చంద్రబాబు, లోకేశ్‌ విదేశీ పర్యటనల్లోనూ గోప్యమెందుకో..?

అమెరికా రాలేదని ఆయన సొంత సామాజికవర్గమే చెబుతుంది

బాబు ఏ దేశంలో ఉన్నాడో ఎల్లోమీడియాలోనైనా ప్ర‌క‌ట‌న‌ ఇవ్వొచ్చు కదా..?

ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లాడు..?

సీఎం వైయ‌స్ జగన్‌ ఐదేళ్ల పాలనను ప్రజలు ఆశీర్వదించి ఓట్లేశారు

జూన్‌ 4 ఫలితాల వెల్లడితో వైయ‌స్ జగనే మళ్లీ సీఎం ఖాయం

విద్యా శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌

విజయవాడ: రానున్న ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 175కి 175 చోట్ల ఘన విజయం సాధిస్తుంద‌ని, జూన్‌ 9న వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్టణంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ తరఫున గ‌తంలోనే చెప్పాన‌ని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ గుర్తుచేశారు. విద్యా, వైద్యం రంగాలకు సంబంధించి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంస్కరణలను ఇంకా కొనసాగిస్తామని వైయ‌స్‌ఆర్‌సీపీ మేనిఫెస్టోలోనే పెట్టామ‌ని, మ‌ళ్లీ అధికారంలోకి రాగానే అలాగే వాటి అమలును కొనసాగిస్తామని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. పచ్చమీడియా పత్రిక ఆంధ్రజ్యోతిలో నిన్న విద్యాశాఖ గురించి మళ్ళీ రాసింద‌ని, మరి, విద్యావైద్యంలో తాము అమలు చేసిన విధానాలు బాగోనప్పుడు ప్రతిపక్ష పార్టీలైన కూటమి ఏమైనా ప్రశ్నించిందా ..? మేమొస్తే ఇలా చేస్తామని మేనిఫెస్టోలో వాళ్లెందుకు పెట్టలేదు..? మా విధానాల్లో లోపాలుంటే వాటిని సరిచేస్తామని వాళ్లు చెప్పొచ్చుకదా..? ప్రజలకు మీరెందుకు క్లారిటీగా చెప్పలేదు..? అని ప్ర‌శ్నించారు. విజయవాడలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి బొత్స ఇంకా ఏం మాట్లాడారంటే..
 2018–19 నుంచి ఈనాటి దాకా చూస్తే రాష్ట్ర‌ వ్యాప్తంగా 4 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారంటూ పచ్చమీడియా రాసిన కథనాలు వాస్తవం కాదు. అవన్నీ శుద్ధ అబద్ధాలే.. నిజానికి, 2025–26 విద్యా సంవత్సరం వచ్చేసరికి మొత్తం 38,61,198 మంది విద్యార్థులతో క్లాసులు ప్రారంభం కానున్నాయి. అలాంటిది, పచ్చమీడియాలో మాత్రం సుమారు 3 లక్షల మంది విద్యార్థులు తక్కువగా లెక్కలు చూపి వాస్తవ విరుద్ధమైన కథనాలు రాశారు. ఇదంతా విద్యా విధానంలోని లోపాలతోనే జరుగుతుందంటూ ఊదరగొడుతున్నారు. ఇలాంటి పద్ధతి మీడియాకు ఎంతవరకు కరెక్టు..? 

దేశంలో ఎక్కడాలేని విద్యావిధానాలను అమల్లోకి తెచ్చాం
భారతదేశంలోనే ఎక్కడా లేనివిధంగా విద్యావిధానం ఏపీలో దేదీప్యమానం గా అమలవుతోంది. ఇది మేం చెప్పడం కాకుండా.. అంతర్జాతీయ సంస్థ ల నివేదికలే చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థిని గ్లోబల్‌స్థాయిలో నిలపాలనే తపనతో ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకెళ్తోంది. దేశంలో ఏ కాంపిటేటివ్‌ పరీక్ష జరిగినా.. ఈ రాష్ట్ర విద్యార్థులకే ర్యాంకుల సాధనలో అధిక భాగస్వామ్యం దక్కాలనే దిశగా విద్యావ్యవస్థను నడిపిస్తోన్నాం. వైయ‌స్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్ర విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చారు. ఇంగ్లీషు మీడియా విద్యాబోధన, టోఫెల్‌ శిక్షణ, సీబీఎస్‌ఈ సిలబస్, బైజ్యూస్‌ కరిక్యులమ్, వచ్చే ఏడాది నుంచి ఐబీ విధానం గానీ.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం గానీ ఇలా ఎన్నో సంస్కరణలను తెచ్చాం. అమ్మఒడి, విద్యాదీవెన, విద్యాకానుక వంటి పథకాలతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక ఆర్థిక భరోసా కల్పించడం.. విదేశాల్లో చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికీ రూ.1.25 కోట్ల వరకు వెచ్చించడం దేశంలో ఎక్కడా లేనివిధంగా అందించాం. రానున్న కాలంలోనూ వాటిని మరింత మెరుగ్గా అమలు చేస్తాం. 

