రిపబ్లిక్‌ డే నాడూ బూతుల ప్రసంగమా..?

అసందర్భంగా పవన్‌కళ్యాణ్‌ ప్రేలాపనలు

ఇదేనా సెలబ్రిటీ పార్టీ నాయకుడి విధానం..?

పవన్‌ను సూటిగా ప్రశ్నించిన మంత్రి బొత్స

అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది

ఏమీ లేనీ విస్తరాకే ఎగిరెగిరి పడుతుంది

పవన్‌కళ్యాణ్‌ పరిస్థితి అచ్చం అలాగే ఉంది

రాజకీయాల్లో పవన్‌ సిగ్గుమాలిన సన్నాసి

అలాంటి నాయకుణ్ని చూస్తామనుకోలేదు

మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

ఎస్సీ సబ్‌ప్లాన్‌ అంటే తెలియని అజ్ఞాని పవన్‌కళ్యాణ్‌

ప్లానింగ్‌ కమిషన్‌ 2014లోనే రద్దయిన సంగతి తెలియదు

ఇప్పుడు ఉన్నదాన్ని ఎస్సీ కాంపొనెంట్‌ అని అంటారు

గుర్తు చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ 

వికేంద్రీకరణపై చంద్రబాబు, వపన్‌ది ఒకే మాట

వారిద్దరిదీ దోపిడీ విధానం. అందుకే జత కట్టారు 

అభివృద్ధి వికేంద్రీకరణే మా పార్టీ విధానం

మా విధానం మూడు రాష్ట్రాలు కానే కాదు

రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి

మా నేత వైయ‌స్ జ‌గ‌న్‌ నోట ఇదే వినిపిస్తుంది

ప్రెస్‌మీట్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

  తాడేపల్లి: ఇవాళ గణతంత్ర దినోత్సవం. ఇవాళ ఎవరు ఏం మాట్లాడినా హుందాగా, సంప్రదాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ఉండాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. విలువలు, సంప్రదాయం తెలిసిన వారెవరైనా అదే విధంగా మాట్లాడతారు కానీ.. ఈరోజు ఒక సెలబ్రిటీ పార్టీ నాయకుడు.. పవన్‌కళ్యాణ్‌ మాట్లాడినట్లు ఏ ఒక్కరూ మాట్లాడరు. ప్రజాసేవ క్షేత్రంలోకి వచ్చినప్పుడు అందరికీ నచ్చేట్లు.. అందరూ మెచ్చుకునేట్లు మాట్లాడాల‌న్నారు.  ఇవాళ గణతంత్ర దినోత్సవం అన్న విషయం కూడా మర్చిపోయిన ఆ సెలబ్రిటీ పార్టీ నాయకుడు పిచ్చెక్కినట్లు మాట్లాడటం దురదృష్టకరమ‌ని మండిప‌డ్డారు.  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
    ఇన్నాళ్ల మా రాజకీయ జీవితంలో ఇంత సిగ్గు మాలిన సన్నాసి రాజకీయ నాయకుడ్ని చూస్తామనుకోలేదు. స్వాతంత్య్ర ఉద్యమ వీరుల్ని గుర్తు చేసుకోవాల్సిన ఇవాళ ఆ సన్నాసి మాటలు వినడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మేము మాట్లాడాల్సి రావడం దురదృష్టకరం.

ఎగిరిపడే ఆకులా పవన్‌:
    ‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’ అన్న సామెత మనందరికీ తెలుసు. ఆ సెలబ్రిటీ పార్టీ నాయకుడి పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలాగే ఉంది. జ్ఞానం, ఆలోచన, అనుభవం, కమిట్‌మెంట్‌.. ఇవన్నీ ఉన్న మా నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలుచుకున్నా.. అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఏరోజూ ఆయన నోరు పారేసుకోలేదు. పొడిచేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం, చెప్పు తీసుకుని కొడతాం, తాట తీస్తాం, తోలు వలుస్తాం..వంటి భాషను ప్రయోగించలేదు. 
    దాదాపు 15 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉండి, కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ ఆ సెలబ్రిటీ పార్టీ నాయకుడు మాత్రం ఎగిరెగిరి పడుతున్నాడు. ఆయనకు సమయం, సందర్భం లేదు. రిపబ్లిక్‌ డేనా, ఇండిపెండెన్స్‌ డేనా అన్న ధ్యాస కూడా లేదు. ప్రత్యేకమైన రోజుల్లో ఏ విధంగా మాట్లాడాలి.. ఎంత గౌరవంగా వ్యవహరించాలి అన్న జ్ఞానం కూడా లేదు. అందుకే ఎగిరెగిరి పడ్డాడు. 

