నెల్లూరు: ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్న అసైన్డ్ భూమికి ఆ సాగుదారుడ్నే యజమానిని చేసే కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నాలుగేళ్ల పాలనలో రెవెన్యూ వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో శ్రీధర్ గార్డెన్స్‌లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా చుక్కల భూములకు సంబంధించి హక్కులు కల్పిస్తూ సంబంధిత లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ప్రభుత్వ ప్రతినిధిగా రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వలన ఇవాళ గౌరవం పెరిగిందని, ఇదంతా సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం విశాల భావజాలం వలనే సాధ్యమైందన్నారు. స్వతంత్రం వచ్చిన నాటికి జమిందార్లు, ఎస్టేట్ దార్లు వద్దనే పెద్ద ఎత్తున భూమి ఉండేది. మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకు వచ్చాయి. అయినా కూడా చాలా భూమి ఇబ్బందుల్లో ఉండిపోయింది. మన సీఎం విశాల దృక్పథంతో ఆలోచన చేస్తూ,పూర్తి హక్కులతో రైతుల వద్దకు భూమిని చేర్చాలి అని సంకల్పించారు. వారిని ఆస్తి పరులను చేయాలన్న ఆలోచనలలో భాగంగా సంబంధిత ప్రతిపాదనలలో భాగంగా చేస్తోన్న ప్రయత్నం ఇది. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం ఇది. బలమైన నాయకుడు, స్థిరమైన అభిప్రాయం కలిగిన నాయకుడు సీఎం వైయస్ జగన్ వల్లనే ఈ రోజు సాధ్యం అయ్యింది. భూమి ఉండి కూడా ధైర్యం ఉండేది కాదు. చుక్కల భూములు,ప్రభుత్వం అందిస్తున్న పథకాలు కూడా అందేవి కావు. సుమారు 20 వేల ఎకరాలు ఆత్మకూరులో..చుక్కల భూములకు సంబంధించి రైతులకు హక్కులు కలిపిస్తున్నాం. మరో 6 వేల ఎకరాలు కూడా ఇవ్వాల్సి ఉంది. అవి కూడా త్వరలో పూర్తి చేస్తాం. గత ప్రభుత్వంలో ఏ చిన్న పథకం అందాలి అన్నా..జన్మభూమి కమిటీ సభ్యులు లంచాలు అడిగే వారు. వాటా అడిగే వారు. ఇంటి మేడ మీద పసుపు జెండా కట్టాలి అని అనేవారు. కానీ ఇవాళ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బద్ద శత్రువు అయిన కూడా పథకాలు అందిస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాం. కుల,మతాలకు అతీతంగా పథకాలను వర్తింప జేస్తున్నాం. అర్హతే ప్రామాణికంగా ఇన్ని మంచి పనులు చేస్తున్నాం. ప్రావిజన్ ఆఫ్ ట్రాన్సఫర్స్ యాక్ట్ ప్రకారం..చట్టం తెలియక విక్రయించినా,కొనుగోలు చేసినా తిరిగి ఆ భూమిపై హక్కులన్నవి హక్కుదారులకే దక్కాలి అన్న ఉద్దేశంతో ఇవాళ ఇరవై ఏళ్ల సాగులో ఉన్నవారికి హక్కులు దఖలు పరుస్తూ వారి పరిధిలో ఉన్న అసైన్డ్ ల్యాండ్ ను అమ్ముకునే వీలు కల్పించాం. ఆనాడు (1977లో) పీఓటీ యాక్ట్ ను తీసుకు వచ్చాం. కానీ కొన్ని నిబంధనలు సడలించి లబ్ధిదారులకు భూమిపై హక్కు కల్పించేందుకు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నాం. ఈ యాక్ట్ ఇప్పుడు కూడా అమలులో ఉంది. ఇవాళ వ్యసాయం కంటే మెరుగైన రంగాలు వచ్చాయి. విభిన్న రంగాలలో రాణించేందుకు వీలుగా కొందరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వారికి ఊతం ఇచ్చే విధంగా భూములు అమ్ముకునే వీలు కల్పిస్తున్నాం. 