నాడు కరువు .. నేడు  కళకళ  

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

చంద్రబాబు చేసిన మోసాలు ఎల్లో మీడియా ఎందుకు ప్రస్తావించడం లేదు

 ప్రజల్లో విషం చిమ్మేలా వార్తలు రాస్తున్నారు

నెల్లూరు:  టీడీపీ పాల‌న‌లో రాష్ట్ర‌మంతా క‌రువు కాట‌కాల‌తో అల్ల‌డిపోయింద‌ని, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక జ‌లాశ‌యాలు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు.   రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చంద్రబాబు, ఎల్లోమీడియా కథనాలపై మండిపడ్డారు. వ్యవసాయం గురించి పచ్చ మీడియా రాసిన‌ తప్పుడు రాతల‌ను ఆయ‌న తీవ్రంగా ఖండించారు. అవగాహన లేకుండా తెలుగు దేశం పార్టీకి ప్రయోజనం కలిగించేందుకు ఈనాడు క‌థ‌నాలు ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 మీ మెదడులోనే మడతలు...
ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక అభూతకల్పనతో ఆరోపణలు చేయడం పచ్చపత్రికలకు అలవాటైపోయింది . పోనీ విషయపరిజ్ఞానం ఉండి రాశారా.. అంటే అదీ లేదు. కేవలం టీడీపీకి వంత పాడాలని రాస్తున్నారు ... కనుక వివరణ ఇస్తున్నాం. టీడీపీ హయాంలో వ్యవసాయం ఎంత అధ్వానంగా ఉందో, వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ గారు  ఎంతగా తపిస్తున్నారో తేడా గమనించిన తర్వాత కూడా యథావిధిగా ఈ రోజు ఈనాడులో రామోజీ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం చేశారు.  ‘ రైతు భరోసాలో ఎన్ని మడతలో ...’ అంటూ రామోజీ రాసిన కథనంలో అన్నీ అసత్యాలను వెల్లడించారు. చెత్తాచెదారం... చాట భారతం అంతా రాశారు. ఈనాడులో రాసిన కథనంలో మేం రైతు భరోసా ఇవ్వలేదని ఎక్కడా చెప్పే సాహసం మాత్రం చేయలేకపోయారు రామోజీ.
- ఈనాడుకు చెబుతున్నా...మీ మెదడులోనే మడతలున్నాయి. ప్రజా సంక్షేమంలో మాకు మడతలు లేవు. రామోజీరావు మడతల మెదడుతో చెత్త రాతలు రాస్తున్నారు . చర్మంతో పాటు మెదడుకూడా మడతలు వచ్చే ఇలాంటి రాతలు రాస్తున్నారు. రైతుల సంక్షేమానికి మేం ఏది చేసినా పారదర్శకంగా చేస్తున్నాం.

చేతనైతే.. రెండు ప్రభుత్వాలకు తేడాను విశ్లేషించండి...
- టీడీపీ పాలనలో రైతుల సంక్షేమం ఎలా ఉంది?.  మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనలో ఎలా ఉందో... చేతనైతే రామోజీ విశ్లేషించాలి. బాబు పాలనలో వ్యవసాయం ఎలా సాగింది? ఇప్పుడెలా ఉందో చూస్తే... బాబు హయాంలో వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో కరవు విలయతాండవం ఆడిన మాట నిజమా? కాదా? అన్నది రామోజీ చెప్పాలి. 
- టీడీపీ పాలనలో ఏ ఏడాదైనా సరే రైతులకు సజావుగా సాఫీగా సాగునీరందిందా? అందించగలిగారా?
- 2014–19 మధ్య కరవు విలయతాండవం చేయడంవల్ల వందల సంఖ్యలో కరవు మండలాలు ప్రకటించింది వాస్తవమా ? కాదా...చంద్ర బాబు తన అయిదేళ్ల పాలనలో సగటున 70 శాతం కరవు మండలాలు ప్రకటించేవాడు . 
- ఈ రోజు జగన్‌ గారి నాయకత్వంలో  ఈ మూడున్నరేళ్లలో ఒక్క ఏడాది కూడా, ఒక్క కరవు మండలం కూడా లేని చరిత్ర మా ప్రభుత్వానిది.  బాబు హయాంలో మాదిరిగా రైతులు కరవు మండలాన్ని కోరుకుంటారా? లేక జగన్‌మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిరిగా కరవు మండలాలు ఉండకూడదనుకుంటారా?...ఇదే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం...
– పశువులను మేపలేక వాటిని కబేళాలకు తరలించాల్సిన దుస్థితి బాబు హయాంలో ఉండేది.   నేడు జగన్‌ గారి హయాంలో ఆ దుస్థితి లేదు. పశుగ్రాసం పుష్కలంగా అందుతోంది.  పాడి పశువులు బాగున్నాయి. పంటలకు సమగ్రంగా సాగునీరందుతోంది. డెల్టా ప్రాంతానికి ఇవ్వాల్సిన నీటిని ముందుగా ఇచ్చాం. ఈ ముందస్తు చర్యల వల్ల తుఫానులు వచ్చినా, అంతకన్నా ముందే నూర్పిళ్లు పూర్తి చేసుకోగలిగాం. ధాన్యాన్ని రైతులు సకాలంలో అమ్ముకోగలిగారు. జలాశయాల నుంచి నీటిని విడుదల చేసి, రైతులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం జగన్ గారిదైతే, జలాశయాలు ఎండిపోయి, పశుగ్రాసాన్ని సైతం అందించలేని దుస్థితిలో బాబు ప్రభుత్వం వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చింది. 
- మీ హయాంలోరైతు రథం పేరిట ట్రాక్టర్‌కు రూ. లక్ష వంతున దోచారు. మా ప్రభుత్వంలో   రైతులకు సకాలంలో నీరిస్తున్నాం. అదీ ముందస్తుగా ఇస్తున్నాం. అన్ని విధాలా రైతులకు చేయూత నిస్తున్నాం. 