‘సబ్‌ ప్లాన్‌’ తెలియని అజ్ఞాని:
    తాను ఒక సెలబ్రిటీ పార్టీ నాయకుణ్ని కాబట్టి, ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నాడేమో.. అందుకే పైనుంచి ఊడిపడ్డట్టు పెద్ద జ్ఞానిలా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఎస్సీ సబ్‌ప్లాన్‌ అంటే ఏంటో తెలియని అజ్ఞాని పవన్‌కళ్యాణ్‌. సబ్‌ప్లాన్‌ను ప్లానింగ్‌ కమిషన్‌ 2014లోనే రద్దు చేశారని, ఇప్పుడు ఉన్నదాన్ని ఎస్సీ కాంపొనెంట్‌ అని కూడా అతనికి తెలియదు.
    ఇవాళ మా ప్రభుత్వం డీబీటీ, నాన్‌ డీబీటీ విధానంలో 32 పథకాల ద్వారా రూ.60 వేల కోట్లకు పైగా ప్రయోజనాలను ఎస్సీలకు అందించింది. మరో రూ.16 వేల కోట్లకు పైగా ప్రయోజనాలను ఎస్టీలకు అందజేస్తున్నాం. అణగారిన వర్గాల ఆర్థిక అభివృద్ధికి సంక్షేమ పథకాల ద్వారా డబ్బు పంపిణీ చేస్తున్నాం. ఇందులో తప్పేం ఉంది?. కానీ ఇవేవీ పవన్‌కు తెలియవు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవడం. ఇవాళ కూడా పవన్‌కల్యాణ్‌ తెగ ఊగిపోతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి, సమాజానికి ఏం సందేశం ఇచ్చాడు?. 

అప్పట్లో పానకం.. ఇప్పుడు పూనకాలా?:
     రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణను చంద్రబాబు వ్యతిరేకించాడు కాబట్టి పవన్‌కళ్యాణ్‌ కూడా వ్యతిరేకిస్తున్నాడు. అది వారిష్టం. ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజాధాని ఇవ్వడానికి వీల్లేదని, అలా ఇస్తే అమరావతిలో చంద్రబాబు బినామీలు కొన్న భూముల రేట్లు పడిపోతాయన్నది వారి బాధ. 
    మా విధానం మూడు రాజధానులు. అదే మాట మేమంటే.. పవన్‌కళ్యాణ్‌ మాత్రం రాష్ట్ర విభజన అని మాట్లాడుతున్నాడు. మేం మూడు రాష్ట్రాలు అన్లేదు. మూడు ప్రాంతాలు అభివృద్ధి మా సిద్ధాంతం అని స్పష్టంగా చెప్పాం. అభివృద్ది వికేంద్రీకరణ మా పార్టీ విధానం. మూడు రాజధానులు మా విధానం. ఐదు కోట్ల మంది సంక్షేమం మా ప్రభుత్వ విధానం. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాల అభివృద్ధి మా నాయకుడి విధానం. మా విధానం ఏదైతే అదే మా నాయకుడి నోటి వెంట వస్తుంది. అందుకే ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరాలన్న అభిప్రాయంతో ఎవరైనా మోతాదు పెంచి ఒక వ్యాఖ్య చేస్తే దాన్ని పట్టుకుని ఊగిపోవడం.. నోటికొచ్చినట్లు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడటం సెలబ్రిటీ పార్టీ నాయకుడికి మంచిది కాదు. 

చరిత్ర తెలియని హీనుడు పవన్‌:
    ఇక డీసెంట్రలైజేషన్‌ను పవన్‌ ఏకంగా బెంగాల్‌ విభజనతో పోల్చాడు. వందేమాతరం ఉద్యమం అంటూ తనకు తాను ఒక జ్ఞాని అనుకుంటూ పిచ్చిగోల పెడుతున్నాడు. ఆ మధ్య కాలంలో కేఏ పాల్‌ పార్టీ పెట్టాడు కదా.. ఆయన కూడా ఏదేదో ప్రపంచ మేధావులు గురించి మాట్లాడుతూ ఉంటాడు కదా.. ఖచ్చితంగా అతనికి ఈ సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్‌కళ్యాణ్‌కు ఏమాత్రం తేడా లేదు.
    అసలు పవన్‌ ప్రస్తావిస్తున్న నాటి బెంగాల్‌ విభజన, వందే మాతరం ఉద్యమం ఎప్పుడు జరిగాయి? ఈయన మాటల్లోని వ్యక్తులు అప్పట్లో అసలు పుట్టారా? లేదా? అనేది చరిత్రలో తేదీలతో సహా తెలుస్తుంది. స్వాతంత్య్రోద్యమ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేకుండా.. ఏవేవో అభూత కల్పనలతో మాట్లాడి పెద్ద జ్ఞానిలా బిల్డప్‌ ఇవ్వడం రాజకీయాల్లో మంచిది కాదని పవన్‌ తెలుసుకోవాలి. 

