టీడీపీ చేసిన తప్పులు, అప్పుల వల్లే నేటికీ తిప్పలు

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఫైర్‌

యనమలా.. మీది కునుకు పాటా? 'ఉనికి' పాట్లా..?

అప్పులపై మీ 'అంచనా'లు తలకిందులైనా అసత్య ప్రచారం ఆపరా..?

ఎఫ్ఆర్బీఎం, కేంద్రం, కాగ్ లను మించి.. ఆర్ధిక వ్యవస్థకు సంబంధం లేని వాళ్ళే టీడీపీ ఆస్థాన ఆర్థిక నిపుణులా..?

మా ప్రభుత్వమున్నంత వరకూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణకు ఏ ఇబ్బంది లేదు.. రాదు

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ అప్పులు, ఆర్థిక నిర్వహణపై ప్ర‌తిప‌క్షాలు పూట‌కో మాట మాట్లాడుతున్నాయ‌ని, అప్పులపై టీడీపీ అధినేత, శాసన మండలి ప్రతిపక్షనేత, అధికార ప్రతినిధుల అయోమయం హాస్సాస్పదంగా ఉంద‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. అనుకూలమైన గణాంకాలు వాడటం, ప్రతికూలమైన వాటిని పక్కన పెట్టడంలో టీడీపీ దిట్ట అన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన తప్పులు, అప్పులు, పెట్టిపోయిన బకాయిల వల్లే ఆంధ్రప్రదేశ్ కు ఇన్ని తిప్పలు వ‌చ్చాయ‌న్నారు. టీడీపీ చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ అందిస్తోన్న ప్రజా సంక్షేమ ప్రవాహంపైనా ఈర్ష, ద్వేషం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. తప్పుల మీద తప్పులతో అప్పుల రాష్ట్రాన్ని ఊబిలో నిలువునా ముంచాకే కదా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది అని వివ‌రించారు. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారంపై మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

``25 ఏళ్ళ అనుభవం అంటూ యనమల అసత్యాలు చెబుతుంటే, 40 ఏళ్ళ అనుభవమున్న చంద్రబాబు  ఏపీ ప్రజలకు తన జోస్యాలతో తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి  2014 వరకు (1956-2014) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.1,20,556 కోట్లు. ఆ తర్వాత విభజన అనంతరం వచ్చిన తెలుగుదేశం తన ఐదేళ్ల వ్యవధిలో రూ.2,69, 462 కోట్లు. దీనర్థం, 58 ఏళ్ల సంవత్సరాల్లో వివిధ ప్రభుత్వాల అప్పు కంటే మీ ఐదేళ్ల హయాంలో చేసిన అప్పు 124 శాతం పెరుగుదలా కాదా అని అడుగుతున్నాను. అడ్డదిడ్డంగా మీరు అప్పులు చేసినా, వాటిని చక్కదిద్దుకుంటూ, పేరుకుపోయిన బకాయిలను మా ప్రభుత్వంలో కోవిడ్ విపత్తును ఎదుర్కొంటూనే బాధ్యతగా చెల్లిస్తూ మార్చి,2022 నాటికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పు రూ 3,82,165 కోట్లు. 2019 తో పోల్చితే వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వ హయాంలో  అప్పు  కేవలం 42 శాతం పెరిగింది. 

యనమల గారూ! గతంలో మీ ప్రెస్ నోట్ (06-10-2022న).. రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులంటూ రాసుకొచ్చారు. మేము ఒక ప్రెస్ మీట్లో అవగాహన కలిగించాక నిన్నటి (25-12-2022న) విడుదల చేసిన మీ ప్రెస్ నోట్లో రూ.6,38,000 కోట్ల అప్పు అంటున్నారు. ఒక్క ప్రెస్ మీట్ తో 2 లక్షల కోట్లు తగ్గించారు. ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మీకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరిస్తే  అప్పుడైనా మీరు  వాస్తవ పరిస్థితులకు దగ్గరగా వస్తారేమో. మీ తప్పుల లెక్కలు, లెక్కతేలని అప్పుల విషయంలో ఇంకో ప్రెస్ మీట్ కల్లా మీరు కచ్చితంగా సెట్ అవుతారని భావిస్తున్నాం.