20 ఏళ్లు నిండి ఉంటే చాలు ఆ భూమి మీద పూర్తి హక్కుతో అమ్ముకోవచ్చు." ఆ రోజు నా అధ్యక్షతన వేసిన కమిటీలో 10 మంది సభ్యులతో తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలు తిరిగి అక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని ఇక్కడ అసైన్డ్ ల్యాండ్స్ విషయమై ఇరవై ఏళ్ల పాటు సాగులో ఉన్నవారికి పరిపూర్ణ హక్కులు ఉంటాయని, వారు ఆ భూమిని అమ్ముకోవచ్చు అని నిర్ణయించి,క్యాబినేట్ ఆమోదం పొందేందుకు కృషి చేశాం. అలానే ఇవాళ పాలన పర సంస్కరణల అమలుతో పాటు సమాజంలో సామాన్య పౌరుల స్థితి కూడా మర్చాం. ఇవాళ సంబంధిత వర్గాల సామాజిక హోదా కూడా పెరిగింది. సమాజంలో ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేకుండా ఉండిపోయిన సామాన్య కుటుంబాలు చాలా ఉన్నాయి. పగలంతా కష్టపడి ఇంటికి చేరుకున్నాక రాత్రి సొంత ఇంటిలో పడుకుంటే నా జీవితానికి చాలు అని అనుకునే కుటుంబాలు చాలా ఉన్నాయి. అందుకే రూ.12 వేల కోట్లు వెచ్చించి 31 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చాం. విపక్ష నేత చంద్రబాబు రూ.100 కోట్లు వెచ్చించి ఎక్కడైనా,ఏనాడయినా పేదల కోసం భూమి కొన్నారా ? అని ప్రశ్నిస్తున్నాను. అసలు ఏనాడయినా ఆ తరహా ఆలోచన చేశారా ? అని అడుగుతున్నాను. పేదల ఇళ్ల నిర్మాణం నిమిత్తం సెంటు భూమి ఇస్తున్నాం. ఇదే అదునుగా విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. సెంటు భూమి,సెంటు భూమి అని హేళన చేస్తున్న చంద్రబాబు..14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు పేదల కోసం ఏం చేశారు. వారి సొంతింటి కల నెర వేర్పు కోసం ఏం చేశారు ? తనలో నిజాయితీ లేదు. ఇనాం భూముల యజమానులకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తున్నాం. ఎలిజిబుల్ రైట్స్ ఇస్తున్నాం. ఆత్మకూరులో కూడా 2700 ఏకరాల భూమి కి ఎలిజిబుల్ రైట్స్ ఇస్తున్నాం. వివాద రహిత భూమి కారణంగా జీడీపీ రెండు శాతం పెరుగుతుంది. ఎక్కువ భూమి వినియోగంలోకి వస్తుంది. వివాదాల నివారణకు చర్యలు చేప డుతూ,ఇందులో భాగంగానే భూ సర్వే చేపట్టాం.100 ఏళ్ల ముందు బ్రిటిష్ వారు చేశారు. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో నడుస్తున్న ప్రభుత్వం ఆధునిక యంత్ర పరికరాలతో పూర్తి స్థాయిలో నిష్పాక్షిక ధోరణిలో సర్వే చేస్తున్నాం. ఈ సర్వే దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శం. ఆంధ్ర ప్రదేశ్ చేపట్టిన సర్వే పూర్తి ఉచితం. హద్దు రాళ్ళు వేసి,డాక్యుమెంట్లు ఇస్తున్నాం. సర్వేలో ఏమైనా ఇబ్బందులు ఉంటే,సంబంధిత అధికారులను అందుబాటులో ఉంచుతున్నాం. రూ.1500 కోట్లు వెచ్చించి, సమగ్ర భూ సర్వే చేస్తున్నాం. భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం. రిజిస్ట్రేషన్ చట్టంలో కూడా మార్పు తీసుకువచ్చాం. దీంతో రిజిస్ట్రేషన్ అయిన వెటనే మ్యుటేషన్ అయ్యేలా సాఫ్ట్‌వేర్ ను రూపొందిస్తున్నాం. ప్రతి సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నాం. చంద్రబాబు ప్రజల జీవితాలకు దూరంగా ఉన్నారు. అందుకే తెలియక అవాకులు చెవాకులు పేలుతున్నారు. చంద్రబాబు ఇప్పు డు ఇస్తాను అంటున్నవి గతంలో అధికారంలో ఉన్నపుడు ఎందుకు ఇవ్వలేకపోయారు. ప్రజలను తన స్వార్థం కోసం వాడుకు న్నారే తప్ప ! ఆయన ప్రత్యేకించి వారి కోసం కేటాయించిన నిధులు కానీ, వారి కోసం తీసుకువచ్చిన పరిపాలనా పరమయిన సంస్కరణలు కానీ ఏమీ లేవు. వీటన్నింటినీ ప్రజలు గుర్తించాలి. మేలు చేస్తే ప్రభుత్వానికే మద్దతు ఇవ్వాలని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ తదితరుల పాల్గొన్నారు.