ఒంగోలు: ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఒంగోలులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు, వైయస్‌ఆర్ జిల్లాలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో 4,400 సీట్లకు 71 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 470 సెంటర్లు, తెలంగాణలో 8 సెంటర్లు ఏర్పాటు చేసి సెప్టెంబర్ 26న ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించామని చెప్పారు. రికార్డు సమయంలో 10 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు సాంకేతిక విద్య అందించాలనే ఉన్నత ఆశయంతో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ట్రిపుల్ ఐటీలను స్థాపించారని, ట్రిపుల్ ఐటీలు వైయస్‌ఆర్ మానస పుత్రికలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. త్వరలోనే ఒంగోలుట్రిపుల్ ఐటీకి శాశ్వత భవనాన్ని నిర్మించనున్నామని, సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. రూ.180 కోట్లు దారిమళ్లించిన చంద్రబాబు.. 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో రూ. 180 కోట్ల నిధులను చంద్రబాబు దారిమళ్లించాడని మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. విద్యను కూడా వ్యాపార ధోరణితో చూస్తూ విద్యాలయాలకు చెందాల్సిన నిధులను రాజకీయం కోసం వాడుకోవడం తెలుగుదేశం పార్టీకే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ నాయకత్వంలో విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ నూతన జవసత్వాలు ఇస్తున్నామన్నారు. విద్యాలయాలకు కావాల్సిన నిధులు, భవనాలు, ఆడిటోరియాలు, ల్యాబ్స్ కోసం సమృద్ధిగా నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు.