‘బాబు’ సన్యాసానికి ‘వవన్‌’ విన్యాసాల్ని మేం పట్టించుకోం..

కావలిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

చంద్రబాబు, పవన్‌  పొలిటికల్‌ టూరిస్టులు 

ప్రజల్లో ఉనికి కోసం చేస్తున్న ఉత్తుత్తి పర్యటనలవి
 
రైతులపై వారిద్దరివి రక్తి కట్టని డ్రామాలే..
 

2014–19 హయాంలో రైతుగోడుపై బాబు, పవన్‌లు సమాధానమిస్తారా..?
 సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్‌రెడ్డి

 రైతు పక్షపాత ప్రభుత్వం మాది

  రైతుల పట్ల ఉదారంగా ఉండాలన్నదే సీఎం జగన్‌గారి ఆలోచన

 తడిచిన, రంగుమారిన ధాన్యంలో ప్రతీ గింజా కొంటాం

 మొక్కజొన్నకు గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నాం.

  ఈనెల 25లోగా పంటనష్ట అంచనాలపై సోషల్‌ ఆడిట్‌ పూర్తి చేస్తాం

  రైతుభరోసా సాయంతో కలిపి ఇన్‌ఫుట్‌సబ్సిడీ, పంటనష్ట పరిహారం అందజేస్తాం

 
కావలి: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులు పడిన మనోవేదన, వారి క్షోభకు ఆయనతో పాటు పవన్‌కళ్యాణ్‌ ఏం సమాధానం చెబుతార‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు?. ప్రజల్లో ఏదో ఉనికి కోసం ఆరాటపడుతూ పొలిటికల్‌ టూరిస్టుల్లా బాబు, పవన్‌కళ్యాణ్‌ తపన పడటాన్ని రైతులు అర్ధం చేసుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మేం క్షేత్రస్థాయిలో పర్యటించాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులంతా ఆనందంగా ఉన్నారు. గోనెసంచుల దగ్గర్నుంచి మద్ధతుధర వరకు ఎలాంటి సమస్యలు లేవని రైతులే చెబుతున్నారు. అయితే, ఇలాంటి మంచి వాతావరణం బాబు, పవన్‌లకు నచ్చడంలేదు. కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని రైతువేషాల్లో నిలబెట్టి వారిచేత మాట్లాడించి ఈ ప్రభుత్వం మీద ఏదో బురదజల్లే ప్రయత్నాలకు వారిద్దరూ తపనపడుతున్నారనేది ప్రజలకు తెలిసిపోయింది.

పవన్‌ విన్యాసాలను పట్టించుకోం:
    పవన్‌కళ్యాణ్‌ రైతుల సమస్యలు గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఆయన వస్తున్నారని తెలిసి ప్రభుత్వ యంత్రాంగం కదిలిందనే మాటలు.. ఆయనతో మాట్లాడిన రైతుల్ని ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నట్లు చెబుతున్న వాదనలన్నీ పచ్చి అబద్ధాలు. పవన్‌ ఈరోజుకి మొద్దునిద్ర వీడి రైతుల గురించి మాట్లాడటంలో ఆంతర్యమేంటో ప్రతీ ఒక్కరికి తెలుసు. అందుకని, మేం పవన్‌కళ్యాణ్‌ను, ఆయన విమర్శల్ని పట్టించుకునేందుకు సిద్ధంగా లేము. 
    ఇదే పవన్‌కళ్యాణ్‌ 2014 ఎన్నికల్లో చంద్రబాబుకు మద్ధతిచ్చి గెలిపించాడు. బాబు అధికారంలో ఉన్నప్పుడు రైతులు అనేక అంశాల్లో ఇబ్బందులకు గురైనప్పుడు.. ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు, ఎరువులు, విత్తనాల కోసమని క్యూ లైన్‌లో నిల్చొని ప్రాణాలు కోల్పోయినప్పుడు, వారికి రుణమాఫీ చేస్తానని బాబు ఎగొట్టినప్పుడు ఏమాత్రం నోరు మెదపకుండా మొద్దునిద్ర నటించిన పవన్‌కళ్యాణ్‌ ఈరోజు రైతుల గురించి మాట్లాడటం నీచం. అందుకు పవన్‌కళ్యాణ్‌ సిగ్గుపడాలి. 2019 ఎన్నికల్లో బాబు ఘోర పరాభవంతో ఓడిపోయి సన్యాసిగా మిగిలితే, ఇప్పుడు పవన్‌ మరో మారు ఆయనకు అధికారం రావాలంటూ విన్యాసాలు చేస్తున్నాడు. 