రైతులకు అన్ని విధాలా అండగా రైతుభరోసా...
- చంద్రబాబు రూ. 87 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక, కోటయ్య కమిటీ పేరిట కోతలు పెట్టాడు.
- మా ప్రభుత్వ హయాంలో దీనికి భిన్నంగా రైతుభరోసాను జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏడాదికి రూ. 12,500 వంతున నాలుగు విడతలుగా రూ.50,000 ఇస్తామని హామీ ఇచ్చి, దాన్ని 13,500 కు పెంచాం. అయిదు విడతలకు పొడిగించాం. కోటయ్య కమిటీలా కోతలు  లేకుండా ఇస్తున్నాం. 
- ఈ రోజు రైతులకు చెప్పినదానికి మించి జగన్‌ గారి ప్రభుత్వం ఇస్తుంటే కేంద్రం ఇంత ఇచ్చింది..రాష్ట్రం ఇంత ఇచ్చింది...అని విడదీసి రాయడం అర్థవంతమేనా? 
సీసీఆర్‌ కార్డు ఉన్న కౌలు రైతులకు  ఆంధ్ర రాష్ట్రం ఇచ్చినంత పారదర్శకంగా ఏ రాష్ట్రంలోనైనా ఇస్తున్నారా? అని నేను ప్రశ్నిస్తున్నాను. 
- ఆర్వోఎఫ్‌ఆర్‌తో పాటు అటవీభూములపై హక్కులున్న వారికి ఎలాగైతే రూ.13,500 ఇచ్చామో...అలాగే కౌలు రైతులకు కూడా ఇచ్చాం. 
- కౌలు రైతులకు 11 నెలల కౌలు అనే విధానం తీసుకొచ్చింది మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. సీసీఆర్‌ కార్డున్న వారికి ఎంత భరోసా ఇవ్వగలిగితే, ఎంత ఇచ్చే అవకాశముంటే అంత ఇవ్వాలని 
 చెప్పింది కూడా మా ప్రభుత్వం . కౌలు రైతులను ఊరించి ఉసూరు మనిపించారని రాయడం సబబు కాదు. ప్రభుత్వంపై విషం చిమ్మే విధంగా రాతలు రాయడం సరైంది కాదు. కౌలు రైతులకు ఈ అంశంపై రైతుభరోసా కేంద్రాల ద్వారా విలేజ్‌ అగ్రికల్చరల్‌ అసిస్టెంట్స్‌ అవగాహన కలిగిస్తున్నారు. 

బడ్జెట్‌ అంటే ఈనాడుకు తెలుసా?
- ఈనాడు పత్రిక యాజమాన్యానికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లంటే అంటే ఏంటో తెలుసా? తన లక్ష్యం టీడీపీని ఎత్తడం, వైఎస్సార్‌సీపీపై బురద జల్లడం అలవాటుగా మారిపోయింది. బడ్జెట్‌ అంటే రాష్ట్రం నుంచి కొన్ని నిధులు కేంద్రానికి వెళ్తాయి. కేంద్రం రాష్ట్రానికి గ్రాంటు రూపంలో  వివిధ కార్యక్రమాలకు నిధులిస్తుంది. వాటన్నింటినీ కలిపి రాష్ట్ర బడ్జెట్‌ అంటాం. కనీసం ఆ అవగాహన లేకుండా కేంద్రం ఇచ్చిన గ్రాంటును రాష్ట్రం తన ఖాతాలో వేసుకుందంటూ అర్థం పర్థంలేని రాతలు రాస్తారు. కోత పెడుతున్నామంటూ రాస్తారు. అసలు కేంద్రం- రాష్ట్రానికి ఎంత ఇస్తుంది? రాష్ట్రం ఎంత వెచ్చిస్తోంది...ఇవేవీ తెలియకుండా అవగాహనా లోపంతో కథనాలు రాస్తారు. 

