చంద్రబాబును బీసీలు క్షమించరు

రిజర్వేషన్లను అడ్డుకుంటూనే బాబు మొసలి కన్నీరు
రాష్ట్రానికి కేంద్రం నిధులు రాకుండా టీడీపీ కుట్ర చేస్తోంది
ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా చట్టాన్ని అమలుపర్చడం అభినందనీయం
మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో బలహీనవర్గాలకు చెందాల్సిన రిజర్వేషన్‌ను అడ్డుకున్న చంద్రబాబే మళ్లీ బీసీలను మభ్యపెట్టేందుకు మొసలి కన్నీరు కారుస్తున్నాడని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. అనంతపురంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలపై టీడీపీది కపట ప్రేమ అని, చంద్రబాబును బీసీలు ఎప్పటికీ క్షమించరన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా కఠిన చట్టాన్ని అమలుపరచడం అభినందనీయమన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచుతూ పట్టుబడితే మూడేళ్ల జైలు శిక్ష, అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందన్నారు. బీసీలకు మేలు చేసేందుకే సీఎం వైయస్‌ జగన్‌ 58.95 శాతం రిజర్వేషన్లు తెచ్చారని, దాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్లి  అడ్డుకుందని మండిపడ్డారు. ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుంచి రావాల్సిన రూ.5వేల కోట్లు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రానికి కేంద్ర నిధులు రాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని గుర్తుచేశారు. కాగా, స్థానిక సంస్థల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు చాలా కీలకం అన్నారు. ఉగాది రోజున 25 లక్షల మంది పేదలకు ఇంటి స్థలాలు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
 

Back to Top