ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి భూములపై అన్ని హక్కులు కల్పించారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని అవనిగడ్డలో 22 ఏ (1) కింద ఉన్న నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేసిన భూముల క్లియరెన్స్ పత్రాలను రైతులకు పంపిణీ చేసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
అందరికీ నమస్కారం, నిజానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం శ్రీ జగన్ గారికి వారి కుటుంబానికి కొత్తేమీ కాదు. గడిచిన కాలంలో మన సీఎంగారి తండ్రి సుమారు 7 లక్షల ఎకరాల భూమిని 2004 నుండి 2009 వరకు పంపిణీ చేశారు. మళ్ళీ ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చూస్తున్నాం. ఈ 35 వేల ఎకరాలు గడిచిన ప్రభుత్వం ప్రభుత్వ భూమి అని పెట్టింది. 2016లో ఉన్న టీడీపీ ప్రభుత్వం చేసిన పని, కానీ ఇది ప్రభుత్వ భూమి కాదు, సుమారుగా 90 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగానిదే ఈ భూమి అని ఈ సీఎంగారు ఆర్డర్స్ ఇచ్చారు. ఇద్దరికీ తేడా చూడండి. ఒకరేమో మీ భూమి లాక్కుంటే ఇంకొకరు తన వద్ద ఉన్న భూమి మీకు అప్పగిస్తున్నారు, దీనిని బట్టి ఎవరు రైతాంగం వెంట ఉన్నారో అర్ధం చేసుకోండి. ఈ పని చేయాలంటే పెద్ద హృదయం ఉండాలి, ఈ భూమి విషయం మీ ఎమ్మెల్యే సీఎంగారి దృష్టికి తీసుకెళితే సీఎంగారు టేబుల్ మీదే డెసిషన్ తీసుకున్నారు. రైతాంగానికి సర్వ హక్కులు ఇచ్చేద్దామన్నారు. ఇది శ్రీ జగన్ గారి ఫిలాసఫి. ఇది ఒక్క ఈ ప్రాంతానికి సంబంధించిందే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు తరతరాలుగా సాగుచేసుకున్న రైతులకు వెళ్ళాలనే ఫిలాసఫి సీఎంగారిది. భూమి అనేది ఒక సెంటిమెంట్, హక్కులు లేకపోతే మానసికంగా కృంగిపోతారు, అమ్ముకునే హక్కు లేదంటే కుంగిపోతారు. భూమి సమాజంలో హోదానిస్తుంది, అలాంటి హోదా సీఎంగారి వల్ల ఈ రైతులకు వచ్చింది. రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొస్తున్నాం, ఎప్పుడైనా ఒక పేదవాడు హక్కులు కలిగిన భూమిపై తాను సులువుగా రుజువు చేసుకోలేకపోతే ధనవంతులకు దఖలు పడే ప్రమాదం ఉంది. సమగ్ర సర్వే జరగబోతుంది, వందేళ్ళ తర్వాత చేస్తున్నాం, గతంలో ఎవరూ చేయలేదు, బీదలకు వారి హక్కులు కల్పించాలనే ప్రభుత్వం ఇది, సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తులు తీసుకున్న నిర్ణయం ఇది. ఈ ప్రభుత్వం ఆ పని చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాం, అవినీతిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీ ఒక మాట అన్నారు, వంద రూపాయిలు ఢిల్లీలో విడుదల చేస్తే చివరికి పేదవాడికి రూ. పది మాత్రమే అందుతున్నాయని బాధపడ్డారు. ఈ మూడేళ్ళలో ఈ ప్రభుత్వం నయా పైసా లంచం చెల్లించకుండా వేల కోట్లు పంపిణీ జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ జరుగుతుంది. బీదలు ఆత్మాభిమానం చంపుకుని ఇతరులపై ఆధారపడి సంక్షేమ కార్యక్రమాలు అందుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి ఉందా, ఇది కాదా మార్పు. ప్రజలు చైతన్యవంతులుగా ఉండాలి, దొంగలు అనేక పద్దతుల్లో వస్తారు, మన మనసు చెడగొట్టే పని చేస్తారు, ప్రజలు ఆలోచించాలి, మన కోసం ఎవరున్నారు అని ఆలోచించిన రోజే ఇలాంటి మంచి ప్రభుత్వాలు వస్తాయి, రాబోయే కాలంలో మీరంతా శభాష్ అనే విధంగా రెవెన్యూ వ్యవస్ధలో మార్పులు తీసుకొస్తాం. ధన్యవాదాలు.
కొండవీటి వీర వెంకట నారాయణరావు, రైతు, విశ్వనాధపల్లి, కోడూరు మండలం
అందరికీ నమస్కారం, మా ప్రాంత రైతులకు ఇది పండుగ కార్యక్రమం, నేను 30 ఏళ్ళుగా వ్యవసాయం చేస్తున్నాను, నేను ఇల్లు కట్టుకోవడానికి 2009లో లోన్ తీసుకుని కట్టాను, నా కుమార్తె వివాహం సందర్భంగా 2017లో బ్యాంకులో లోన్ కోసం వెళితే నీ భూమి నిషేదిత జాబితాలో ఉంది, లోన్ రాదన్నారు, ఇది ప్రభుత్వ భూమి అనడంతో కంగుతిన్నాం, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ సహాయం చేయలేదు. మీరు రాగానే మా సమస్యను మీ దృష్టికి తీసుకురావడంతో మీరు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు, మేం అనిశ్చిత స్ధితినుండి మేం భూమి యజమానులం, అందరు రైతుల్లాగానే మాకు అన్ని హక్కులు కల్పించారు, మా కుటుంబంలో మూడెకరాల భూమి నిషేదిత జాబితాలో ఉన్నది ఇప్పుడు తొలగిస్తున్నారు, మా రైతులందరి దీవెనలు మీకుంటాయి, మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము, ధ్యాంక్యూ.
రేపల్లె రాజయ్య, రైతు, వి. కొత్తపాలెం, కోడూరు మండలం
మా ముత్తాతల నుండి వారసత్వంగా వచ్చిన భూమిని నా మనవళ్ళకు రిజిస్టర్ చేద్దామని రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే ఇది నీ భూమి కాదన్నారు, అధికారుల చుట్టూ తిరిగాం, నిరాహారదీక్షలు చేశాం, కానీ నాటి ప్రభుత్వం స్పందించలేదు. కానీ మన సీఎంగారు వచ్చిన తర్వాత నా ఐదెకరాల భూమి నాకు హక్కులు వచ్చేలా చేస్తున్నారు, ధన్యవాదాలు. అనేక పథకాలు నేను అందుకుంటున్నాను. మా మనవళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, వారికి అన్నీ అందుతున్నాయి, డ్వాక్రా ద్వారా వచ్చిన డబ్బుతో గేదెలు కొనుక్కున్నాం, నా కోడళ్ళకి కూడా అన్నీ అందాయి. నేను 70 ఏళ్ళ వయసులో కూడా సంతోషంగా వ్యవసాయం చేస్తున్నాను, నమస్కారం.