కంచరపాలెం ఘటనకు, రాజకీయాలకు సంబంధం లేదు

మీ స్వార్థ రాజకీయాల కోసం ఉత్తరాంధ్ర ప్రశాంతతను చెడగొట్టొద్దు

ఒకవేళ రాజకీయ ప్రమేయం ఉంటే ఎవర్నైనా ఉపేక్షించవద్దు

ఏ ప్రాంతంలో అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు 

అందుకే ఆ రిటైర్డ్‌ ఐపీఎస్ అధికారిపై గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేశాం

ఈసీ కూడా వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంది

విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ‌ప‌ట్నం: విశాఖలో కుటుంబంపై దాడికి, రాజకీయాలకు సంబంధం లేదని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. నిన్న విశాఖ పార్లమెంటు పరిధిలోని కంచరపాలెంలో జరిగిన దాడి ఘటనను, రాజకీయ కోణంలోకి తీసుకువచ్చి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిప‌డ్డారు. ఆ సంఘటనకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే శాంతియుతంగా, సోదర భావంతో ఉండే ప్రాంతమ‌ని, అలాంటి ప్రాంతంలో రాజకీయ లబ్ధి కోసం, లేనిపోని ఆరోపణలు చేస్తూ, అల్లర్లకు ప్రేరేపించవద్దని ప్ర‌తిప‌క్షాల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. పోలీసులు కూడా నిష్పక్షపాతంగా ఏ సంఘటన జరిగినా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే సందర్భంలో రాజకీయ నాయకులు కూడా అనవసరమైన నిందారోపణలు చేయడం కూడా తగదన్నారు. విశాఖ‌ప‌ట్నంలోని వైయ‌స్ఆర్ సీపీ కార్యాల‌యంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. 

మంత్రి బొత్స ఏం మాట్లాడారంటే..
విశాఖ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై లేని పోని ఆరోపణలు చేసి హింసను ప్రోత్సహించవద్దు. వైయ‌స్ఆర్ సీపీ దానికి పూర్తిగా వ్యతిరేకం. అలాంటి హింసా సంఘటనలు జరిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఈ ఘటనపై, ఎవరు మాట్లాడినా సంఘటన పూర్వాపరాలు తెలుసుకుని మాట్లాడాలి. మీడియా కూడా వాస్తవాలు ప్రచురించాలి. ఒక వేళ అది కక్షపూరిత చర్య అయితే మాత్రం నిష్పక్షపాతంగా చర్య తీసుకోవాలని కూడా డిమాండ్‌ చేస్తున్నాం. 

జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌ జరగబోతోంది. జూన్‌ 9న ఈ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వైయ‌స్ జగన్‌ ప్రమాణస్వీకారం అనంతరం విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కూడా కానుంది. ప్రపంచ స్థాయిలో విశాఖ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అటువంటి వాతావరణాన్ని చెడగొట్టవద్దు. ఈ ప్రాంత శాంతిభద్రతలు కాపాడుకోవాల్సిన బాధ్యత, అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.

ఏ ప్రాంతంలో అధికారులను మార్చారో అక్కడే అల్లర్లు జరిగాయి. ఎన్నికల కమిషన్‌ నియమించిన ఓ రిటైర్డ్‌ పోలీసు అధికారి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేం గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశాం. ఏదైనా ఫిర్యాదు వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండానే చర్యలు తీసుకుని అధికారులను మార్చారు. ఏ ప్రాంతంలోనైతే జిల్లా అధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే అల్లర్లు చెలరేగాయి. జరిగిన సంఘటనలపై ముందస్తుగా కానీ, ఆ తర్వాత కానీ ఆలోచన చేయలేదనే అంశంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ని కోరాం. ఇలాంటి సున్నితమైన సమయాల్లో ఒక అధికారిని నియమించే ముందు, ఆ అధికారి పూర్వాపరాల గురించి కూడా తెలుసుకోవాలి. గతంలో ఆ అధికారి ఉద్యోగ బాధ్యతల్లో ఎలా పనిచేశారు.. ఎటువంటి సంఘటనలు జరిగాయో కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలా చేయకపోవడం వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ అల్లర్లు జరిగాయని మేం చెప్పాం.

ఈ అంశంపై గవర్నర్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాం. ఆ తర్వాత వారు తీసుకున్న చర్యలు కూడా మీరంతా చూశారు. రాబోయే ఐదేళ్లు మళ్లీ పరిపాలించాల్సింది వైయ‌స్ఆర్ సీపీనే కాబట్టి.. అలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకూడదని మేం భావించాం. అందరూ శాంతియుత వాతావరణంలో, సోదరభావంతో మెలగాలని మేం ఎప్పుడూ కోరుకుంటాం. 175 సీట్లకు 175 సీట్లు సాధించే దిశగా అడుగులు వేశాం. అన్ని సీట్లలో గెలుస్తాం. అధికారులెవరైనా చట్టానికి లోబడి పరిపాలన చేయాలి. కానీ పక్షపాత ధోరణితో ఉండకూడదు. 