బాబు వంద జన్మలెత్తినా రైతుభరోసా తెచ్చేవాడా..?
- బాబు ఏం చేయకపోయినా పల్లెత్తు మాట మాట్లాడరు. బాబు ఇస్తానని చెప్పి మాటతప్పినా ఒక్క మాట మాట్లాడదు ఈనాడు. ఒక్క రాత రాయదు. ఇస్తానన్న దానికన్నా ఎక్కువగా ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ గారి ప్రభుత్వం మీద  విమర్శలు చేస్తారు. 
- బాబు వంద జన్మలెత్తినా రైతుభరోసా అనే పథకాన్ని  తెచ్చేవాడా? అని అడుగుతున్నాను. అసలు ఈ ఆలోచన బాబు చేశాడా? 
- మేం రైతు భరోసా కేంద్రాలు తెచ్చాం. ఎరువులు రైతుల ముంగిటికి తెచ్చాం.   విత్తనాలు, ఎరువులు, వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం రోజుల తరబడి తిరగాల్సిన పనిలేకుండా వాలంటీర్లు సాయంత్రానికల్లా ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ అందిస్తున్నాం.

విశేషంగా ధాన్యం దిగుబడులు
-  ఈ మూడున్నరేళ్ల మా ప్రభుత్వ పాలనలో ...ఏడాదికి సగటున 13 లక్షల నుంచి 14 లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వస్తున్నాయి.  దీన్నిబట్టి జగన్‌ గారి పాలనలో  వ్యవసాయం మంచిగా జరుగుతున్నదనేగా అర్థం.  టీడీపీ హయాంలో ఎన్ని లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయో, ఎంత సేకరించారో, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మేం ఎంత సేకరిస్తున్నామో విశ్లేషిస్తే...దిమ్మదిరిగే నిజాలు వెలుగుచూస్తాయి. ఇవాళ ఎంత నష్టమైనా ప్రభుత్వమే భరిస్తోంది.
- మరోవైపు క్రాప్‌ హాలిడేలు అంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. క్రాప్‌ హాలిడే  ప్రకటిస్తే.. ఇంత పెద్ద ఎత్తున దిగుబడి ఎలా సాధ్యం?  తప్పుడు లెక్కలు చూపిస్తూ...బట్ట కాల్చి మొహం మీద వేస్తున్నారు.
- కరవు మండలాలు ఈ రోజు అసలు లేవు. టీడీపీ హయాంలో ఏకంగా  872 కరవు మండలాలను ప్రకటించారు. దీనికి ఏం సమాధానం చెబుతారు? 
-  పీఎం ఫసల్‌ బీమా యోజన పథకంలో... 37.5 శాతం కేంద్రం...37.5 శాతం రాష్ట్రం... 25 శాతం రైతుల వాటాగా ఉంటే..ఇందులో రైతుల వాటాను కూడా రాష్ట్రమే భరిస్తోంది. ఒక్క రూపాయి కూడా రైతుపై భారం మోపడం లేదు. 
- మొట్టమొదటగా రైతులకు పైసా భారం లేకుండా వంద శాతం బీమా, ప్రీమియం భరిస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. బీమాకు ఒకే విడతలో రూ.2978 కోట్లను మా ప్రభుత్వం విడుదల చేసింది. జగన్‌ గారి ప్రభుత్వం రైతులకు పెట్టే ఖర్చు భారం అనుకోవడం లేదు. రైతులకు ఎంత ఖర్చయినా సరే.. అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. 
- చిరుధాన్యాలు కాని, పప్పుదినుసుల ఉత్పత్తులను ఎంత ఖర్చయినా, ఎంత నష్టమైనా సరే రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తోంది.

కందిపప్పు, పెసరపప్పు అయినా గుర్తుపట్టగలవా లోకేష్...!
- సార్థకనామధేయుడివైన  పప్పూ...  పది పంటలు చూపిస్తా...అయిదు పంటల పేర్లు చెప్పు చూద్దాం. కనీసం కందిపప్పు..పెసరపప్పులను గుర్తుపట్టగలవా?  
- మీలాంటి పప్పులకు ఈనాడు మద్దతొకటి... మీరు రాయించే మాటలు సిగ్గుచేటు... రాస్తే అర్థముండాలి. ప్రజలు ఛీకొట్టేలా రాతలు రాస్తే అసహ్యంగా ఉంటుంది. 
- ప్రాజెక్టులకు వెచ్చిస్తే దండగన్న బాబులా మేం వ్యవహరించడం లేదు. రైతుల పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది.  రైతులకు ఏ చిన్న అవసరమొచ్చిన వెంటనే మా సీఎం జగన్‌ గారు, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తోంది. 
- పత్రికల్లో రాయడానికి వార్తలు లేక టీడీపీ నాయకులు పదిమంది  ధర్నా చేస్తే...దాన్నే హైలైట్‌ చేసే విధానాన్ని ఈనాడు అనుసరిస్తోంది. ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే జనం నోట్లో ఊస్తారని సిగ్గు బిడియం ఉండాలి.. అని మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌ రెడ్డి మండిపడ్డారు. 

Back to Top