పవన్‌ లెంపలేసుకో:
    తన కారును, తన పర్యటనను ఎవరో ఆపుతారంటూ.. పవన్‌ పదే పదే చెబుతున్నాడు. అసలు ఆ అవసరం ఎవరికీ లేదు. 
    ‘పవన్, నువ్వు ఏ కారులో తిరిగితే మాకేం నష్టమయ్యా?. నీ దగ్గర బాగా డబ్బుందేమో పెద్ద పెద్ద ఎల్తైన కార్లలో తిరుగు. ఇక్కడ ఎవడు భయపడతాడు? నిన్ను అడ్డుకోవాల్సిన ఖర్మ ఇక్కడెవడికి పట్టింది?’. అందుకే ఇకనైనా వాస్తవాలు గుర్తించు. 
    ప్రత్యేకమైన రోజుల్లో ఏమైనా మాట్లాడే ముందు ఒక విధానం ఉండాలి. ఊగిపోయి, ఆవేశపడిపోయి మాట్లాడితే నీ పిచ్చి కుర్రాళ్లు కేరింతలు కొడతారేమో గానీ.. రాజకీయాల్లో ఇది పారదు. నీ స్నేహితులు పెద్ద పెద్ద రచయితలున్నారు కదా.. కనీసం, ఈరోజు ప్రత్యేకత గురించి ఏం మాట్లాడాలో రాసివ్వమంటే రాసిచ్చేవాళ్లు కదా.. ఇలా సన్నాసి మాటలు మాట్లాడటం ఎందుకు..? రిపబ్లిక్‌ డే నాడు ఇన్ని బూతులు మాట్లాడినందుకు లెంపలేసుకుంటే మంచిది. 

ఆ అర్హత నీకు లేదు:
    ఇక, జగన్‌ గారి కేరెక్టర్‌ గురించి ఏవేవో కారుకూతలు, పిచ్చికూతలు మాట్లాడాడు. నువ్వు ఒక వేలు చూపితే.. మేం నీమీద పది వేళ్లు మేము చూపెట్టగలం. మా నాయకుడు, ఐదు కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి. మా గౌరవ ముఖ్యమంత్రి నీకులాగా, నీ దత్తతండ్రి చంద్రబాబులాగా తూలనాడే వ్యక్తి కాదు. 
    ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని నీ దత్తదండ్రిలా ఏనాడూ మాట్లాడలేదు. ఒక సంస్కారిలా, సున్నిత మనస్కుడిలా బడుగు, బలహీనవర్గాలు, అణగారిన జాతుల అభివృద్ధికి కృషి చేసే నాయకుడు. అందుకే ఆయన క్యారెక్టర్‌ గురించి మాట్లాడే అర్హత నీకే మాత్రం లేదు.

మీది దోపిడి విధానం:
    విశాఖపట్నం స్టీల్‌ప్లాంటు గురించి మాకు తెలియదా..? మేమేమైనా  చిన్నపిల్లలమా...? ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించి మా ధర్మాన ప్రసాదరావు ఏదో ప్రాంతీయ ఉద్దేశంతో ఒక మాట మాట్లాడితే.. నువ్వేదో పెద్ద జ్ఞానిలా ఊగిపోవడం పద్ధతి కాదు. నీది, చంద్రబాబుది దోపిడీ విధానమైతే.. మాది అభివృద్ధి విధానం.
    రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాల్ని కాపాడాలి. గౌరవించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆర్థిక బలోపేతానికి పని చేసిందంటే అది ఒక్క వైయస్సార్‌సీపీ మాత్రమే. సచివాలయ, ఆర్బీకే, హెల్త్‌ క్లినిక్‌ వ్యవస్థలతో పాటు నాడు–నేడు పేరిట విద్యాభివృద్ధితో ఎస్సీ ఎస్టీలు సుబిక్షంగా ఉన్నారు. పక్కరాష్ట్రాలు కూడా ఈ వ్యవస్థల్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ధాన్యం కొనుగోలు బిల్లులను మా ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తోంది. 

 
కనీస ఐడియాలజీ లేదు:
    పవన్‌ ప్రధానిని కలిస్తే ఎవరి మీద చెబుతాడు? చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలు ధ్వంసం చేస్తే.. వాటన్నింటినీ మా ప్రభుత్వం వచ్చి కట్టిందని ప్రధానికి చెప్పమనండి. పవన్‌ మాటల్లో ఎక్కడైనా కనీస ఐడియాలజీ ఉండదు.

ఎవరు భయపడతారు?:
    ఇక, ఎవడి కులం వాడికి గౌరవం. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ‘ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అంటే ఎవరి ఒళ్లు ఎవరు దగ్గర పెట్టుకుంటారు?. నీ ఒళ్లు నీ దగ్గర పెట్టుకో.. లోకేష్‌ మార్నింగ్‌ వాక్, ఈవినింగ్‌ వాక్‌ చేసినా శారీరకంగా తగ్గుతారేమో గానీ ఊడబొడిచేదేమీ లేదు. వీళ్లంతా పోలోమంటూ యాత్రలు చేస్తే ఇక్కడ భయపడటానికి ఎవరుంటారు..? ఎందుకుంటారు..? వాళ్లు తిరిగిన ప్రతీచోటా ప్రజలే మాకు ప్రభుత్వం ఈ పథకాలన్నీ ఇస్తోందని చెబుతారు. 
    కాగా, తాము పరిపాలన రాజధానిని ఉగాదికల్లా వైజాగ్‌కు తరలించాలని సీఎం గారిపై ఒత్తిడి చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top