రుషికొండలో నిర్మించిన అధికారిక భవనాలు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటిని ఏం చేయాలో నిర్ణయిస్తాం. ముఖ్యమంత్రి అధికారిక నివాసంగా ఉంచాలా, లేదా ముఖ్యమంత్రి పరిపాలన భవనంగా పెట్టాలా అనేది నిర్ణయం తీసుకుంటాం. ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానివి.. ఎవరి సొంతం కాదు. బొత్స సత్యనారాయణ, వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి భవనాలు కావవి.

ఓడిపోతారని తెలిసే.. మహానాడు రద్దు
టీడీపీ మహానాడును ఎవరైనా క్యాన్సిల్‌ చేస్తారా? అక్కడ విషయం లేదు కాబట్టే క్యాన్సిల్‌ చేశారు. నిజంగా వాళ్లే గెలిచేటట్లయితే ఆ మహానాడును ఇంకా హంగామాగా చేసేవాళ్లే కదా? నీరసపడిపోయి, డీలా పడిపోయి క్యాన్సిల్‌ చేసి ఉంటారు. అది వారి పార్టీ వ్యవహారం.. దానిపై నేను కామెంట్‌ చేయదలుచుకోలేదు.

కేంద్రంలో మన రాష్ట్రంపై ఆధారపడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా
ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం రావాలనే కోరుకోవాలి. కానీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనపై, మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నా. రాష్ట్రంలో 175కి 175 గెలుస్తాం అంటే ఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లూ వస్తాయని అర్థం. విశాఖ రాజధానిగా మేం మేనిఫెస్టోలో పెట్టాం. ప్రజాతీర్పును కోరాం. టీడీపీ విశాఖ రాజధాని అనే అంశాన్నే తన మేనిఫెస్టోలో పెట్టలేదు. ప్రజాతీర్పు వచ్చిన తర్వాత..మేం న్యాయస్థానాలను కూడా కోరతాం. ప్రజాతీర్పు కూడా అనుకూలంగా ఉందని చెప్తాం. స్వార్ధపూరితంగా కొందరు న్యాయస్థానాలకు వచ్చి అడ్డుకోవాలని చూస్తారు..పెద్ద మనసుతో ప్రజల అభిప్రాయాన్ని గమనించాలని విన్నవిస్తాం. అభివృద్ధిని ఆటంకపరుస్తున్న రాష్ట్ర ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరతాం.

టీడీపీ వాళ్లు భ్రమల్లో ఉంటే.. ఉండనివ్వండి
తినబోతూ రుచి ఎందుకు..? మరో నాలుగు రోజులు పోతే ఫలితాలే వస్తాయి కదా? టీడీపీనే వస్తుందని ఎవరైనా భ్రమల్లో ఉంటే ఉండనివ్వండి. దానికి మేమెందుకు కామెంట్‌ చేయాలి?. దేశంలో బ్రహ్మాండమైన సీట్లతో జూన్ 9న వైయ‌స్ జగన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. 175కు దగ్గరగా వస్తాం.. ఒకటీ రెండూ ఏమైనా తేడా ఉంటే ఉండొచ్చు. ఆ రెండూ చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ గెలుస్తారు అని మీరు అనుకుంటే లోకేశ్, బాలకృష్ణ ఓడిపోతారా? అని మీడియాను ప్ర‌శ్నించారు.

ఆ రిటైర్డ్ ఐపీఎస్ అధికారిపై ఏ ఒత్తిడి ఉందో...
కొంత మంది ఒత్తిడితో ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకున్నారని మేం అనుకుంటున్నాం. అందుకే ఆ రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారిపై ఫిర్యాదు చేశాం. దేశంలో ఇంత మంది సీనియర్‌ అధికారులు ఉండగా ఒక రిటైర్డ్‌ అధికారిని ఇక్కడ నియమించడం ఏంటి? అతనికి ఏం అధికారం ఉంటుంది? ఏం బాధ్యత ఉంటుంది? ఒక రిటైర్డ్‌ అధికారి ఇక్కడకు వస్తారు..మరో రిటైర్డ్‌ అధికారి ఇంటికి సీక్రెట్‌గా భోజనానికి వెళ్తారు. మర్నాడు పరిపాలనలో చర్యలు కనిపిస్తాయి. అసలు అలాంటి అనుమానాలకు, ఆ అధికారి ఎందుకు తావివ్వాలి? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 
 

Back to Top