రామచంద్రపురం: సమాజంలో సంఖ్యాపరంగా అధికంగా ఉన్నప్పటికీ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలను గుర్తించి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శాసనమండలి సభ్యుల ఎంపిక నిర్ణయమేనని అందుకు ఉదాహరణ అని గొప్పగా చెప్పుకుంటున్నామన్నారు. రామచంద్రపురం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ ఏమన్నారంటే..
జగనన్న పాలనలో సామాజికన్యాయం జరుగుతుంది. నాడు ఎండమావిగా ఉన్న సామాజికన్యాయం నేడు నిండుకుండలా తొణికిసలాడుతుంది. సామాజిక న్యాయం నాడు నినాదమైతే.. నేడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానంగా అమల్లోకి రావడం ఒక బీసీ మంత్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఇది గొప్పనిర్ణయం. ఈరోజు నూతనంగా ఎంపికజేసిన 18 మంది శాసనమండలి సభ్యుల్లో సామాజికన్యాయం పాటించి బీసీలకు పెద్దపీట వేయడం చరిత్రలో గుర్తుండాల్సిన రోజుగా చెబుతున్నాము. ఇన్నాళ్లూ తమకు సామాజిక గుర్తింపు లేదని .. తమకూ అవకాశాలిస్తే చట్టసభల్లో కూర్చొని ఆత్మగౌరవాన్ని చాటుకుంటామని ఉవ్విళ్లూరిన మా వర్గాల్ని ముఖ్యమంత్రి జగనన్న అక్కున చేర్చుకున్నారు. శాసనమండలి సభ్యుల నియామకంలో అరుదైన గొప్ప నిర్ణయం తీసుకుని అణగారిన వర్గాల కోరికలను నెరవేర్చారు. ఈ విషయం పట్ల సమాజంలో పెద్దలు, సామాజికవేత్తలు ఆలోచించాలని కోరుతున్నాను.
బాబు హయాంలో బీసీలకు మొండిచేయి..
2014–2019లో చంద్రబాబుకు ఇదే అవకాశం వస్తే, 48 మంది ఎమ్మెల్సీలుగా పదవులిస్తే.. అందులో 30 మంది ఓసీలుకు (62.5 శాతం) ఇచ్చారు. కేవలం18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు (అంటే 37 శాతం) ఇచ్చారు. కానీ, ఈరోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 68.18 శాతం పదవులిచ్చారు. అగ్రవర్ణాలకు కేవలం 31 శాతం మాత్రమే కేటాయించారు. దీన్నిబట్టి మేం గర్వంగా చెప్పుకుంటున్న విషయమేంటంటే, చరిత్రలో ముందెన్నడూ లేని సామాజికన్యాయ చరిత్రకారుడుగా మా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోతారు. అదే చంద్రబాబు బీసీలకు వందసీట్లు ఇస్తామని మొండిచేయి చూపిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే, బీసీలు టీడీపీని ఎప్పుడో వదిలేశారు.
ముఖ్యమంత్రి ముందుచూపును గుర్తించాలి..
అదేవిధంగా సీఎం వైయస్ జగన్ ముందుచూపుతో ఎన్నికల ముందు బీసీల జీవితాలపై అధ్యయనం చేయడానికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ అధ్యయన కమిటీ వేశారు. సమాజ నిర్మాణంలో బీసీలు వెనుకబడిన వారు కాదని.. వెన్నెముక కులాలని గుర్తించి బీసీ కమిషన్ శాశ్వతప్రాతిపదికన వేశారు. కులగణన కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపారు. అసెంబ్లీ స్పీకర్ వంటి అత్యున్నత పదవిని బలహీనవర్గాలకు కేటయించారు. మొదటి కేబినెట్ కూర్పులో 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉంటే.. రెండోసారి 70 శాతం ఉన్నారు.
లోక్‌సభలో ఆరుగురు బీసీ సోదరులు ఉన్నారు. అణగారినవర్గాల పిల్లల విద్య పట్ల కూడా నాడు–నేడు కార్యక్రమం ద్వారా ఇంగ్లీషు మీడియం విద్యాబోధన, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాలంటూ.. ఒకప్పుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే మాదిరిగా వారి ఆశయాలకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప ఆలోచనా విధానంతో పరిపాలన సాగిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు ఈ రకమైన ముఖ్యమంత్రి ఆలోచనా విధానాన్ని అర్ధం చేసుకోవాలి. ఆత్మగౌరవ కులాల ఆశాజ్యోతిగా పుట్టిన దేవుని అవతారంగా సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.