విశాఖపట్నం: విశాఖపట్నంపై చంద్రబాబు, ఎల్లో మీడియా విషం చిమ్ముతోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అన్ని అనుమతులతో రుషికొండ రిసార్ట్స్‌ను ప్రభుత్వం నిర్మిస్తోందన్నారు. ఎక్కడ నిబంధనలను ప్రభుత్వం ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. పర్యాటకులకు మరిన్ని ఆధునిక వసతులు కల్పించడానికి 7 స్టార్ హోటల్ తరహాలో నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. రుషికొండపై విశాఖకు చెందని వారితో చంద్రబాబు తప్పుడు కేసులు వేయిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. ‘‘రుషికొండ నిర్మాణాలపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన చంద్రబాబు నాయుడుకి బుద్ధి రాలేదు. ఇప్పటికీ విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారు. అమరావతి కోసం విశాఖను చంద్రబాబు నాశనం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో బినామీ భూములకు రేట్లు పడిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారని మంత్రి అమర్‌నాథ్ దుయ్యబట్టారు.