వారివి బురద జల్లే ప్రయత్నాలు:
     రైతులకు సంబం«ధించిన అనేక అంశాల్లో వారి దీర్ఘకాల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని అపరిçష్కృత సమస్యల్ని ఎప్పుడైతే సీఎంగారు పరిష్కరించడం మొదలుపెట్టారో.. ఆరోజు నుంచి చంద్రబాబు, ఆయన కంపెనీ నేతగా ఉన్న పవన్‌ ఇద్దరూ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలతో అక్కడక్కడా పంటనష్టం వాటిల్లింది. ప్రధానంగా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో అప్పటికే కోతకోసిన ధాన్యం తడిచింది. దీనిపై సీఎంగారు తక్షణమే స్పందించారు. అన్ని సహాయ చర్యలు చేపట్టారు. 

రైతుకు మేలు జరిగితే వారికి కడుపు మంట: 
    రైతులు, రైతు సంక్షేమం అంటే కేవలం వ్యవసాయం ఒక్కటే కాదు.  అన్ని రంగాలతో వారిని ముడిపెట్టి పేద, మధ్య తరగతి రైతు కుటుంబాల జీవనశైలిలో మార్పులను చూడాలనేదే సీఎంగారి తపనగా అర్ధం చేసుకోవాలి. తరతరాలుగా రైతులు సాగుచేసుకుంటున్న భూములపై ఎలాంటి వివాదాలు, సమస్యలు ఉండకుండా వారికి పూర్తి భూయాజమాన్య హక్కులు కల్పిస్తూ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ రైతుల పక్షపాతిగా నిలుస్తుంటే.. చంద్రబాబుకు, ఆయన తాబేదారు పవన్‌కు మింగుడు పడడం లేదు. 

ప్రతి గింజా కొంటాం:
    మాది రైతు పక్షపాత ప్రభుత్వం. తమకు అండనిచ్చే నాయకుడు సీఎంగా ఉన్నారని రైతులంతా ఆనందపడుతున్నారు. తడచిన ధాన్యం, రంగుమారిన ధాన్యం అయినా సరే.. ప్రతి గింజా కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే 60 లక్షల టన్నుల మొక్కజొన్న సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి చోటా రైతులకు పూర్తి అండగా ఉంటాం. 

25లోగా సోషల్‌ ఆడిట్‌:
    ఈనెల 25లోగా పంటనష్ట అంచనాలపై సోషల్‌ ఆడిట్‌ పూర్తి చేస్తాం. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే ఇన్‌ఫుట్‌ సబ్సిడీ అందజేసే కార్యక్రమాన్ని మా ప్రభుత్వం ఆనవాయితీగా పెట్టుకుంది. ఆమేరకు పంటనష్ట అంచనాలపై ఈనెల 25వ తేదీలోగా సోషల్‌ఆడిట్‌ను పూర్తి చేస్తున్నాం. అంచనాల తుది జాబితాను సీఎంగారికి నివేదిస్తాం. ఖరీఫ్‌ ప్రారంభంలో రైతుభరోసా సాయం కింద రైతులకు అందజేసే మొత్తాలతో పాటు ఇన్‌ఫుట్‌ సబ్సిడీని, పంటనష్టపరిహారాన్ని కూడా ఆయన చేతుల మీదుగా అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. 
 
కావలి వేదికగా సీఎం గారి విశిష్ట కార్యక్రమంః
    రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న చుక్కల భూముల సమస్యను సీఎంగారు రేపు (శుక్రవారం) కావలి వేదికగా పరిష్కరిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో దాదాపు 23,023 మంది రైతులకు చెందిన 43,270 ఎకరాల చుక్కల భూముల సర్వేనెంబర్లను ప్రభుత్వ నిషేధిత జాబితా(22ఏ) నుంచి తొలగించి, ఆయా భూముల క్రయవిక్రయాలపై స్వేచ్ఛాస్వాతంత్య్రాలను రైతులకు కట్టబెడుతూ వారికి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయనున్నారు. రైతులకు వారి  భూములపై సంపూర్ణ యాజమాన్య హక్కులు కల్పించే విశిష్ట కార్యక్రమంగా కావలి వేదికపై రేపు సభ జరగనుంది. 

రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్‌ మీడియాతో  ఏమన్నారంటే..:

