తాడేపల్లి: ప్రజల ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్.1లోని నిబంధనలను ప్రతిపక్ష పార్టీలు చదివాయా..? అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జీవోపై విమర్శలు చేస్తున్నవారు ముందు దాన్ని చదువుకోవాలని సూచించారు. జీవోలో రోడ్డు షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందని ప్రశ్నించారు. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని మాత్రమే చెప్పామన్నారు. అవసరమైతే అనుమతి తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చన్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్.1 అన్ని పార్టీలకూ వర్తిస్తుందని చెప్పారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే.. గత మూడు, నాలుగురోజులుగా చంద్రబాబు, ఆయన తోక పార్టీలు, పచ్చమీడియా జీవో నంబర్.1 పై అదేపనిగా గగ్గోలు పెడుతున్నాయి. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రభుత్వం ఈ జీవోను తెచ్చిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇలా మాట్లాడుతున్నవారంతా ఆ జీవోను పూర్తిగా చదివారా..? చదివిన వాళ్లు ఏం అర్ధం చేసుకున్నారు. ఆ జీవోలో ఎక్కడైనా బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించడానికి వీల్లేదని ఉందా..? లేదు కదా.. ఎందుకు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారు..? చంద్రబాబు ఈ రాష్ట్రంలో పర్యటిస్తుంటే.. ఆయన వెంట ప్రజలు లక్షలాదిగా వెంబడిస్తుంటే ప్రభుత్వం ఏదో అడ్డుపడుతుందని నానా యాగీ చేయడానికి సిగ్గుగా లేదా..? చంద్రబాబు, మిగతా ప్రతిపక్షాలు వారి రాజకీయ లబ్ధికోసం ఏవేవో అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇక్కడ మీడియా పాత్ర ఏంటి..? ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేస్తే.. దాన్ని పూర్తిగా కూలంకషంగా చదివి ప్రజలకు అర్థమయ్యేరీతిగా సమాచారమివ్వడమనేది మీడియా బాధ్యత కాదా.. ఈరోజు చంద్రబాబుకు వత్తాసుపలికే మీడియా తన బాధ్యతను మరిచి ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపుతుంది. జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ, రోడ్డు మార్జిన్‌లలో బహిరంగ సభలు నిర్వహించరాదని.. అత్యవసర పరిస్థితుల్లో, ఆ కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వ అనుమతులతో నిర్ధేశించిన ప్రాంతాల్లో జరుపుకోవాల్సి ఉందనేది జీవో సారాంశం. ఇంత స్పష్టంగా ఉన్న సమాచారాన్ని పచ్చమీడియా కావాలని వక్రీకరించడం ఏవిధంగా చూడాలి..? ఇలాంటి రాతల్ని, ఎత్తుగడల్ని ప్రజలు ఆమాత్రం అర్థం చేసుకోలేరనేది పచ్చమీడియా భ్రమ మాత్రమే.. జీవో నంబర్.1 తేవడానికి బాబు దుర్మార్గాలే కారణం పచ్చమీడియా టీవీలు, పత్రికలు చంద్రబాబు జవసత్వాలను జాకీలెత్తి పైకిలేపుదామని ఎంత ప్రయత్నించినా.. వాళ్ల ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే.. అసలు, ప్రభుత్వం ఈ జీవో నంబర్.1 తేవడానికి కారణం చంద్రబాబే కదా.. ఆయన కందుకూరు, గుంటూరులో చేసిన దుర్మార్గమైన సభల వల్లే కదా..? ఆయనను ఆకాశానికెత్తే మీడియాకు ఈ విషయం తెలియదా..? టీడీపీని, పార్టీ కార్యక్రమాలను తాను నడపలేను అనుకుంటే.. చంద్రబాబును హైదరాబాద్‌కు వెళ్లి ఇంట్లో కూర్చోమనండి.. అంతేగానీ, ప్రభుత్వం మీద ఏడ్చి.. ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ.. ప్రభుత్వ జీవోలను సాకుగా చూపించి రాద్ధాంతం చేయడమెందుకు..? అని అడుగుతున్నాను. ప్రభుత్వ చట్టాలు, జీవోలనేవి అధికారపక్షానికి ఒకటి, ప్రతిపక్షాలకు వేరొకటి అంటూ ఉండవు. ప్రజల తరఫున రక్షణ, వారికి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. చట్టాలు, జీవోలను అందరూ గౌరవించాల్సిందే. ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? నేనేదో సభ పెట్టానని.. ఈ జీవో మంత్రికి వర్తించదా.. అని చంద్రబాబు బరితెగించి మాట్లాడాడు. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహావిష్కరణకు హాజరై వెళ్లిపోయాను. ఆ తర్వాత విగ్రహావిష్కరణ కమిటీ ర్యాలీ చేసుకున్నారు. వాళ్లుకూడా ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదు. చంద్రబాబు ప్రతీది సానుభూతి పొందాలని, ప్రతి అంశాన్నీ తన రాజకీయలబ్ధికి వాడుకునేంత మేధావితనాన్ని ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేడు. ఈరోజు పర్యటనల పేరిట బాబు పెద్దపెద్ద మాటలతో ఆయనో దైవాంశ సంభూతుడిలా మాట్లాడితే ప్రజలు నమ్ముతారేమోననే భ్రమలో బతుకుతున్నాడు. ఆయన గురించి, ఆయన రాజకీయ ఎత్తుగడల గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఏనాడో తెలిసిపోయింది. కనుకనే, 2019లో ఓడించి ఇంట్లో కూర్చొబెట్టారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం అమాయక ప్రజలు చనిపోతుంటే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోమంటారా..? పోలీసులు బాధ్యతగా వ్యవహరించడంలేదని, ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టడం ఎంత బాధాకరం. చంద్రబాబు కార్యక్రమాల్లో పోలీసులు సక్రమంగా వారి బాధ్యతలు వారు నిర్వర్తించబట్టే ఆమాత్రమైనా ఆయన రోడ్‌షోలు సజావుగా సాగుతున్నాయనే సంగతి బాబు గ్రహించాలి. గతంలో దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత మా పార్టీ అధినేత వైయస్ వైయస్ జగన్ పాదయాత్రలు చేసినప్పుడు.. ఎక్కడా ఎటువంటి చిన్న అవాంతరమైనా జరగలేదు కదా.. అలాంటి పార్టీలపై అనర్హత వేటు వేయాలి ప్రభుత్వ చట్టాలు ఏ ఒక్కరికీ చుట్టంగా ఉండకూడదని.. ప్రతిపక్షాల ఆలోచనాసరళిని మార్చుకోవాలని కోరుతున్నాను. ఏదిఏమైనా అధికార, ప్రతిపక్షాలు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. చనిపోయినా పర్వలేదంటే.. అలాంటి భావజాలంతో ముందుకెళ్తున్న రాజకీయ పార్టీలపై అనర్హత వేటు వేయాలి. ప్రతిపక్షాలు, వాళ్లను మోస్తున్న పచ్చ మీడియా ఇప్పటికైనా జీవో నంబర్.1ను పూర్తిగా చదువుకోండి. ప్రజలకు అర్థమయ్యేటట్లు రాయండి. ప్రజల చేత చదివించండి. ప్రజలకు ఉన్న ప్రాథమిక హక్కులకు, వారి ప్రాణాలకు ఎక్కడా నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే కదా.. ఈ వాస్తవాన్ని కాదంటారా..? జీవో నంబర్.1లో ‘కట్టడి’ అనేది ఎక్కడుందో చెప్పండి..? కుప్పంలో చంద్రబాబును ఎవరు అడ్డగించారని గగ్గోలు పెట్టాడు. అనుమతులు తీసుకోకుండా సభలు, రోడ్‌షోలు నిర్వహించరాదని అక్కడి అధికారులు చెప్పారు. అది తప్పా..? బుద్ధిలేకుండా చంద్రబాబు మాటలు విత్తు ఒకటైతే చెట్టు మరొకటి ఉంటుందా..? చంద్రబాబు చరిత్రంతా మోసం, దగా, మాయే కదా.. లోకేష్ పాదయాత్ర చేసి, అంతకంటే ఏం చేస్తాడు?. అలాంటి తండ్రికి పుట్టిన కొడుకు అలాగే ఉంటాడు కదా..?చంద్రబాబు ఆనాడు డ్వాక్రాసంఘాలకు రుణమాఫీ చేస్తానని మాట తప్పాడు. ఉచిత విద్యుత్ అమలు చేస్తే షాక్ కొడుతుందని తప్పుకున్నాడు. ఇవన్నీ ప్రజలకు తెలుసుకదా..? మరలా, ప్రజలకు కొత్తగా ఎవరూ గుర్తుచేయనక్కర్లేదు. రేపు లోకేష్ పాదయాత్ర చేసినా.. అతని తండ్రి మాయమాటలు చెప్పి ప్రజల్నెంత మోసం చేశాడనేది గుర్తు చేస్తూ పోతాడు. టీడీపీ సభలకు పక్క పార్టీల వాళ్లు స్లీపర్‌సెల్స్‌గా వస్తున్నారని చంద్రబాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. మాట్లాడటానికి అది నోరా.. లేక తాటిమట్టా.. చంద్రబాబు, రానురానూ బుద్ధిలేకుండా మాట్లాడుతున్నాడు.