వైయ‌స్ జగన్‌ ఐదేళ్ల పరిపాలనను ప్రజలు ఆశీర్వదించారు
మేం ఎన్నికల మేనిఫెస్టోను ఒక పవిత్రగ్రంథంలా చూసుకుంటామనేది ప్రజలందరికీ తెలుసు. గడచిన ఐదేళ్ల కాలంలో వైయ‌స్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో హామీల్ని ఏ విధంగా అమలు చేశామనేది.. రాబోయే ఐదేళ్లకూ మా పనితీరు ఎలా ఉంటుందనేది ప్రజలకు ఇప్పటికే అర్ధమైంది. విద్యావైద్యం రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలను తెచ్చి.. ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పులు తెచ్చామనేది కూడా వారు కళ్లారా చూస్తున్నారు. కాబట్టే.. మా అధినేత వైయ‌స్‌ జగన్‌ కోరినట్టు మీ కుటుంబంలో మంచి జరిగితేనే మరోమారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించమన్నారు. ఆమేరకే, ప్రజలంతా నిన్నటి ఎన్నికల్లో తమ విలువైన ఓటు ద్వారా వారి ఆశీస్సులను వైయ‌స్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా అందించారు. జూన్‌ 4 ఫలితాల్లో వైయ‌స్‌ఆర్‌సీపీ విజయ ప్రభంజనంతో వైయ‌స్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రిగా విశాఖలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు ఏ దేశం వెళ్లాడు..?
ఎన్నికలు ముగిశాయి. ఫలితాల వెల్లడికి సమయం ఉన్నందున అందరి పార్టీల అధినేతలకు మల్లే మా అధినేత వైయ‌స్‌ జగన్‌ కూడా ఫ్యామిలీ టూర్‌కని లండన్‌ వెళ్లారు. ఆయన్ను ఎయిర్‌ పోర్టులో అడ్డుకోవాలని టీడీపీ ఎన్‌ఆర్‌ఐ లోకేశ్‌ అనే వ్యక్తి సోషల్‌మీడియా మెసేజ్‌లు పంపి.. అక్కడ హడావిడి చేయడమేంటో ఎవరికీ అర్ధం కాని పరిస్థితి. పైగా, వైయ‌స్ జగన్‌ టూర్ మీదనూ రకరకాల ట్రోలింగ్‌లు నడిపారు . ఆయనంటే మీకెందుకు అంత కక్ష..? రేపటి ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పు కనిపిస్తోంది. అప్పటిదాకా మీరు ఆగలేరా..? సరే, మా నేత అందరికీ తెలిసేలా చెప్పిమరీ లండన్‌కు వెళ్లారు. మరి, చంద్రబాబు ఎక్కడికెళ్లాడు..? ఆయన విదేశీపర్యటనకు కోర్టు అనుమతి తీసుకుని వెళ్లాలి కదా..? ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్లడమేంటి..? అసలింతకు ఆయన ఏ దేశం వెళ్లాడో కూడా ఎవరికీ తెలియడం లేదు.

ఏ కోర్టు అనుమతితో విదేశాలకెళ్లాడు..?
తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా నడిచే తానా సంస్థ వాళ్లేమో చంద్రబాబు అమెరికా రాలేదంటారు. ఇటు లండన్‌ వాళ్లు మా దగ్గరకు రాలేదంటారు. మరి, చంద్రబాబు ఏ దేశం వెళ్లినట్టు..? ఆయనేమో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. కాబట్టి.. చంద్రబాబు ఏ దేశంలో ఉన్నాడో కనిపెట్టిన వారికి పారితోషికం ఇవ్వబడును అని ఒక ప్రధాన మీడియా పత్రికలో ప్ర‌క‌ట‌న‌ ఇవ్వాలి. కనీసం, నేను ఫలానా దేశానికి వెళ్తానంటూ.. తన విదేశీ పర్యటనకు అనుమతి కావాలని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసి తీసుకోవాలి కదా..? ఏ కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లాడు..? 

ఓటమి భయంతో పారిపోయారనడం మా విధానం కాదు
చంద్రబాబు పరిస్థితి ఇలాఉంటే.. ఆయన కొడుకు లోకేశ్‌ ఎక్కడున్నాడని ఆరాతీస్తే.. తండ్రి కంటే ఆయన మూడురోజులు ముందే విదేశాలకెళ్లాడంట. ఇక, సెలబ్రిటీ నాయకుడు కూడా ఏదో దేశానికి అవార్డు కోసం పోతున్నాడని నేనొక ఛానెల్‌లో చూశాను. చంద్రబాబు ఎవరికీ చెప్పనక్కర్లేదని విదేశాలకు వెళ్లాడా..? ఎటూ ఆయన ఎన్నికల దాకా ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా హైదరాబాద్‌లో ఉన్నాడ్లే.. ఇప్పుడు శాశ్వతంగా ఆంధ్రాను వదిలి అమెరికానో.. మరే దేశానికో పారిపోయాడని మేమనాల్నా ..? వీళ్లంతా ఓటమి భయంతోనే విదేశాలకు పారిపోతున్నారని వాళ్లకు మాదిరిగా మేము ఆరోపించలేం. అది మా విధానం కాదు.  

అందరూ సంయమనం పాటించడం మంచిది
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంతకుముందెన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులను చూస్తున్నాం. నేను రాజకీయాల్లోకొచ్చాక చాలా ఎన్నికలు చూశాను. కానీ, ఇప్పటి ఎన్నికల్లో జరుగుతున్న దాడులు, అల్లర్ల పరిస్థితిని నేను ఏనాడూ చూడ్లేదు. ప్రధాన పార్టీల నేతలంతా రిలాక్స్‌ మూడ్‌లో ఎవరికి వారు విదేశాలకు వెళ్లారు. కాబట్టి.. ఆయా పార్టీల కేడర్‌ కూడా ఎన్నికల ఫలితాలొచ్చేదాకా రాజకీయాల్ని పక్కనబెట్టి కాస్త సంయమనం పాటించడం మంచిది. ఇకనైనా, ఈ దాడులు, అల్లర్లు ఆపండి. సోషల్‌మీడియాలో కూడా అనవసరంగా ట్రోలింగ్‌లు పెట్టకండని అందరినీ కోరుతున్నాను. 

Back to Top