తాడేపల్లి: ప్రభుత్వ నిర్ణయాలు, నిబంధనలకు విరుద్ధంగా సంతబొమ్మాళి గ్రామ కార్యదర్శి విడుదల చేసిన సర్కులర్ వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనే అనుమానం కలుగుతుందని, టీడీపీ రాష్ట్ర అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో వివాదాస్పద చర్య జరగడం.. వెంటనే చంద్రబాబు, లోకేష్ ట్విట్టర్‌లో స్పందించడం వెనుక ఏదో కుట్ర కోణం ఉన్నట్టుగా అనిపిస్తుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. వివాదస్పద ఆదేశం ఇచ్చిన కనక సత్యప్రసాద్ అనే పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామన్నారు. పేదలకు ప్రయోజనం కలిగించేందుకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను తీసుకువచ్చామని, పేదవాడంటే.. తెలుగుదేశం పార్టీకి ఎందుకంత కక్ష అని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పేదలందరికీ శాశ్వత ఇళ్లు ఉండాలనేది సీఎం వైయస్ జగన్ లక్ష్యమని, ఆ లక్ష్యం మేరకే నవరత్నాలు–పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా అర్హులందరికీ ఇళ్ల పట్టాలు మంజూరు చేసి.. ఇళ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా సుదీర్ఘ పాదయాత్ర వచ్చిన వినతుల మేరకు బలహీనవర్గాల గృహ సముదాయాలు, ఇండిపెండెంట్ ఇళ్లను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేసి వాటి మీద లబ్ధిదారులకు పూర్తి హక్కు కల్పించాలని సీఎం వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతంలో ప్రభుత్వాల ద్వారా పొందిన గృహాల యజమానులకు ఆ ఇంటిపై పూర్తి హక్కులు కల్పించేందుకు జగనన్న శాశ్వత గృహ హక్కు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి కరపత్రం పంపించి.. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని, జరిగే ప్రయోజనాన్ని, ఇంటి హక్కుపై అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఇందులో ఎలాంటి బలవంతం లేదని, ఆసక్తితో ముందుకువచ్చిన వారి ఇంటిని వారి పేరు మీద బదలాయించాలని, గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి అనే గ్రామంలో కనక సత్యప్రసాద్ అనే పంచాయతీ కార్యదర్శి ప్రభుత్వ నిర్ణయాలకు భిన్నంగా ఒక సర్కులర్ ఇచ్చాడని, ప్రభుత్వం వెంటనే విచారణ చేసి ఆ అధికారిని సస్పెండ్ చేసిందన్నారు. రేషన్ ఆపేస్తామని, పెన్షన్ ఆపేస్తామని ఆ సర్కులర్‌లో పెట్టాడని, ఆ మాటలు ఎవరు చెప్పారో.. ఎందుకు రాశాడో.. ఇందులో ఎవరి హస్తం ఉందో తెలియాల్సి ఉందన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో ఈ ఘటన జరిగిందని, గ్రామ కార్యదర్శి సర్కులర్ ఇవ్వగానే.. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు. ఎంత ప్లాన్డ్‌గా కుట్ర జరుగుతుందో ఆలోచన చేయాలన్నారు. శాశ్వత గృహ హక్కు పథకం బలవంతం కాదు. బలహీనవర్గాల గృహ లబ్ధిదారులకు మంచి అవకాశం దయచేసి వినియోగించుకోండి అని, అధికారులు అవగాహన కల్పించాలని పదే పదే క్లియర్‌గా చెబుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రిగా, బాధ్యతగా చెబుతున్న మాటలను పట్టించుకోకుండా.. ఒక గ్రామ కార్యదర్శి దురుద్దేశపూర్వకంగా.. బహుశా అచ్చెన్నాయుడు ప్రమేయంతో చేయించారేమో.. దానిపై వెంటనే తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అవ్వడం అన్యాయమన్నారు. పేదవాడంటే టీడీపీకి ఎందుకంత కక్ష అని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. స్కీమ్‌లో ఏమైనా తప్పులు, సవరణలు ఉంటే చెబితే సరిదిద్దుతాం.. పేదవాడికి మంచి చేయాలనే ప్రభుత్వ ఉద్దేశంపై బురదజల్లాలని చూడటం దుర్మార్గమన్నారు. విజయనగరంలో ఒక ఇల్లు రూ.10 లక్షలు, విశాఖపట్నంలో ఒక ఇల్లు రూ.15 లక్షల విలువ ఉంది. దాన్ని రూ.20 వేలకు దఖలు పరుస్తామని, సొంత చేసుకోండి అని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఏదైనా ఆపద వస్తే తాకట్టుకు, పిల్లల చదువులు, పెళ్లీళ్లకు విక్రయించేందుకు హక్కు కల్పిస్తామని, వీలుంటే చేసుకోండి అని చెబుతున్నామని, ఇందులో ఎలాంటి బలవంతం లేదన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.