విజయవాడ: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఏపీలో 2021–22 విద్యా సంవత్సరానికి గానూ 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. రికార్డు స్థాయిలో నెలరోజుల్లోనే టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించామని, స్పాట్ వాల్యువేషన్ 13 నుంచి 22వ తేదీ వరకు ప్రారంభించడం జరిగిందన్నారు. పక్కనున్న తెలంగాణ, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల కంటే ముందుగా ఫలితాలను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందని బొత్స సత్యనారాయణ అన్నారు. సుమారు 6,15,908 మంది పరీక్షలకు హాజరు కాగా, ఉత్తీర్ణులైన వారు 4,14,281 మంది అని మంత్రి బొత్స చెప్పారు. పదో తరగతి పరీక్షల్లో బాలురు 3,16,820 మంది పాల్గొనగా 2,02,821 మంది ఉత్తీర్ణులయ్యారని, బాలికలు 2,99,088 మంది పాల్గొంటే.. 2,11,460 మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. బాలుర శాతం 64.02 ఉంటే.. బాలికల ఉత్తీర్ణత శాతం 70.70గా ఉందన్నారు. మొత్తంగా పదో తరగతి పరీక్షల్లో 67.26 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని వివరించారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం ప్రకాశం జిల్లా 78.3 శాతం, అత్యల్పం అనంతపురం జిల్లా 49.7 శాతంగా ఉందని చెప్పారు. 11,671 స్కూళ్లల నుంచి విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో పాల్గొనగా ఇందులో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు 797 ఉన్నాయని, ఒక్క విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించని స్కూళ్లు 71 ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నామని, జూలై 6వ తేదీ నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ఫెయిల్ అయిన విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కూడా నిర్వహించనున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.