప్రాంతాల్లో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మి శివకుమారి, మాజీ మేయర్లు రాయన భాగ్యలక్ష్మి, శిరీషా స్పష్టం చేశారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ నాయుడు తమ కుటుంబ కార్యక్రమంలో పాల్గొంటే సీఎం సతీమణి నారా భువనేశ్వరి అభ్యంతరం చెప్పకపోవడం అంత్యంత హేయమని ఆకేపించారు. మీడియాతో వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లు ఏమన్నారంటే..వారి మాటల్లోనే.. - దేవుడంటే భయం లేదా? : కాకాణి పూజిత, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ నాయుడు గురించి ఒక మహిళ ఎన్నికలకు ముందుగానే చంద్రబాబుకు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆయన్ను టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వడం సిగ్గుచేటు. ప్రజలకు తెలియకపోయినా, వెంకటేశ్వరస్వామికి అన్నీ తెలుసు. ఆయన ఆలయంలో ఇలాంటి తప్పులు చేసే వ్యక్తులు ఉండటాన్ని దేవుడే సహించడం లేదు. అందుకే బీఆర్ నాయుడు వీడియోలు బయటకు వచ్చాయి. టీటీడీ వంటి పరమ పవిత్ర సంస్థ ప్రతిష్టను దెబ్బతీస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న బీఆర్ నాయుడిని చంద్రబాబు వెనకేసుకుని రావడం దారుణం. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజును తిరుమలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బీఆర్ నాయుడిని వెంట తిప్పుకొని భక్తుల మనోభావాలను మరింతగా దెబ్బతీశారు. భక్తుల గురించి ఆలోచన లేదు… భగవంతుడు అంటే వీరికి భయం లేదు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి కూడా బీఆర్ నాయుడి విషయంలో అభ్యంతరం చెప్పకపోవడం బాధాకరం. మహిళలకు అన్యాయం చేసే వారిని ప్రోత్సహించడం భువనేశ్వరికి తగదు. బీఆర్ నాయుడిని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని కాకాణి పూజిత హెచ్చరించారు. దేవుడికి చేసిన అపచారానికి తప్పకుండా ఫలితం ఉంటుంది అని ఆమె వ్యాఖ్యానించారు. - బీఆర్ నాయుడిని టీటీడీ చైర్మన్‌గా కొనసాగించడం సిగ్గుచేటు: లక్ష్మీ శివకుమారి, మాజీ ఎమ్మెల్సీ టీటీడీ వంటి పవిత్ర సంస్థకు చైర్మన్‌గా ఉన్న వ్యక్తిపై రాసలీలల ఆరోపణలు రావడం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఇంకా ఆ పదవిలో కొనసాగించడం సిగ్గుచేటు. ఎన్నికల సమయంలోనే ఇందులేఖ అనే మహిళ బీఆర్ నాయుడు నిజస్వరూపాన్ని వివరిస్తూ చంద్రబాబుకు లేఖ రాసినా, పట్టించుకోకుండా టీటీడీ చైర్మన్‌గా నియమించారు.అదే మహిళతో అశ్లీల వీడియోలు బయటకు వచ్చినా బీఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించలేదు. చంద్రబాబు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో బీఆర్ నాయుడును వెంట తిప్పుకున్నారు. ఆయన్ను ఎందుకు రక్షిస్తున్నారో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలి. - బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలి: రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ మాజీ మేయర్ టీటీడీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పవిత్రంగా భావించే సంస్థ, అలాంటి సంస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. ఒక మహిళ లేఖ ద్వారా బీఆర్ నాయుడి వ్యవహారశైలిని ముందుగానే తెలియజేసినా, ఆయనను టీటీడీ చైర్మన్‌గా నియమించడం ఎంతవరకు సమంజసం. బీఆర్ నాయుడి అశ్లీల వీడియోలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ నాయుడు ఆ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదు. బీఆర్ నాయుడిపై వెంటనే చర్యలు తీసుకుని టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం. టీటీడీ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. - బీఆర్ నాయుడును వెంట పెట్టుకొని తిరగడం సీఎంకు తగునా?: శిరీషా, తిరుపతి మాజీ మేయర్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను వెంట పెట్టుకొని తిరుమల కొండపై ముఖ్యమంత్రి చంద్రబాబు తిరగడం సరైనదేనా?. ఇటీవల బీఆర్ నాయుడు అశ్లీల వీడియోల వ్యవహారంలో బయటపడింది. ఈ ఘటనతో హిందూ సమాజం నిర్ఘాంతపోయింది, సోషల్ మీడియాలో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. టీటీడీ వంటి పవిత్ర సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తికి నైతిక విలువలు అవసరం, కానీ బీఆర్ నాయుడు ఆ ప్రమాణాలకు సరిపోరు. గతంలో ఎంతో మంది చైర్మన్లు ఉన్నప్పటికీ ఇలాంటి వివాదాలు ఎప్పుడూ లేవు. గోశాలలో గోవుల మరణాలు, తొక్కిసలాటలో భక్తుల ప్రాణనష్టం వంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇప్పుడే చూస్తున్నాం. భగవద్గీతపై గౌరవం లేని వ్యక్తికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు. టీటీడీ గౌరవం, తిరుమల ప్రతిష్ట కాపాడాలంటే బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని శిరీషా డిమాండ్ చేశారు.