చంద్రబాబూ.. ఇక నీ ఆటలు.. మాటలు సాగవు

ప్రగల్భాలతోనే చంద్రబాబు కాలం వెల్లదీశాడు

మహానేత వైయస్‌ఆర్‌ హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందింది

భూ సేకరణ, భూ సమీకరణ పేదల కోసం మాత్రమే

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: రాష్ట్ర ప్రజల్లో చైతన్యం ఉంది కాబట్టే చంద్రబాబును చిత్తుగా ఓడించి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రగల్భాలతోనే చంద్రబాబు కాలం వెల్లదీశాడని, బాబు ఏం సాధించాడని విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటిస్తాడని ధ్వజమెత్తారు. టీడీపీ అవినీతిని ప్రజలు గ్రహించే 23 స్థానాలకు పరిమితం చేశారని, ఇంకా ఏ మొహం పెట్టుకొని ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నావ్‌ చంద్రబాబూ అని ప్రశ్నించారు. విశాఖపట్నంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సేకరణ, భూ సమీకరణ పేదల కోసం మాత్రమేనని.. టీడీపీలా దోచుకోడానికి కాదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించారని, టీడీపీ నాయకులు ఎలా దోచుకున్నారో జిల్లా ప్రజలే చంద్రబాబు వివరిస్తారన్నారు. విశాఖ జిల్లాలో బాబు పర్యటన తర్వాత టీడీపీకి ఉన్న కాస్త గౌరవం, విశ్వాసం కూడా పోవడం ఖాయమన్నారు.

భూ సేకరణలో ప్రజలు అసంతృప్తిగా ఉంటే వీలైతే ఓ రూపాయి ఎక్కువైనా ఇచ్చి వారిని సంతృప్తి పరచాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందని, ప్రకృతి కూడా బాగా సహకరించి పంటలు సమృద్ధిగా పండినయన్నారు. మళ్లీ సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో సకాలంలో వర్షాలు పడి రైతులు సంతోషంతో ఉన్నారన్నారు. విజయనగరం జిల్లా ప్రజలు చైతన్య వంతులు కాబట్టే వైయస్‌ఆర్‌‡సీపీకి తొమ్మిది సీట్లు కట్టబెట్టారని తెలిపారు. నోటికి ఏది వస్తే అది ఆలోచన లేకుండా మాట్లాడుతూ చంద్రబాబు దిగజారిపోతున్నాడన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపు పర్యటనలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లో విందుకు సీఎం వైయస్‌ జగన్‌కు ఆహ్వానం రాలేదని చంద్రబాబు ఏవేవో మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నాలుగుసార్లు గెలిచిన నవీన్‌ పట్నాయక్‌ను, మమతా బెనర్జీకి ఎందుకు ఆహ్వానం రాలేదు బాబూ అని ప్రశ్నించారు.  

విశాఖలో సమ్మిట్లు పెట్టి, కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు పెట్టి సింగపూర్, దావోస్, జపాన్‌ అంటూ చంద్రబాబు విదేశాలు తిరిగి ఏం సాధించారని ప్రశ్నించారు. మహానేత వైయస్‌ఆర్‌ విదేశాలకు వెళ్లకుండానే పరిశ్రమలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రప్పించారని గుర్తుచేశారు. హైటెక్‌ సిటీలో జరుగుతున్న కార్యకలాపాలు వైయస్‌ఆర్‌ హయాంలోనే వచ్చాయని, విశాఖలో రామ్‌కీ సెజ్, జవహార్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీ, ఐటీ పార్కు, విప్రో, బ్రాండిక్స్, సత్యం కంప్యూటర్స్‌ ఇవన్నీ వైయస్‌ఆర్‌ హయాంలోనే వచ్చాయన్నారు.

 

Back to Top