2014 -19 కాలంలో 14 వ ఆర్ధిక సంఘం రాష్ట్రానికి ద్రవ్యలోటు పరిమితి 3%గా విధిస్తే, టీడీపీ ప్రభుత్వం మాత్రం ప్రతి ఏటా  4 శాతానికి తగ్గకుండా అప్పు చేశారు. అది మీకు తప్పు కాదు కదా?  2021 -22 కాలంలో  15వ ఆర్ధిక సంఘం ద్రవ్యలోటు పరిమితిని  4.5% విధిస్తే, కోవిడ్ విధి వైపరీత్యంలోనూ మా వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం కేవలం 2.1 % మాత్రమే అప్పు చేయడం మాత్రం మీకు అప్పుగా..మేం చేసిన తప్పుగా కనిపిస్తుందా?. జగన్ ది అప్పుల ఘనత కాదు. ఆర్ధిక నిర్వహణలో సమర్థత. కోవిడ్ లోనూ చేసిన సాయం ఓ ఘన చరిత్ర. 14వ ఆర్ధిక సంఘం అప్పు, 2014 -19 మధ్యలో 25 % పరిమితిని పెడితే , కోవిడ్, ఆర్థిక ఇబ్బంది లేని టీడీపీ మాత్రం  2016 -17 ఏడాదిలో 37.20 %... పోతూ పోతూ 2018 -19లో 30.40 % చేయడంలో మీదో అంతులేని కథ. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం, 15 వ ఆర్ధిక సంఘం  అప్పు మరియు జాతీయ ఉత్పత్తి నిష్పత్తి 2021-22కి 32.60 % పరిమితి  పెడితే, కేవలం విధించిన దాని కన్నా  తక్కువగా 31.40 % మాత్రమే నమోదు చేయడం కచ్చితంగా వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వ ఘనతే. 

2014 సంవత్సరంలో మీరు అధికారం చేపట్టే నాటికీ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్  రూ.19,000 కోట్లు. టీడీపీ దిగిపోయేనాటికి 2018 -19  సమయంలో అది రూ.64,013 కోట్లు. అంటే, టీడీపీ చేసింది మాత్రమే  రూ.45,013 కోట్లు. తాజాగా ఈ ఆర్థిక వత్సరం 2022 -23గానూ రూ. 68,463 కోట్లు. అంటే మేము చేసింది కేవలం రూ. 4,000 కోట్లు మాత్రమేననడానికి ఈ గణాంకాలే ఆధారం. 

వైయ‌స్ఆర్ సీపీ అధికారం చేపట్టిన నాటి నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీలకు సుమారు  రూ. 1,35,000 కోట్లు నేరుగా వారి ఖాతా లోకి జమ చేయడం దేశంలోనే ఓ రికార్డ్. 

మొత్తం రూ. 1,85,000 కోట్లు డీబీటీ పద్దతిలో పారదర్శకంగా సాయం చేయగా, అందులో సుమారు రూ.1,35,000 కోట్లు (73%) బడుగు బలహీన వర్గాలే లబ్ధిదారులుండడం మా చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది  చాలదా బడుగుల అభివృద్ధి పట్ల ప్రభుత్వానికి ఎంత అంకితభావం ఉందో? ఎంత చిత్తశుద్ధి ఉందో?. ఇదే కాకుండా నాన్- డీబీటీ పద్దతిలో మొత్తం రూ. 1,45,000 కోట్లు సాయం చేయగా, అందులో సుమారు రూ.1,22,000 కోట్లు (84%) వారికి వివిధ పథకాల ద్వారా లబ్ది చేకూర్చడం నభూతోనభవిష్యత్. మొత్తంగా రూ.2,57,000 కోట్లు (78%)  బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మైనారిటీల సంక్షేమాభివృద్ధికి వెచ్చించామని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. వైయ‌స్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్ర ఆర్థిక నిర్వహణకూ కించిత్ లోటు రానివ్వం.

కాంట్రాక్టర్ లకు చెల్లించకుండా అనకొండలా, గుదిబండలా రాష్ట్ర ప్రజల గుండెలపై పెట్టిన రూ.40,000 కోట్ల పై చిలుకు బకాయిల గురించి చెప్పరేం? పౌర సరఫరా శాఖ పేరుతో వేల కోట్లు రుణాలు తీసుకొని చివరి నిముషం లో పసుపు కుంకుమ పేరుతో దారి మళ్లించడం నిజమే కాదా? విద్యుత్ రంగాన్ని విచక్షణ మరచి రూ.50వేల కోట్ల రుణంతో వినాశకానికి కారణమెవరో పలకరేం? నీటి వసతి, మౌలిక సదుపాయాల పేరుతో చేసిన అప్పులను దారి మళ్లించి, మంచి నీళ్లలా ఖర్చు పెట్టి, అడ్డగోలుగా మాయం చేసిందెవరో వివరించరేం? ఆర్బీఐ, కేంద్రం , కాగ్ లు హెచ్చరించినా రూ.17వేల కోట్లు పరిమితులు, నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా చేసిన రుణాల పరిస్థితి తెలపరేం? అన్ని కార్పొరేషన్ల లోన్ వివరాలు బడ్జెట్ డాక్యుమెంట్స్ తో ఇవ్వడం జరిగింది. ప్రతి విషయం కాగ్ కి తెలుసు. దాపరికాలు లేవు. దాచిపెట్టేవేం లేవు. మీ దుష్ప్రచారాల వల్ల ఏదో జరిగిపోతుందనే దానికన్నా 151 సీట్లిచ్చిన ప్రజలకు జవాబుదారీతనంతో చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది.``
 

Back to Top