అవగాహన లేని ‘పవన్‌’ది పనికిమాలిన పర్యటన:
    ఈరోజు రైతుల గురించి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడే మాటలకు, ఆయన హావభావాలకు ఏమాత్రం పొంతన లేదు. ఆయనకు ఉభయగోదావరి జిల్లాల్లో ఏ అర్హతతో పర్యటించారనేది ప్రజలకు సమాధానం ఇవ్వాలి. రైతు పక్షపాతిగా ఉన్న ప్రభుత్వం రైతులకు ఏవిధంగా మేలు చేస్తుందనే విషయంపై పవన్‌కళ్యాణ్‌ మాట్లాడి అభినందిస్తే చాలా బాగుండేది. కానీ, ఆయన రైతులు, వ్యవసాయ రంగంపై ఏమాత్రం అవగాహన లేకుండా మాట్లాడాడు. 
    ‘అకాలవర్షం వలన వైఎస్‌ఆర్‌సీపీని నిందించడం లేదు’ అని పవన్‌కళ్యాణ్‌ అంటున్నాడంటే, అందులో అర్ధమేంటి..? నీకున్న అవగాహన మేరకు రాజకీయ పార్టీల వలన అకాల వర్షాలు కురుస్తాయనా? కనీసం, రైతులు, ధాన్యం కొనుగోళ్లు, పంటనష్టంపై ఏమైనా గణాంకాలు చెప్పినా.. కాస్తాకూస్తో పవన్‌కు అవగాహన ఉందని ప్రజలు అర్ధం చేసుకునేవాళ్లు. అయితే, అతను అనవసరంగా పనికిమాలిన పర్యటనతో అభాసుపాలయ్యాడు. రైతుల కోసం ఎంతదూరమైనా వెళ్తానన్న వవన్‌కళ్యాణ్‌ ఈరోజు రోడ్‌షోలుకే పరిమితమై వెళ్లాడు. 

పవన్‌కు దేశభక్తి ఉందా? లేదా?:
    పార్టీగా ప్రజలకు మేలు చేయాలని.. విలువలతో కూడిన రాజకీయం నడపాలని వచ్చినప్పుడు ఏ నాయకుడైనా ముందు చరిత్ర తెలుసుకోవాలి. దేశంలోని అన్ని విషయాల్ని అధ్యయనం చేయాలి. అయితే, పవన్‌కళ్యాణ్‌కు మాత్రం ఇవేమీ పట్టవు. జాతికోసం పోరాడిన ఉద్యమవీరుడు భగత్‌సింగ్‌ పేరును సినిమా టైటిల్‌ లో తన కాలి బూట్ల కింద పెట్టుకున్న వవన్‌కళ్యాణ్‌కు ఈ దేశం పట్ల బాధ్యత, దేశభక్తి ఉందా..? లేదా..? అని ప్రశ్నిస్తున్నాను. 

రెచ్చగొట్టే రాజకీయాల్ని మానుకోవాలిః
    ప్రజల్లో దాదాపు ఉనికి కోల్పోయిన చంద్రబాబు ఇంకా తన అవుట్‌ డేటెడ్‌ రాజకీయాలతోనే ముందుకు సాగాలనుకుంటున్నాడు. పాతకాలం నాటి రాజకీయాల్ని నేటి యువత పూర్తిగా వదిలేసింది. ఇప్పుడు ప్రజలకు నిజంగా ఎవరు మేలు చేస్తారో.. ఆ పార్టీకి, ఆ పార్టీ అధినేతకు, ప్రభుత్వానికి మద్ధ్ధతిస్తున్నారు. ఈ సందర్భంగా బాబును నేను ప్రశ్నిస్తున్నాను. గతంలో బాబు హయాంలో ఈరాష్ట్రంలో 300 కరువు మండలాల్ని ప్రకటిస్తే.. ఏ ఒక్క మండలంలోనైనా బాబు పర్యటించాడా..? పోనీ, ఆరోజు ప్రశ్నిస్తానన్న వ్యక్తిగా ఉన్న పవన్‌కళ్యాణైనా పర్యటించాడా..? దీనికి బాబు, వవన్‌లు సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టొద్దని పవన్‌కళ్యాణ్‌ మాట్లాడే మాటలకు ఏమైనా అర్ధముందా..? రైతుపక్షపాత ప్రభుత్వంలో రైతులపై కేసులు పెట్టాల్సిన ఖర్మ ప్రభుత్వానికి ఎందుకుంటుంది..? బాబు డ్రామాలకు హైప్‌ చేసి.. దాన్ని రాజమండ్రి మహానాడు దాకా తీసుకొద్దామనే పవన్‌ ప్రయత్నాల్ని.. రెచ్చగొట్టే మాటల్ని రైతులు అర్ధం చేసుకున్నారు. బాబు, పవన్‌ మాటల్ని ఎవరూ నమ్మబోరంటూ మరోమారు స్పష్టం చేస్తున్నాను. 

రైతుల మేలుకు జగనన్న అండగా ఉన్నారుః
ఈరోజు రైతుమేలు ప్రభుత్వంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా సమర్ధంగా పని చేస్తున్నాం. వ్యవసాయానికి సంబం«ధించి అన్ని అంశాల్లోనూ రైతులు ఆనందంగా ఉన్నారు. ఇంతముందెన్నడూ ఎరుగనిరీతిలో రైతుల దగ్గరనుంచి మొలకెత్తిన  ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. ఒక్క కోనసీమ జిల్లాలోనే 1800 టన్నుల మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. అదేవిధంగా రంగుమారిన, తడిచిన, కోతకోసిన, పొలంలోనే ఉన్న ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.

Back to Top